కేంద్రం ఇవ్వాల్సింది 7,183 కోట్లు

ABN , First Publish Date - 2022-04-24T09:16:35+05:30 IST

తెలంగాణకు రావాల్సిన రూ.7,183 కోట్లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, దమ్ముంటే ఆ నిధులను తీసుకురావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు మంత్రి హరీశ్‌ రావు సవాల్‌ విసిరారు.

కేంద్రం ఇవ్వాల్సింది 7,183 కోట్లు

  • దమ్ముంటే ఆ నిధులను తీసుకురండి
  • కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు మంత్రి హరీశ్‌ సవాల్‌
  • బీజేపీ పాదయాత్రలో చెప్పేవన్నీ ఝూటా మాటలే


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు రావాల్సిన రూ.7,183 కోట్లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, దమ్ముంటే ఆ నిధులను తీసుకురావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు మంత్రి హరీశ్‌ రావు సవాల్‌ విసిరారు. ఒక అబద్ధాన్ని మళ్లీ మళ్లీ చెప్పి నిజమని చిత్రీకరించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. శనివారం టీఆర్‌ఎ్‌సఎల్పీలో మీడియా సమావేశంలో పీయూసీ చైర్మన్‌ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, చంటి క్రాంతికిరణ్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్‌ అన్నీ అబద్ధాలే చెబుతున్నారని, తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను కేంద్ర సర్కారు ఇవ్వడం లేదన్న వాస్తవాన్ని ప్రజలకు వివరించాలన్నారు.


కాగ్‌ నివేదిక ఆధారంగా కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల బకాయిలు, ఏటా చెల్లిస్తున్న పన్నులు, అక్కడి నుంచి రాష్ట్రానికి మంజూరు చేస్తున్న నిధుల వివరాలను ఈ సందర్భంగా ఆయన విడుదల చేశారు.  తెలంగాణకు కేంద్రం రూ.3 లక్షల కోట్లు ఇచ్చిందని, ఆసరా పింఛన్లు తామే ఇస్తున్నామంటూ బండి సంజయ్‌ అన్నీ ఝూటా మాటలే చెబుతున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆసరా లబ్ధిదారులకు రూ.2,116 ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఆసరా పింఛన్ల కోసం కేంద్రం కేవలం 3ు నిధులు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను సకాలంలో చెల్లించాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్‌ కోరారని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తనతోపాటు ప్రభుత్వ విభాగాలు ఎన్నిసార్లు లేఖలు ఇచ్చినా ఫలితం లేకుండా పోతోందన్నారు. 


ఆదాయాన్ని ఎందుకు పంచడం లేదు?

తెలంగాణ నుంచి రూ.3,65,797 కోట్లు కేంద్రానికి పన్నుల రూపంలో ఇవ్వగా.. అక్కడి నుంచి వచ్చింది రూ.1,68,647 కోట్లేనని హరీశ్‌ రావు చెప్పారు. తెలంగాణ ప్రజలు చెల్లిస్తున్న పన్నులను తీసుకుని గుజరాత్‌ వంటి రాష్ట్రాల అభివృద్ధికి ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. పన్నుల్లో 41% రాష్ట్రాల వాటా ఇవ్వాల్సి ఉంటుందని, కేంద్రం 25ు మాత్రమే ఇస్తోందన్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్థికి ఇవ్వాల్సిన రూ.1350 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. 11% సెస్‌ల రూపంలో వస్తున్న ఆదాయాన్ని రాష్ట్రాలకు ఎందుకు పంచడం లేదని ఆయన ప్రశ్నించారు. 


రాష్ట్రాలను బలహీనపర్చే కుట్ర

ఆర్థిక సంఘం ఇచ్చిన సిఫారసులను కేంద్రం పట్టించుకోవడం లేదని, మోదీ సర్కారు రాష్ట్రాలను బలహీనపర్చేందుకు కుట్రలు చేస్తోందని, హక్కులను కాలరాస్తోందని హరీశ్‌ రావు ధ్వజమెత్తారు. పోతిరెడ్డిపాడుకు ఆంధ్ర పాలకులు నీటిని దోచుకెళ్తే మంగళహారతులు ఇచ్చిన ఘనత డీకే అరుణదని, ఆర్డీఎస్‌ కోసం పోరాటం చేసింది టీఆర్‌ఎసేనని చెప్పారు.  


రెండు, మూడు రోజుల్లో పోలీస్‌ నోటిఫికేషన్‌?

పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ రెండు, మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌పై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పోలీసు ఉద్యోగాల్లో పలు కేటగిరీ పోస్టులు ఉంటాయని, వాటిని సమన్వయం చేసుకుంటూ నోటిఫికేషన్‌ విడుదలకు కసరత్తు జరుగుతోందన్నారు. 

Read more