‘రిజిస్ట్రేషన్ల నిషేధం’పై వెనక్కి!

ABN , First Publish Date - 2022-09-24T07:39:33+05:30 IST

అనధికార లే అవుట్లలోని స్థలాల రిజిస్ర్టేషన్లపై విధించిన నిషేధంపై ప్రభుత్వం యూటర్న్‌ తీసుకోనుంది. ఆయా లే...

‘రిజిస్ట్రేషన్ల నిషేధం’పై వెనక్కి!

  • డబుల్‌ ఫీజులు.. డబుల్‌ ఆదాయం
  • అనధికార లే అవుట్లలోని స్థలాలకూ రిజిస్ట్రేషన్‌!
  • అభివృద్ధి చార్జీల వసూలుతో అనుమతికి నిర్ణయం.. 
  • భారీ ఆదాయమే లక్ష్యంగా ప్రభుత్వం యూటర్న్‌!
  • ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం నాడు రిజిస్ట్రేషన్లపై నిషేధం
  • సుప్రీంకోర్టులో కేసుతో ప్రత్యామ్నాయ మార్గం
  • అభివృద్ధి చార్జీల సొమ్ము కోసం ప్రత్యేక ఖాతా
  • ఎల్‌ఆర్‌ఎస్‌ కింద వచ్చిన దరఖాస్తులకే వర్తింపు!
  • క్రమబద్ధీకరణకు 25.59 లక్షల దరఖాస్తులు..
  • 6 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా

అనధికార లే అవుట్లలో స్థలాల రిజిస్ట్రేషన్లతో ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతుంది. స్థలం విలువలో 7.5 శాతంగా చెల్లించే రిజిస్ట్రేషన్‌ ఫీజుతోపాటు అభివృద్ధి చార్జీల పేరుతో భారీగానే చార్జీలు వసూలు చేయనున్నారు. ఇది ఎంత శాతం అన్నదానిపైనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం గృహాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి ఆయా స్థలాలను ఎల్‌ఆర్‌ఎస్‌ కింద  క్రమబద్ధీకరణ చేయకున్నా ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. ఇందుకోసం ప్రత్యామ్నాయ విధానాన్ని అమలు చేస్తోంది. దీని ప్రకారం.. స్థలం విలువలో 14.5 శాతాన్ని అభివృద్ధి చార్జీల కింద చెల్లిస్తే ఎల్‌ఆర్‌ఎస్‌తో సంబంధం లేకుండానే అనుమతులు ఇచ్చేస్తున్నారు. నిర్మాణ అనుమతుల ఫీజుకు అదనంగా దీనిని వసూలు చేస్తున్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ల విషయంలోనూ ఇదే పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించారు.


హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): అనధికార లే అవుట్లలోని స్థలాల రిజిస్ర్టేషన్లపై విధించిన నిషేధంపై ప్రభుత్వం యూటర్న్‌ తీసుకోనుంది. ఆయా లే అవుట్లలోని స్థలాలకూ ఇకపై రిజిస్ట్రేషన్‌ చేయనుంది. ఇందుకు సంబంధించి గతంలో తాను జారీ చేసిన ఉత్తర్వులకే కాకుండా.. ఆ ఉత్తర్వుల్లోని స్ఫూర్తికి కూడా విరుద్ధంగా వెళ్లనుంది. రూ.వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేసింది. దీనిపై కొద్ది రోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎ్‌స)లో క్రమబద్ధీకరించిన లే అవుట్లలోని స్థలాలకు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయాలనే నిబంధనపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండడం, దాంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ఆదాయం రాకుండాపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎల్‌ఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చార్జీల పేరిట పెనాల్టీ వసూలు చేస్తూ అనధికార లే అవుట్ల స్థలాలకు రిజిస్ట్రేషన్‌ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ పెనాల్టీ సొమ్మును జమ చేసేందుకు ఒక ప్రత్యేక హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌ను కూడా ఏర్పాటు చేయనుంది.


