నామినేషన్‌పై రూ.30 లక్షల పనులు!

ABN , First Publish Date - 2022-02-23T09:07:26+05:30 IST

‘మన ఊరు-మన బడి’ పథకంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభు త్వం..

నామినేషన్‌పై రూ.30 లక్షల పనులు!

‘మన ఊరు-మన బడి’ పథకం పనుల అప్పగింతపై ప్రభుత్వం నిర్ణయం 

రూ.30 లక్షలు దాటిన పనులకే టెండర్లు

పథకం అమలులో కలెక్టర్లదే బాధ్యత

మార్గదర్శకాలు జారీ చేసిన సర్కారు


హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ‘మన ఊరు-మన బడి’ పథకంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభు త్వం.. ఇందుకు వినియోగించనున్న నిధుల విషయంలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ముందుకెళుతోంది. సాధారణంగా ప్రభుత్వపరమైన పనులేవైనా రూ.5 లక్షలలోపు విలువ చేసే పనులను నామినేషన్‌ పద్ధతిన అప్పగించే వీలుంటుంది. రూ.5 లక్షల విలువ దాటిన పనులైతే టెండర్లు పిలిచి ఖరారు చేయాల్సి ఉంటుంది. కానీ, ‘మన ఊరు-మన బడి’ పథకం కింద మాత్రం రూ.30 లక్షల వరకు పనులను నామినేషన్‌ పద్ధతిపైనే అప్పగించాలని నిర్ణయించారు. పనుల విలువ రూ.30 లక్షలు దాటితే ఈ-టెండర్ల ద్వారా ఖరారు చేయనున్నారు. పనులను త్వరితగతిన నిర్వహించడానికిగాను జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో భాగంగా.. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఒకే విధమైన రంగులు వేయనున్నారు. డ్యూయల్‌ డెస్క్‌లు, డిజిటల్‌/స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌ పరికరాలు, పెయింట్స్‌, గ్రీన్‌ చాక్‌బోర్డు, ఫర్నిచర్‌ వంటి వాటిని రాష్ట్ర స్థాయిలోనే కొనుగోలు చేసి, సరఫరా చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 26,285 పాఠశాలలు ఉన్నాయి. గతంలో చేసిన సర్వే ప్రకారం.. ఇందులో సుమారు 10 వేల పాఠశాలల్లో సరైన తరగతి గదులు లేవు. ఇలాంటి స్కూళ్లల్లో చెట్ల కింద, వరండాల్లో బోధిస్తున్నారు. ఇక శిథిలావస్థకు చేరినవి, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పాఠశాలలు సుమారు 4 వేల వరకు ఉన్నాయి. మరో 5-6 వేల స్కూళ్లకు మరమ్మతులు చేయాల్సి ఉంది. మరో 10 వేలకు పైగా పాఠశాలలకు ప్రహరీ గోడలు లేవు. 9-10 వేల పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. దాంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. మన ఊరు-మన బడి పథకంలో భాగంగా ప్రహరీ గోడతోపాటు, టాయిలెట్లు, అదనపు గదుల నిర్మాణం, మంచినీటి సౌకర్యం, రంగులు, పచ్చదనం వంటి 12 రకాల పనులు చేపట్టనున్నారు. రాష్ట్రంలోని మొత్తం స్కూళ్లను మూడుదశల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.7,289 కోట్లు మంజూరు చేసింది. మొదటి దశలో మండలం యూనిట్‌గా విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న 9,123 పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ పాఠశాలల్లో పనుల కోసం సుమారు రూ.3,495 కోట్లు అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 


పథకం అమలుకు మార్గదర్శకాలు ఇవీ..

మన ఊరు-మన బడి పథకం పనులకు సంబంధించిన అంచనా వ్యయాన్ని ఖరారు చేసే ముందు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు సంబంధిత జిల్లా మంత్రి ఆమోదం తెలపాల్సి ఉంది.


రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు ఒకే విధమైన రంగులు వేయాలి. 


ఈ పథకం కోసం జిల్లా కలెక్టర్లు జిల్లా స్థాయిలో ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది.


స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్‌ఎంసీ)లు తమ పరిధిలో రెండు బ్యాంకు అకౌంట్లను తెరవాలి. ఒక అకౌంట్‌ను పనులకు సంబంధించిన నిధుల వ్యయం కోసం, మరో అకౌంట్‌ను దాతలు ఇచ్చే నిధులను డిపాజిట్‌ చేయడానికి ఉపయోగించాలి.


ప్రతి పాఠశాలలో చేపట్టిన పనులపై సోషల్‌ ఆడిట్‌ నిర్వహిస్తారు. మన ఊరు-మన బడిలో భాగంగా కాంపౌండ్‌ వాల్‌, టాయిలెట్‌, కిచెన్‌ షెడ్‌ నిర్మాణాలను ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సి ఉంటుంది. అర్బన్‌ ప్రాంతాల్లోని (మన బస్తీ-మన బడి) పనులకు మాత్రం ఇది వర్తించదు.


ప్రభుత్వ స్కూళ్లలో పెరగనున్న విద్యార్థుల సంఖ్య!

కరోనా పరిస్థితుల్లో ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజులు చెల్లించలేకపోవడం వంటి కారణాలతో ప్రభుత్వ బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది సుమారు 2.5 లక్షల మంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ బడుల్లో చేరారు. మన ఊరు-మన బడి ద్వారా స్కూళ్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాక ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని అంచనా. వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లను కూడా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సర్కారు బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కాగా, మన ఊరు-మన బడి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులకు సూచించారు. ఈ పథకం ద్వారా స్కూళ్లను అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం లభించిందని సోమవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌, సభ్యులు, సర్పంచ్‌ల సమన్వయంతో దీనిని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.


‘మన ఊరు-మన బడి’లో నీటిపారుదల శాఖ

10 జిల్లాల్లో కార్యక్రమం  అమలు బాధ్యతలు 

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం అమలులో నీటిపారుదల శాఖ కూడా చేరింది. భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, మెదక్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లోని 28 మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకాన్ని నీటిపారుదల శాఖ అమలు చేయనుంది. అదనపు తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పన, ఇతర సౌకర్యాలతో పాటు డిజిటల్‌ క్లాస్‌రూమ్‌ల ఏర్పాటు వంటి పనులను ఈ పథకంలో భాగంగా చేపట్టనున్నారు. రూ.7,289 కోట్లతో రెండు దశల్లో చేపట్టే కార్యక్రమంలో తొలి దశలో 9,123 పాఠశాలల్లో రూ.3,497 కోట్లు వెచ్చించనున్నారు. నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు ఆయా మండలాల్లో ఈ పథకం అమలు బాధ్యతలు చూడనున్నారు. వీరికి ఈనెల 24న మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్‌లోని తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగే కార్యక్రమంలో మంత్రి సబిత తర్ఫీదు ఇవ్వనున్నారు. పథకం ఉద్దేశాన్ని వివరిస్తారు. ఆ తర్వాత ఆ శాఖ సిబ్బంది ప్రభుత్వ పాఠశాలల్లో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం అమలులో పాల్గొంటారు. అంతకుముందు 26,065 ప్రభుత్వ బడులను బాగుచేయడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిపాదించగా.. ఈ పథకం అమలు బాధ్యతలను నీటిపారుదల శాఖ స్వీకరించింది.

Read more