‘ఉపాధ్యాయ ఉద్యమ సూర్యుడు’నాగటి కన్నుమూత

ABN , First Publish Date - 2022-10-11T10:13:39+05:30 IST

ఉపాధ్యాయ ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించి..

‘ఉపాధ్యాయ ఉద్యమ సూర్యుడు’నాగటి కన్నుమూత

  • అనారోగ్యంతో నారాయణ తుదిశ్వాస
  • స్వగ్రామం ఖమ్మం జిల్లా పెద్దబీరవల్లిలో నేడు అంత్యక్రియలు

బోనకల్‌, కవాడిగూడ, అక్టోబరు 10: ఉపాధ్యాయ ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించి.. ‘ఉపాధ్యాయ ఉద్యమ సూర్యుడి’గా పేరొందిన యూటీఎఫ్‌ ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర పేరెంట్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి నాగటి నారాయణ (66) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం హైదరాబాద్‌లో తుది శ్వాసవిడిచారు. 2014లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణ భార్య అమృత మృతిచెందగా, ఆయన తీవ్రగాయాల పాలయ్యారు. వారికి ఓ కుమార్తె ఉన్నారు. భార్య మరణంతో కుంగిపోయిన ఆయన.. కొంతకాలానికి కాలేయ సంబంధ వ్యాధి బారిన పడ్డారు. ప్రస్తుతం వైద్యం పొందుతున్న ఆయనకు ఆపరేషన్‌ చేస్తే కోలుకుంటారని భావిస్తున్న సమయంలో మృతి చెందారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలంలోని పెద్దబీరవల్లిలో సుందరమ్మ, సామేలు దంపతులకు 1956లో నారాయణ జన్మించారు.


డిగ్రీ పూర్తయ్యాక చిన్నతనంలోనే ఆయనకు పెళ్లయింది.  భార్య అమృత కూలీ పనులు చేసి ఆయనతో టీటీసీ పూర్తి చేయించారు.. 1980లో ఉపాధ్యాయ కొలువొచ్చింది. 2014లో ఉద్యోగ విరమణ పొందారు. ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరిన తర్వాత సీపీఎం అనుబంధ యూటీఎ్‌ఫలో కీలకంగా ఎదిగారు. కాగా నారాయణ అంత్యక్రియలను ఆయన స్వగ్రామమైన పెద్దబీరవల్లి గ్రామంలో మంగళవారం నిర్వహిస్తారు.  

Updated Date - 2022-10-11T10:13:39+05:30 IST