వీడని వాన!
ABN , First Publish Date - 2022-09-11T10:14:40+05:30 IST
వీడని వాన!

పలు జిల్లాల్లో భారీ వర్షాలు
పొంగిన వాగులు, వంకలు, చెరువులు
కారు వాగులో పడి ఒకరి దుర్మరణం
పిడుగుపాటుకు 10 మూగజీవాల మృతి
కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో ఘటనలు
భూపాలపల్లిలో కొట్టుకుపోయిన 200 గొర్రెలు
సాగర్, శ్రీశైలానికి భారీగా ఇన్‌ఫ్లో
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
నేడు, రేపు అతి భారీ వర్షాలు
హైదరాబాద్‌కు కుంభవృష్టి సూచన
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్)
రాష్ట్రాన్ని వర్షాలు వీడడం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు శనివారం కూడా కొనసాగాయి. వీటి ప్రభావంతో అనేక చోట్ల వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు నానా ఇక్కట్ల పాలయ్యారు. కొన్ని ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండగా, చాలా వరకు కోతకు గురయ్యాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లా ఏడుపాయలలో ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో వన దుర్గామాత ఆలయాన్ని మూసివేశారు. అనేక కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి గంగమ్మవాగులో కారు బోల్తా పడి కామారెడ్డి పట్టణానికి చెందిన క్యాతం వెంకటి (47) మృతి చెందాడు. భారీ వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారాంపల్లిలో 20 ఎకరాల్లో మామిడి చెట్లు కూకటి వేళ్లతో సహా నేలమట్టమయ్యాయి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూర్‌లో పిడుగుపడి 9 ఆవులు, ఒక లేగదూడ చనిపోయాయి. నిర్మల్ జిల్లా కడెం, దస్తూరాబాద్, ఖానాపూర్ మండలాల్లో దాదాపు 600 ఎకరాల్లో మొక్కజొన్న పంట ధ్వంసమైంది. భూపాలపల్లి జిల్లాలోని పలు మండలాల్లో వందలాది ఎకరాల్లో వరిగ, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. గూడూరు చెరువు తెగిపోవడంతో వరద ఉధృతికి 200 గొర్రెలు కొట్టుకుపోయాయి. కాగా, భారీ వర్షాల కారణంగా భూపాలపల్లి ఏరియా సింగిరేణిలో 3,500 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భద్రాద్రి జిల్లా సుజాతనగర్ మండలం యదుళ్లవాగు బ్రిడ్జి భారీ వర్షాలకు కుంగిపోవడంతో 9 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రంగారెడ్డి జిల్లాలో వందలాది ఎకరాల్లో పంటలు నీటి పాలయ్యాయి. శనివారం జగిత్యాల జిల్లా కధలాపూర్ మండలంలో అత్యధికంగా 14.18 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇదే జిల్లా కొడిమ్యాలలో 13.82, మల్యాలలో 11.61, నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో 11.18, కోరుట్లలో 10.96 సెం.మీ. వర్షపాతం కురిసింది. ఇక, హైదరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల తీవ్రతతో కూడిన వర్షంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. అనేక చోట్ల రహదారులను ముంచెత్తిన వరద నీటితో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. కాగా, జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్సాగర్లకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో గండిపేటలో 6, హిమాయత్‌సాగర్‌లో 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టులు ఫుల్
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. శనివారం సాయంత్రం నాటికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 4.38 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 22 గేట్లను ఎత్తి 3.48 లక్షల క్యూసెక్కులకు దిగువకు వదులుతున్నారు. సాగర్ పూర్తి స్థాయి నిల్వ సామర్ధ్యం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 588.10 అడుగులకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టుకు 3.47 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 10 గేట్లు ఎత్తడం ద్వారా, విద్యుదుత్పత్తి చేస్తూ 4.48 లక్షల క్యూసెక్కుల నీటికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్ధ్యం 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 211.96 టీఎంసీల నీరుంది. ఇక, నారాయణపూర్‌కు 61 వేలు, జూరాలకు 1.70 లక్షలు, తుంగభద్రకు 42 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. కాగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 71,050 క్యూసెక్కుల నీరు చేరుతుండడంతో 12 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బ్యారేజీకి 83,500, మేడిగడ్డకు 3.66 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం హెచ్చరించింది. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వెల్లడించింది. శుక్రవారం వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం శనివారం తీవ్ర అల్పపీడనంగా మారి అదే ప్రదేశంలో కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది. ఈ జిల్లాల్లో ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక, హైదరాబాద్‌లో కొన్ని చోట్ల కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని తెలిపింది.