 దీంతో ఓవైపు రిజిస్ట్రేషన్‌ ఫీజులు, మరోవైపు అభివృద్ధి చార్జీలతో రెట్టింపు ఆదాయం రాబట్టాలనే అభిప్రాయంతో ఉంది. అనధికార లే అవుట్లలోని స్థలాల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ ప్రభుత్వం 2020 ఆగస్టులో మెమో జారీ చేసిన విషయం తెలిసిందే. స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ ఐజీ ఈ మెమోను జారీ చేశారు. నగరపాలక సంస్థలు, డీటీసీపీ తదితర సాధికార సంస్థల అనుమతి తీసుకోకుండా చేసిన అనధికార లే అవుట్లు, గ్రామ పంచాయతీల అనుమతులు మాత్రమే తీసుకుని చేసిన లే అవుట్లలోని స్థలాల క్రయవిక్రయాలను రిజిస్ట్రేషన్‌ చేయకూడదంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పటికే ఒకసారి క్రయవిక్రయాలు జరిగిన స్థలాలకు మాత్రం మినహాయింపునిస్తూ.. మొదటిసారి రిజిస్ట్రేషన్‌కు వచ్చే స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయకూడదని ప్రకటించారు. దీంతో అనధికార లే అవుట్లలో.. ఒక్కసారి కూడా విక్రయించనివి, విక్రయించినా రిజిస్ట్రేషన్‌ కాని స్థలాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.


2020 ఆగస్టులో ఎల్‌ఆర్‌ఎస్‌..

అనధికార లే అవుట్లలో రిజిస్ర్టేషన్లను ఆపేసిన కొద్దిరోజులకే 2020 ఆగస్టులోనే ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని తీసుకువస్తూ ప్రభుత్వం జీవో 131ను జారీ చేసింది. అనధికార లే అవుట్లలో ఉన్న స్థలాలు, లేకుంటే మొత్తానికి మొత్తంగా అనధికార లే అవుట్లను ఈ పథకం కింద క్రమబద్ధీకరించుకుంటేనే మళ్లీ ఆయా స్థలాలు, లే అవుట్లలోని స్థలాల రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇస్తామనిపేర్కొంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 25.59 లక్షల మంది ఎల్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో గ్రామ పంచాయతీల పరిధి నుంచి 10,83,394 దరఖాస్తులు, మునిసిపాలిటీల పరిధిలో నుంచి 10,60,013, నగర పాలక సంస్థల పరిధి నుంచి 4,16,155  దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులకు రుసుముగా స్థలానికైతే రూ.1,000, లే అవుట్లకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం వసూలు చేసింది. దీంతో దరఖాస్తు ఫీజు కిందే ప్రభుత్వానికి రూ.257.47 కోట్ల ఆదాయం వచ్చింది. అనంతరం ఈ దరఖాస్తులన్నింటినీ పరిశీలించి.. ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం కింద ఆమోదించే పనిని ప్రారంభించింది. ఇలా ఎల్‌ఆర్‌ఎస్‌ కింద వసూలు చేసే క్రమబద్ధీకరణ ఫీజుల ద్వారా సుమారు రూ.6 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఆ తర్వాత ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంపై కొన్ని సామాజిక సంస్థలు కోర్టులో కేసులు వేశాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవే కాకుండా.. తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల్లో పెట్టిన ఇలాంటి పథకాలపైనా కేసులు వేశారు. ఈ రాష్ట్రాల్లోని కేసులన్నీ కలిపి ఉమ్మడి కేసుగా ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణలో ఉన్నాయి. 


రిజిస్ట్రేషన్‌ నిలిపివేతపై వెనక్కి..

ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంపై రూ.వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వే సుకున్న ప్రభుత్వం.. దీనిపై సుప్రీంకోర్టులో బలమైన వాదనలే వినిపించింది. ఈ పథకాన్ని అనుమతించాలని కోరింది. ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా వచ్చిన డబ్బునంతా ఆయా అనధికార స్థలాలు, లే అవుట్లను అభివృద్ధి చేసేందుకు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వెచ్చిస్తామని తెలిపింది. అంతేకాకుండా.. ఈ డబ్బు మొత్తాన్ని ఒక ప్రత్యేక ఖాతాలో ఉంచి ఆ పనులకు వినియోగిస్తామని పేర్కొంది. ఈ పథకం కింద క్రమబద్ధీకరించాక లక్షల స్థలాలు అందుబాటులోకి వస్తాయని, గృహ నిర్మాణం పుంజుకుంటుందని, ఎక్కడికక్కడ అభివృద్ధి జరుగుతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.


