రాష్ట్ర స్థాయిలోనే ఇంజనీరింగ్‌ ఫీజుల ఖరారు

ABN , First Publish Date - 2022-07-07T08:31:32+05:30 IST

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజులు త్వరలో ఖరారు కానున్నాయి. ఈ మేరకు అధికారులు కసరత్తును ప్రారంభించారు.

రాష్ట్ర స్థాయిలోనే ఇంజనీరింగ్‌ ఫీజుల ఖరారు

  • నేటి నుంచి కాలేజీల వారీగా సమావేశం
  • 10 రోజుల్లో ప్రక్రియ పూర్తి.. ఆ తర్వాత కొత్త ఫీజుల ఉత్తర్వులు


హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజులు త్వరలో ఖరారు కానున్నాయి. ఈ మేరకు అధికారులు కసరత్తును ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఫీజులతో సంబంధం లేకుండా రాష్ట్ర స్థాయిలోనే ఫీజులను నిర్ణయించనున్నారు. ఇందులో భాగంగా గురువారం నుంచి ఆయా కాలేజీలతో ప్రత్యేకంగా సమావేశాలను ఏర్పాటు చేసి ఫీజుల అంశంపై చర్చించనున్నారు. ఈ మేరకు తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎ్‌ఫఆర్‌సీ) షెడ్యూల్‌ను ప్రకటించింది. దీని ప్రకారం... ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మొత్తం 145 ఇంజనీరింగ్‌ కాలేజీలతో సమావేశాలు జరగనున్నాయి. రోజూ కొన్ని కాలేజీల యాజమాన్యాలతో సమావే శాలను నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫీజులను ఖరారు చేస్తూ టీఏఎ్‌ఫఆర్‌సీ ఉత్తర్వులను జారీ చేయనుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్‌ కాలేజీలకు కొత్త ఫీజులను నిర్ణయించాల్సి ఉంది. ఈ ఫీజులు 2024-25 వరకు అమల్లో ఉంటాయి. ఇప్పటికే బీఎడ్‌, లా వంటి కోర్సుల ఫీజులను ఖరారు చేశారు. ఇంజనీరింగ్‌తోపాటు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తి విద్యా కోర్సుల ఫీజులను ఇంకా నిర్ణయించాల్సి ఉంది.


 ప్రస్తుతం రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ ఫీజులు కనిష్ఠంగా రూ.30వేలు ఉండగా, గరిష్ఠ ఫీజు రూ.1.34లక్షల వరకు ఉంది. అయితే ఫీజులను కనీసం 50శాతం పెంచాలని కోరుతూ కాలేజీలు టీఏఎ్‌ఫఆర్‌సీకి ప్రతిపాదనలను సమర్పించాయి. సాధారణంగా ఈ ఫీజులను... కాలేజీల్లో ఉన్న మౌలిక సదుపాయాలు, టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ సిబ్బందికి చెల్లించే వేతనాలు, కాలేజీకి వచ్చే ఆదాయం, వ్యయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఖరారు చేస్తారు. ఆయా కాలేజీలు ఇప్పటికే ఈ వివరాలను ఏఎ్‌ఫఆర్‌సీకి సమర్పించాయి. వీటిని ప్రస్తుతం టీఏఎ్‌ఫఆర్‌సీ ఆడిటర్లు పరిశీలిస్తున్నారు. కాగా... దేశంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కనీస ఫీజును రూ.79,600గా, గరిష్ఠ ఫీజును రూ.1.89 లక్షలుగా బీఎన్‌ శ్రీకృష్ణ ఆధ్యక్షతన నియమించిన నిపుణుల కమిటీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇదే విషయాన్ని ఏఐసీటీఈ అన్ని రాష్ట్రాలకు తెలియజేసింది. అయితే దీనిపై చర్చించిన అధికారులు... కేంద్రం ప్రతిపాదించిన ఫీజులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, రాష్ట్ర స్థాయిలోనే ఫీజులను ఖరారుచేయాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని కేంద్రానికి స్పష్టం చేస్తూ లేఖ రాశారు. దానికి కొనసాగింపుగానే ఫీజుల ఖరారుకు సంబంధించిన షెడ్యూల్‌ను టీఏఎఫ్‌ఆర్‌సీ ప్రకటించింది.

Read more