నేను కాంగ్రెస్‎లో చేరినా.. నా సంస్థ టీఆర్ఎస్ కోసం పని చేస్తుంది: పీకే

ABN , First Publish Date - 2022-04-24T23:37:46+05:30 IST

తాను కాంగ్రెస్‌లో చేరినా తన ఐప్యాక్ సంస్థ టీఆర్ఎస్ కోసం పని చేస్తుందని కేసీఆర్‌కు ప్రశాంత్‌కిషోర్ తెలిపారు. ప్రగతి భవన్‎లో ..

నేను కాంగ్రెస్‎లో చేరినా.. నా సంస్థ టీఆర్ఎస్ కోసం పని చేస్తుంది: పీకే

హైదరాబాద్: తాను కాంగ్రెస్‌లో చేరినా తన ఐప్యాక్ సంస్థ టీఆర్ఎస్ కోసం పని చేస్తుందని కేసీఆర్‌కు ప్రశాంత్‌కిషోర్ తెలిపారు. ప్రగతిభవన్‎లో కేసీఆర్‎ను కలిసిన ఆయన.. జాతీయ రాజకీయాలపై చర్చించారు. బీజేపీని ఢీకొట్టడంపైనా ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగింది. మూడోకూటమి ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌ను కలుపుకుపోవాలనే విషయంపై ఆలోచించాలని కేసీఆర్‌ను ప్రశాంత్ కిషోర్ కోరారు.  బీజేపీ వ్యతిరేకశక్తులన్నీ ఏకమైతేనే ఆ పార్టీని గద్దె దింపగలమని కేసీఆర్‌కు ఈ సందర్భంగా పీకే వివరించారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించనున్నారని పీకే స్పష్టం చేయడంతో తెలంగాణలోని మిగిలిన పార్టీల స్పందన ఎలా ఉంటుంటో చూడాలి. 


కాగా తెలంగాణలో ఇవాళ అన్ని పార్టీల చూపు ప్రగతిభవన్ వైపు ఉంది. శనివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన ఆయన.. టీఆర్ఎస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించే అంశంపై చర్చించారు. పనిలో పనిగా దేశ రాజకీయాలపైనా ఇద్దరు చర్చించుకున్నారు. సీఎం కేసీఆర్ ఇటీవల కాలంలో బీజేపీయేతర పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. దక్షిణాది రాష్ట్రాలై తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో పాటు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరేనూ ఆయన కలిశారు. దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలని కోరుకుంటున్న తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిసి మద్దతు కోరారు. ఈ నేపథ్యంలో పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్‌ను సలహాదారుగా ఉండాలని కోరారు. అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితిపై సర్వే నిర్వహించాలని పీకేకు సూచించారు. ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా తన టీమ్‌తో సర్వే చేసిన ప్రశాంత్ కిషోర్.. ఆ నివేదికను కేసీఆర్ కు సమర్పించారు. దీంతో సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారం చేపట్టాలనే ఆలోచనలతో అడుగులు వేస్తున్నారు. 


అటు ప్రశాంత్ కిషోర్ కూడా బీజేపీని గద్దె దించాలనే యోచనతో దేశంలోని బీజేపీ యేతర పార్టీలను ఒకే తాటిపైకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అన్ని పార్టీలు కలిసికట్టుగా ఢీకొడితే బీజేపీ ఓటమి ఖాయమని పీకే ఇప్పటికే పలుమార్లు తెలిపారు.  ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. కాంగ్రెస్ పార్టీలో తాను చేరే అంశంపై చర్చించారు. దేశంలో బీజేపీని ఢీకొట్టాలంటే ప్రతిపక్ష పార్టీలన్నీ జత కలవాలని సోనియాకు వివరించారు. అలా తెలంగాణలోనూ టీఆర్ఎస్ పార్టీని కలుపుకొనిపోవాలని సోనియాకు పీకే వివరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ను కలిసి ఈ అంశంపై కూడా పీకే చర్చించినట్లు సమాచారం. Read more