podu lands: పోడుకు హక్కు!

ABN , First Publish Date - 2022-11-12T04:38:49+05:30 IST

పోడు భూములపై ఎట్టకేలకు ప్రభుత్వం ముందడుగు వేసింది. పోడు సాగుదారులకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు రంగం సిద్ధం చేసింది.

podu lands: పోడుకు హక్కు!

సాగుదారుల చేతికి 10 లక్షల ఎకరాలు

4.14 లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం

వచ్చే నెలలో పత్రాల పంపిణీకి సర్కారు కసరత్తు

పరిశీలనలో మూడు రకాల నమూనా పత్రాలు

దరఖాస్తుదారుడికి సగటున రెండున్నర ఎకరాలు

వాటికీ రైతు బంధు, రైతు బీమా అందేలా చర్యలు

వచ్చే నెలలో పట్టాలు అందజేత!

భూముల సర్వే, పరిశీలన పూర్తికి చర్యలు: సత్యవతి

హైదరాబాద్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పోడు భూములపై ఎట్టకేలకు ప్రభుత్వం ముందడుగు వేసింది. పోడు సాగుదారులకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు రంగం సిద్ధం చేసింది. వచ్చే నెలలో హక్కు పత్రాలను పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 10 లక్షల ఎకరాల పోడు భూములకు సంబంధించిన హక్కు పత్రాలను లబ్ధిదారులకు అందజేయనుంది. ఈ మేరకు 4.14లక్షల మంది దరఖాస్తుదారులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం అధికారులు మూడు రకాల నమూనా పత్రాలను పరిశీలిస్తున్నారు. వాస్తవానికి పోడు భూముల సమస్య కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అటవీ హక్కులచట్టం-2006 ప్రకారం కటాఫ్‌ తేదీని 2005 డిసెంబరు 13గా నిర్ణయించి, 3 లక్షల ఎకరాలకు సంబంధించిన హక్కుపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. మరో 9 లక్షల ఎకరాలకు సంబంధించిన దరఖాస్తులు అప్పటి నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో అటవీ అధికారులు, పోడు సాగుదారుల మధ్య ఏటా గొడవలు జరగడం పరిపాటిగా మారింది.

ఈ నేపథ్యంలోనే పోడు సమస్యను పరిష్కరిస్తామని 2018 ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే గత ఏడాది సెప్టెంబరు 16న మంత్రి సత్యవతి రాథోడ్‌ చైర్మన్‌గా, మంత్రులు జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, ఇంద్రకరణ్‌రెడ్డి సభ్యులుగా కేబినెట్‌ సబ్‌ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ సూచన మేరకు గత ఏడాది నవంబరు 8 నుంచి డిసెంబరు 8 వరకు పోడు సాగుదారుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. ఈ మేరకు కటాఫ్‌ సంవత్సరాన్ని 2018 వరకు పెంచింది. గతంలో మిగిలిపోయిన 9లక్షల దరఖాస్తులతోపాటు కొత్తగా అందిన లక్ష దరఖాస్తుల పరిశీలనకు గ్రామ, సబ్‌ డివిజనల్‌, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు ఖరారు చేసిన వారికే ప్రస్తుతం హక్కు పత్రాలను అందించనున్నారు. మొత్తంగా 4.14 లక్షల మందికి 10 లక్షల ఎకరాలకు సంబంధించిన హక్కు పత్రాలు అందజేయనున్నారు. సబ్‌కమిటీ ఏర్పాటైన 15 నెలల తరువాత పోడు అంశానికి మోక్షం లభించింది.

సగటున రెండున్నర ఎకరాలు..

ఒక్కో దరఖాస్తుదారుడికి సగటున రెండున్నర ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటైన తరువాత మొదటిసారి ఇస్తున్న పోడు హక్కు పత్రాలను పకడ్బందీగా అందించాలని సర్కార్‌ భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే మూడు రకాల నమూనా పత్రాలను పరిశీలిస్తుండగా, రంగులు ఎలా ఉండాలన్న అంశంపై చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల వెరిఫికేషన్‌ పూర్తయ్యేలోగా నమూనా పత్రాల మోడల్‌ కూడా ఖరారు కానుంది. వచ్చే నెలలో లబ్ధిదారులకు హక్కు పత్రాలు అందనున్నాయి. కేంద్రం, ఆర్‌వోఎ్‌ఫఆర్‌ నిబంధనలను పాటిస్తూ హక్కు పత్రాలు జారీ చేయడంతోపాటు ఆయా భూములకూ రైతు బంధు, రైతుబీమా అందించేలా చర్యలు తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా, దరఖాస్తు చేసుకునేందుకు నెల రోజుల సమయం మాత్రమే ఇవ్వడం అన్యాయమని, అందులోనూ 15రోజుల పాటు దరఖాస్తులే స్వీకరించలేదని తెలంగాణ గిరిజన సంఘం నేత శ్రీరాంనాయక్‌ తెలిపారు. సుమారు 40 వేల మంది ఇంకా దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని, ప్రభుత్వం స్పందించి వారికి మరో అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.

Updated Date - 2022-11-12T04:38:49+05:30 IST

Read more