దేశానికి కేసీఆర్‌ నాయకత్వం అవసరం

ABN , First Publish Date - 2022-09-17T08:35:56+05:30 IST

‘‘వర్తమాన రాజకీయాల్లో కేసీఆర్‌ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడం ద్వారా బీజేపీ దుర్మార్గ రాజకీయాలను తిప్పికొట్టాలి.

దేశానికి కేసీఆర్‌ నాయకత్వం అవసరం

  • బీజేపీ దుర్మార్గ రాజకీయాలను తిప్పికొట్టాలి
  • ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధం
  • సీనియర్‌ నాయకుల తరఫున సంపూర్ణ మద్దతు
  • జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిస్తున్నా
  • గుజరాత్‌ మాజీ సీఎం శంకర్‌సింగ్‌ వాఘేలా
  • 5 గంటల భేటీ.. జాతీయ అంశాలపై సుదీర్ఘ చర్చ

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ‘‘వర్తమాన రాజకీయాల్లో కేసీఆర్‌ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడం ద్వారా బీజేపీ దుర్మార్గ రాజకీయాలను తిప్పికొట్టాలి. ఇందుకోసం తనలాంటి సీనియర్ల సంపూర్ణ మద్దతు కేసీఆర్‌కు ఉంటుంది’’ అని గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌ సింగ్‌ వాఘేలా అన్నారు. ప్రగతి భవన్‌లో శుక్రవారం సీఎం కేసీఆర్‌తో ఆయన భేటీ అయ్యారు. సుమారు ఐదు గంటల పాటు పలు జాతీయ స్థాయి అంశాలపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా శంకర్‌సింగ్‌ వాఘేలా మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, జాతి అభివృద్ధే ధ్యేయంగా రాజకీయాల్లో కొనసాగుతున్న వారందరూ బీజేపీ రాజకీయాల పట్ల ఆందోళనతో ఉన్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న విచ్ఛిన్నకర విధానాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని తెలిపారు. ఈ పరిస్థితిని చూస్తూ ఊరుకోలేక, నిలువరించే దిశగా సరైన వేదిక దొరక్క తనలాంటి సీనియర్‌ నేతలు ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. కేంద్ర విధానాలను కేసీఆర్‌ ప్రతిఘటిస్తున్న తీరు.. తనలాంటి వారిని ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. 


తెలంగాణ సాధన.. చాలా గొప్ప విషయం

శాంతియుత పంథాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం దేశ చరిత్రలో గొప్ప విషయమని వాఘేలా అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. విభజన తర్వాత తెలంగాణకు అండగా నిలవాల్సిన కేంద్రం... అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర సర్కారును అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తున్నా మొక్కవోని పట్టుదలతో కేసీఆర్‌ ముందుకు సాగుతున్న తీరు అద్భుతమని ప్రశంసించారు. రాష్ట్రాల్లో అధికార పార్టీలను భయభ్రాంతులకు గురిచేస్తూ, లొంగదీసుకోవాలనే కుట్రను బీజేపీ అమలు చేస్తోందని ఆరోపించారు. దేశంలో మత సామరస్యానికీ, ప్రాంతీయ సామరస్యానికీ విఘాతం కలిగిస్తున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ తన అనుభవాన్ని తెలంగాణకే పరిమితం చేయకుండా దేశానికి విస్తరించాలని ఆకాంక్షించారు.


కాంగ్రెస్‌కు నాయకత్వ లోపం

ప్రస్థుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఉంటుందనుకున్న కాంగ్రెస్‌ పార్టీ.. నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతోందని వాఘేలా అన్నారు. బీజేపీ దుర్మార్గాలను ఎదుర్కొనేందుకు రాజకీయ వ్యూహాలను అమలు చేయడంలో ఆ పార్టీ విఫలమవుతోందని వ్యాఖ్యానించారు. దేశంలో భావసారూప్యత కలిగిన విపక్షాలను కలుపుకొనిపోయేందుకు కేసీఆర్‌ నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. ఆయన నాయకత్వంలో పనిచేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని, తమ సంపూర్ణ మద్దతు ఆయనకు ఉంటుందని స్పష్టం చేశారు. తామంతా కలిసి నిర్ణయించుకున్న తర్వాతే కేసీఆర్‌తో సమావేశం కావడానికి హైదరాబాద్‌ వచ్చానని వివరించారు. జాతీయ రాజకీయాల్లోకి వచ్చి దేశ గతిని మార్చాల్సిందిగా కేసీఆర్‌ ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వాఘేలా ఆహ్వానానికి సీఎం కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. వాఘేలా వంటి నాయకుడు తనకు మద్దతు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు.

Read more