అసెంబ్లీని రాజకీయ వేదికగా మార్చారు

ABN , First Publish Date - 2022-09-13T10:07:25+05:30 IST

సీఎం కేసీఆర్‌ తెలంగాణ అసెంబ్లీని రాజకీయ వేదికగా మార్చుకున్నారు.

అసెంబ్లీని రాజకీయ వేదికగా మార్చారు

మోటార్లకు మీటర్లు.. కేంద్ర బిల్లులో లేదు

బీఆర్‌ఎస్‌ పెట్టుకోండి.. వీఆర్‌ఎస్‌ తీసుకోండి

జాతీయ పార్టీ పెడితే మాకే అభ్యంతరం లేదు

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు


హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం కేసీఆర్‌ తెలంగాణ అసెంబ్లీని రాజకీయ వేదికగా మార్చుకున్నారు. ఈ రెండు రోజులు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే ఎజెండాగా మార్చుకోవడం దురదృష్టకరం. కేసీఆర్‌ తనకు ప్రత్యక్ష, పరోక్ష మిత్రులైన మజ్లిస్‌, కాంగ్రె్‌సతో కూడబలుక్కుని అసెంబ్లీలో మాట్లాడారు. ప్రధాని మోదీపై, కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయాలో ముందుగానే మాట్లాడుకుని.. ఆ ప్రకారమే ఆ మూడు పార్టీలు ఆరోపణలు చేశాయి’’ అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు సంస్కరణ బిల్లులో ఎక్కడా లేదని వివరించారు. ‘‘విద్యుత్తు సంస్కరణల బిల్లు-2020ని ఈ ఏడాది పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, సెలెక్ట్‌ కమిటీకి పంపారు. పార్లమెంట్‌లో ఇంకా పాసవ్వని బిల్లు గురించి, అసెంబ్లీలో చర్చించారు. ఆ బిల్లులోని సెక్షన్‌ 65లో రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా వర్గాలకు సబ్సిడీలు ఇవ్వడంలో అభ్యంతరం లేదని స్పష్టంగా ఉంది. అయినా.. తప్పుడు ప్రచారంతో మోటార్లకు మీటర్లంటూ నిందలు మోపుతున్నారు’’ అని రఘునందన్‌ ఎద్దేవా చేశారు. ఈ బిల్లుపై కేంద్రంపై వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నోరు మెదపలేదని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని, అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా చర్చేంటని ప్రశ్నించారు. ‘‘మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక.. కరెంటులేని 18 వేల గ్రామాలకు విద్యుత్తు సరఫరా జరిగేలా చేశారు. విద్యుత్తు బకాయీలపై ఏపీ-తెలంగాణ పేచీలను చర్చలతో పరిష్కరించవచ్చు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పెట్టుకున్నా.. వీఆర్‌ఎస్‌ పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. ‘‘బీజేపీ ఎవరి మాట వినదని, విపక్షాలను గౌరవించదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెబుతున్నారు. ఇక్కడ కేసీఆర్‌ చేస్తుందేమిటి? అసెంబ్లీలో విపక్ష పార్టీ సభ్యులకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు. గౌరవించడం అనేది మీ నుంచే (కేసీఆర్‌) ప్రారంభం కావాలి. మంగళవారం మాకు మాట్లాడే అవకాశం ఇస్తే.. అధికారపార్టీ లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతాం’’ అని రఘునందన్‌ వెల్లడించారు.


ఈటల సస్పెన్షన్‌పై అసెంబ్లీ లాబీల్లో చర్చ

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను శాసనసభ నుంచి సస్పెండ్‌ చేస్తారంటూ సోమవారం అసెంబ్లీ లాబీల్లో జోరుగా చర్చ జరిగింది. ఆయన సభలోకి అడుగు పెట్టగానే.. శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సస్పెన్షన్‌ తీర్మానాన్ని ప్రవేశపెడతారని, స్పీకర్‌ దానిని ఆమోదించి, సభ నుంచి సస్పెండ్‌ చేస్తారన్న ప్రచారం సాగింది. అయితే.. ఈటల సభకు హాజరు కాకపోవడంతో ఉత్కంఠకు తెర పడింది. శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి మర మనిషిలా వ్యవహరిస్తున్నారంటూ ఈటల రాజేందర్‌ ఈ నెల 6న వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే పలువురు మంత్రులు ఈ వ్యాఖ్యలను ఖండించారు. స్పీకర్‌కు ఈటల క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. కానీ.. ఈటల తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఒకవేళ ఈటల రాజేందర్‌ మంగళవారం హాజరైతే.. సస్పెన్షన్‌ తప్పదని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.

Read more