ఐదో విడత పాదయాత్ర భైంసా నుంచి

ABN , First Publish Date - 2022-09-30T08:08:31+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టనున్న ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముథోల్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని భైంసా నుంచి ప్రారంభం కానుంది.

ఐదో విడత పాదయాత్ర భైంసా నుంచి

  • 15న ప్రారంభించనున్న బండి
  • కరీంనగర్‌లో ముగింపు సభ
  • త్వరలో రూట్‌మ్యాప్‌ ఖరారు

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టనున్న ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముథోల్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని భైంసా నుంచి ప్రారంభం కానుంది.  వచ్చే నెల 15నుంచి ఐదో విడత పాదయాత్ర చేస్తానని సంజయ్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బాసరలో సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్యకర్తలు, నాయకులతో కలిసి సంజయ్‌ భైంసా వెళతారు. అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. ముగింపు బహిరంగసభ కరీంనగర్‌లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. పాదయాత్రకు సంబంధించి రూట్‌మ్యాప్‌ త్వరలో ఖరారు చేయనున్నారు. 


సునీల్‌ బన్సల్‌కు మునుగోడు బాధ్యతలు

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌కు పార్టీ జాతీయ నాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. మునుగోడు ఉప ఎన్నిక సన్నద్ధత బాధ్యతలను నేరుగా పర్యవేక్షించాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో మునుగోడు నియోజకవర్గ ముఖ్య నేతలతో ఆయన సమీక్షించనున్నారు. పోలింగ్‌ బూత్‌ కమిటీలపై చర్చించడంతో పాటు ఎన్నిక సన్నద్ధతకు సంబంధించి దిశా నిర్దేశం చేయనున్నారని పార్టీవర్గాలు తెలిపాయి.

Read more