అయితే ఇష్టారాజ్యంగా లే అవుట్లు వేసుకునే సమయంలో ప్రభుత్వం చూస్తూ ఊరుకుని.. ఇప్పుడు ఆదాయం కోసం అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ అనడం సరికాదని పిటిషనర్లు వాదించారు. దీంతోపాటు అనేక ఇతర అంశాలనూ వారు లేవనెత్తారు. ఈ కేసు ఇలా కొనసాగుతుండగా.. ఇప్పుడు అత్యవసరంగా ఆదాయాన్ని ఆర్జించే మార్గాలను వెతికే క్రమంలో ఎల్‌ఆర్‌ఎస్‌ పథకానికి ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. అనధికార లే అవుట్లలోని స్థలాలను కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అనుమతించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అంటే గతంలో రిజిస్ట్రేషన్లను ఆపేయాలంటూ తానిచ్చిన ఉత్తర్వులపై తానే యూటర్న్‌ తీసుకుంటోంది. 


డబుల్‌ ఫీజులు.. డబుల్‌ ఆదాయం

అనధికార లే అవుట్లలో స్థలాల రిజిస్ట్రేషన్లతో ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతుంది. స్థలం విలువలో 7.5 శాతంగా చెల్లించే రిజిస్ట్రేషన్‌ ఫీజుతోపాటు అభివృద్ధి చార్జీల పేరుతో భారీగానే చార్జీలు వసూలు చేయనున్నారు. ఇది ఎంత శాతం అన్నదానిపైనే చర్చ నడుస్తోంది. నిర్మాణ అనుమతి సమయంలో వేస్తున్న 14.5 శాతం అభివృద్ధి చార్జీలనే రిజిస్ట్రేషన్ల విషయంలోనూ వసూలు చేద్దామా? అన్న ఆలోచన చేస్తున్నారు. అయితే ఇంత శాతం అంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, దీనిని సుమారు ఏడు శాతంగా నిర్ణయిస్తే సరిపోతుందన్న అభిప్రాయం కూడా ఉంది. ఇందులోనూ కొంత భాగం ఇప్పుడు వసూలు చేసి, కొంత భాగాన్ని భవిష్యత్తులో ఇళ్ల నిర్మాణం సమయంలో వసూలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. 


ప్రత్యామ్నాయ పథకానికీ నిబంధనలు

ప్రభుత్వం నిర్ణయించిన ప్రత్యామ్నాయ పథకాన్ని అమలుచేసే విషయంలోనూ కొన్ని నిబంధనలు విధించాలని నిర్ణయించారు. క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసిన లే అవుట్‌లో కనీసం 10 శాతం స్థలాలు ఎల్‌ఆర్‌ఎస్‌ నోటిఫికేషన్‌ ఇచ్చే సమయానికే (2020 ఆగస్టు నాటికే) అమ్మకమై, రిజిస్ర్టేషన్‌లు జరిగి ఉండాలి. ఇలా ఉంటే ఆ లే అవుట్‌లో మిగిలిన 90 శాతం స్థలాలకు ఈ ప్రత్యామ్నాయ పథకాన్ని వర్తింపజేసి రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఈ రెండేళ్లలో కొత్తగా అనధికార లే అవుట్లు వేసినవారిని ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతోనే ఈ నిబంధన విధించనున్నారు. అదే సమయంలో.. 2020 ఆగస్టులో తెచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం కింద దరఖాస్తు చేసుకున్నవారికే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉన్న స్థలాలు, 30 ఫీట్ల రోడ్లులేని ఇళ్ల స్థలాలు, ఇతర ఉల్లంఘనలు ఉన్న స్థలాల క్రమబద్ధీకరణకు అనుమతించకపోవచ్చని సమాచారం. 


Updated Date - 2022-09-24T07:39:33+05:30 IST