సర్వేల పేరుతో ఆదివాసీలను మోసగిస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-12-12T04:17:22+05:30 IST

సర్వేల పేరుతో పోడు భూములకు పట్టాలు మంజూరులో జాప్యం చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఆదివాసీలు, పోడుసాగుదారులను మోసం చేస్తోందని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు.

సర్వేల పేరుతో ఆదివాసీలను మోసగిస్తున్న ప్రభుత్వం

ఫారెస్టు అధికారి హత్యకు రాష్ట్రప్రభుత్వానిదే బాధ్యత

అదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు

ఏన్కూరు/ జూలూరుపాడు/ చండ్రుగొండ, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): సర్వేల పేరుతో పోడు భూములకు పట్టాలు మంజూరులో జాప్యం చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఆదివాసీలు, పోడుసాగుదారులను మోసం చేస్తోందని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. ఇటీవల రేంజర్‌ శ్రీనివాసరావు హత్య జరిగిన ఎర్రబోడు గొత్తికోయ గ్రామానికి వెళ్లే క్రమంలో ఆయన ఆదివారం ఖమ్మం జిల్లా ఏన్కూరు, భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో ఆగారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడుసాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలని కేంద్రప్రభుత్వం చెప్పినప్పటికీ... రాష్ట్రప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు. పోడు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోవడం వల్లే అటవీ అధికారి శ్రీనివాసరావు హత్య జరిగిందని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, రాష్ట్ర ప్రభుత్వంపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న 3.50 లక్షలమందికి తక్షణమే పట్టాలు మంజూరు చేయాలన్నారు. జీవో 3ను యథావిధిగా కొనసాగించాలని, పోడు సాగుదారులందరికీ పట్టాలు మంజూరు చేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆయనవెంట బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్‌ తదితర నాయకులు ఉన్నారు.

ఎర్రబోడు గొత్తికోయ గ్రామం సందర్శన....

గతనెల 22న అటవీశాఖ రేంజర్‌ శ్రీనివాసరావు హత్యజరిగిన చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామశివారులోని ఎర్రబోడు గొత్తికోయ గ్రామాన్ని బీజేపీ నేత, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు ఆదివారం సందర్శించారు. శ్రీనివాసరావు హత్యకు దారితీసిన పరిణామాలపై వలస ఆదివాసులను అడిగి తెలుసుకున్నారు. ఆదివాసులపై అధికారులు దాడులు చేయడంతోనే శ్రీనివాసరావు హత్య జరిగిందనీ, పోడు భూములకు ప్రభుత్వం హక్కులు కల్పించి ఉంటే ఈ దుస్థితి ఏర్పడేదికాదని అన్నారు. ఆదివాసీలను బహిష్కరిస్తూ చేసిన తీర్మానం ఉపేక్షించేది కాదన్నారు. ఎర్రబోడు గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-12-12T04:17:22+05:30 IST

Read more