ఉద్యమకారుడిని సీఎం చేస్తే టోపీ పెట్టాడు

ABN , First Publish Date - 2022-05-30T09:21:01+05:30 IST

ఉద్యమకారుడిని ముఖ్యమంత్రిని చేస్తే ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అందరికీ టోపీ పెట్టారని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల..

ఉద్యమకారుడిని సీఎం చేస్తే టోపీ పెట్టాడు

  • ఢిల్లీ వెళ్లి నాటకాలు ఆడుతున్నాడు: షర్మిల
  • ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కొనసాగుతున్న పాదయాత్ర

సత్తుపల్లి, మే 29: ఉద్యమకారుడిని ముఖ్యమంత్రిని చేస్తే ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అందరికీ టోపీ పెట్టారని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల.. సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. కొన్ని రోజుల విరామం అనంతరం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో తన పాదయాత్రను పునఃప్రారంభించిన ఆమె ఆదివారం యాత్రను కొనసాగించారు. సత్తుపల్లి మండలం సిద్ధారం, సదాశివునిపాలెం, భీమవరం గ్రామాల మీదుగా వేంసూరు మండలంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా సదాశివునిపేటలో నిర్వహించిన రైతుగోస ధర్నాలో ఆమె మాట్లాడారు. ‘‘వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్‌ ఆయన సొంతపొలం లో వరి ఎలా వేశాడు?  ఢిల్లీ వెళ్లి నాటకాలడి రైతులందరినీ నట్టేట ముంచాడు. ఈ యాసంగిలో రైతులంతా నష్టపోయినా పైసా సాయం చేయలేదు. రుణమాఫీతో పాటు రైతుబీమా ప్రశ్నార్థకమైంది. రుణమాఫీ ఎగ్గొట్టడంతో.. బ్యాంకువాళ్లు రైతులను దొంగలుగా చూస్తూ వారి ఇళ్లను జప్తు చేస్తున్నారు. గత్యంతరం లేక రైతులు ఎక్కువ వడ్డీలకు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేసి, వాటిని అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’’ అని షర్మిల అన్నారు. 


నేటి పాదయాత్ర ఇలా.. 

 సోమవారం ఉదయం మర్లపాడు నుంచి షర్మిల యాత్ర ప్రారంభమవుతుంది. రాయిడుపాలెం, కొత్తూరు క్రాస్‌రోడ్‌, కల్లూరుగూడెం, ఎర్రసానివారిబంజర, మొద్దులగూడెం మీదుగా అడసర్లపాడుకు చేరుకుంటుంది.

Read more