ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వడానికి తెలంగాణ ఓకే

ABN , First Publish Date - 2022-03-18T09:16:51+05:30 IST

యాసంగి సీజన్‌ (గత ఏడాది) బియ్యం సేకరణకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది.

ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వడానికి తెలంగాణ ఓకే

  • 5.46 లక్షల టన్నులు ఇస్తామని ఎఫ్‌సీఐకి లేఖ
  • రా రైస్‌కు అనుమతి రాకపోవటంతో నిర్ణయం
  • గత యాసంగి బియ్యం సేకరణ సమస్య కొలిక్కి
  • ఈ నెలాఖరుతో ముగియనున్న సీఎంఆర్‌ గడువు


హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్‌ (గత ఏడాది) బియ్యం సేకరణకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. బాయిల్డ్‌ రైస్‌ (ఉప్పుడు బియ్యం) ఇస్తే తీసుకునేదిలేదని, రా రైస్‌ (ముడి బియ్యం) ఇస్తే తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. చివరకు ఫోర్టిఫైడ్‌ రైస్‌(బలవర్థక బియ్యం) సేకరణకు ఇరు ప్రభుత్వాలు అంగీకరించాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌ కుమార్‌ మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. 5.46 లక్షల టన్నుల ‘ఫోర్టిఫైడ్‌ రైస్‌’ ఎఫ్‌సీఐకి ఇస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2020-21 యాసంగి సీజన్‌లో రైతుల నుంచి 92.34 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలుచేసిన విషయం విదితమే. ఆ ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం ఇచ్చారు. భారత ఆహారసంస్థ (ఎఫ్‌సీఐ) టార్గెట్‌ ప్రకారం... 44.75 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌, 17.78 లక్షల టన్నుల రా రైస్‌ కలిపి... మొత్తం 62.53 లక్షల టన్నుల బియ్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) రూపంలో మిల్లర్లు ఇవ్వాల్సి ఉంది. ఇక ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసిన రైస్‌ మిల్లర్లు... రా రైస్‌ 8.03 లక్షల టన్నులు స్టేట్‌ ఏజెన్సీ అయిన పౌరసరఫరాల సంస్థకు ఇచ్చేశారు. 


ఇంకా ఆ బియ్యం పెండింగ్‌ ఉంది. ఇక ఎఫ్‌సీఐకి 41.67 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వగా... ఇంకా 3.10 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ బ్యాలెన్స్‌ ఉంది. ఈ 3.10 లక్షల టన్నుల వరకు బాయిల్డ్‌ రైస్‌ తీసుకోవటానికి ఎఫ్‌సీఐకి ఎలాంటి అభ్యంతరంలేదు. కానీ 6.64 లక్షల టన్నుల ముడి(రా) బియ్యం ఎఫ్‌సీఐకి ఇచ్చే విషయంలోనే కయ్యం ఏర్పడింది. ఈ టార్గెట్‌ను కూడా బాయిల్డ్‌ రైస్‌ రూపంలో ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం... ముడి బియ్యంగానే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం వాదిస్తున్నాయి. గతంలో అనుమతిచ్చిన 44.75 లక్షల టన్నులకు తోడుగా మరో 5.25 లక్షల టన్నులు కలిపి మొత్తం తెలంగాణ టార్గెట్‌ 50 లక్షల టన్నులకు బాయిల్డ్‌ రైస్‌ టార్గెట్‌ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ కేంద్రం అంగీకరించలేదు. మధ్యేమార్గంగా ఓ పరిష్కారాన్ని చూపించింది. బాయిల్డ్‌ రైస్‌ నేరుగా కాకుండా... ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్స్‌(ఎ్‌ఫఆర్‌కే) కలిపి ఇస్తే తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలోనే గత్యంతరంలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వటానికి అంగీకరించింది. 


సమయం లేదు

ఫోర్టిఫైడ్‌ రైస్‌ ఎంతైనా తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో... తెలంగాణ నుంచి పంపిన ప్రతిపాదనలకు వెంటనే అనుమతి లభిస్తుందని ఎఫ్‌సీఐ వర్గాలు చెబుతున్నాయి. అయితే బకాయి ఉన్న బాయిల్డ్‌ రైస్‌ అయినా, తాజాగా ఇచ్చే ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌ రైస్‌ అయినా... ఎఫ్‌సీఐకి ఇచ్చేందుకు మార్చి 31 వరకే తుది గడువు ఉంది. పక్షం రోజుల్లోనే టార్గెట్‌ పూర్తిచేయాల్సి వస్తుంది. నిర్ణీత గడువులోగా రైస్‌మిల్లర్లు టార్గెట్‌ పూర్తిచేయకపోతే... ఆ బియ్యం భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడుతుంది. రెండేళ్ల క్రితం ఇలాగే జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మెట్రిక్‌ టన్నుల బియ్యం రైస్‌మిల్లర్ల వద్దే మిగిలిపోయింది. కాస్త జరిమానా విధించి ఆ బియ్యాన్ని రికవరీచేసేందుకు పౌరసరఫరాల సంస్థ ఇప్పటికీ శ్రమించాల్సి వస్తోంది. ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌ రైస్‌ సేకరణ అనుమతితో పాటు కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగిస్తే ఇబ్బందులు ఉండవు. లేకపోతే ఈనెలాఖరు వరకే 2020-21 యాసంగి బియ్యం సేకరణ టార్గెట్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది.

Updated Date - 2022-03-18T09:16:51+05:30 IST