తాత్సారం..

ABN , First Publish Date - 2022-07-06T05:07:12+05:30 IST

తాత్సారం..

తాత్సారం..

కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌ ‘అప్‌గ్రేడ్‌’పై నిర్లక్ష్యం

అర్హత సాధించినా పట్టించుకోని ప్రభుత్వాలు

ఏటా రూ.2.9 కోట్లకుపైగా ఆదాయం

‘ఈనామ్‌’ విధానంలో ‘ప్రత్యక్ష’ కొనుగోళ్లు

పీఎం ఎక్సలెన్సీ అవార్డుతో జాతీయస్థాయిలో గుర్తింపు

వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఆధారం


కేసముద్రం, జూలై 5 : మహబూబాబాద్‌ జిల్లాలోని కేసముద్రం మార్కెట్‌కు అన్ని అర్హతలు ఉన్నా ‘సెలెక్షన్‌ గ్రేడ్‌’గా మారడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వచ్చే ఆదాయం ఆధారంగా 2002లో ‘గ్రేడ్‌-1’ నుంచి ‘ప్రత్యేక హోదా కార్యదర్శి’ స్థాయికి మార్కెట్‌ శాఖ పెంచింది. ఆ తర్వాత ఆదాయం పెరుగుతూ ‘సెలెక్షన్‌ గ్రేడ్‌’ అర్హతలున్నా అప్‌గ్రేడ్‌ చేయకుండా నాటి నుంచి నేటి వరకు రాష్ట్రప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.


తెలంగాణలో నిజామాబాద్‌ తర్వాతి స్థానంలో కేసముద్రం మార్కెట్‌ ఉంది. ఈ క్రమంలో పసుపు రాబడులు క్రమంగా తగ్గుతూ వస్తున్నప్పటికీ ఇతర సరుకుల క్రయవిక్రయాలతో మార్కెట్‌ తన ఆదాయ స్థాయిని యధాతథంగా కొనసాగిస్తోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సెలెక్షన్‌ గ్రేడ్‌ మార్కెట్లుగా వెలుగొందుతున్న వరంగల్‌, నర్సంపేట తర్వాత స్థానంలోని ప్రత్యేక హోదా స్థాయిలోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌ ఆ శాఖకు ఏటా రూ.2.9 కోట్లకుపైగా ఆదాయాన్ని సమకూరుస్తోంది. ఎలకా్ట్రనిక్‌ నేషనల్‌ అగ్రిక్చలర్‌ మార్కెట్‌ (ఈ-నామ్‌) విధా నం అమలుపై ప్రధాన మంత్రి ఎక్సలెన్సీ అవార్డును ఇటీవలె ఈ మార్కెట్‌ దక్కించుకొని దేశంలోనే గుర్తింపు పొందడం గమనార్హం. 


ఆవిర్భావం ఇలా..

స్టేషన్‌ కేసముద్రం మార్కెట్‌రోడ్‌లోని 60 ఏళ్ల క్రితం నాటి పెద్దమిల్లు (పార్‌ పాయిల్డ్‌)ను కేంద్రంగా చేసుకుని 1960లో ధాన్యం క్రయవిక్రయాలు రోడ్డు వెంట ఎండ్ల బండ్లలోనే జరిగేవి. కొద్దికాలం తర్వాత ప్రస్తుతం మార్కెట్‌ ఉన్న ప్రాంతంలోని చెట్లకింద కొనుగోళ్లు జరిపారు. 1965లో కల్వల గ్రామానికి చెందిన గంట సత్తిరెడ్డి తొలి చైర్మన్‌గా లాల్‌బహదూర్‌ గంజ్‌గా 16 ఎకరాల విస్తీర్ణంలో ఈ మార్కెట్‌ ఏర్పాటైంది. ఆ తర్వాతి కాలంలో ఏటేటా అభివృద్ధి చెందుతూ సౌకర్యాలను మెరుగుపర్చుకుంటూ వస్తోంది. 


16 ఎకరాల్లో యార్డు..

కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఎకరం మినహా 16 ఎకరాల విస్తీర్ణంలో రైతులు సరుకులు పోసుకునేందుకు సీసీ చేశారు. యార్డులో 12 కవర్‌షెడ్లతో పాటు విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూ.2 కోట్ల చొప్పున వ్యయంతో నిర్మించిన రెండు పెద్దషెడ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటితోపాటు ఆరు గోదాములు, మార్కెట్‌ భవనం, టీవీ, క్రీడాపరికరాలతో కూడిన రైతు విశ్రాంతి భవనం, కంప్యూటర్‌ తక్‌పట్టీ జారీ చేసే కేంద్రం, సరుకుల నాణ్యతను పరిశీలించే ల్యాబ్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఉన్నాయి. రూ.5లకు సద్దిమూట పథకంలో రైతులకు భోజనం ఏర్పాటు చేశారు. నీటి గుమ్మటం, పశువుల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేశారు. ఈ-నామ్‌ కోసం గేట్ల వద్ద గేట్‌ ఎంట్రీ కేంద్రాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వ్యాపారుల కోసం టెండరింగ్‌ హాల్‌ను, దడువాయిల వద్ద కాంటాలతో అనుసంధానించిన హ్యాండ్‌ డివైజ్‌లు ఏర్పాటు చేశారు. ఈ-నామ్‌ విధానంలో గేట్‌ ఎంట్రీ నుంచి నగదు చెల్లింపుల వరకు అంతా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మార్కెట్‌ను నిర్వహిస్తున్నారు. 


ప్రత్యక్ష పద్ధతిలో కొనుగోళ్లు...

ఈ మార్కెట్లో అడ్తీ కమీషన్‌ లేకుండా నేరుగా ఈ-నామ్‌ విధానంలో ఈ-వేలం (ఈ-టెండర్‌) ద్వారా రైతుల వద్ద నుంచి వ్యాపారులు సరుకును ఖరీదులు చేస్తుంటారు. ఈ-వేలంలో వ్యాపారులు ఎవరు అధికంగా ధర నమోదు చేస్తే వారికి సరుకు దక్కుతుంది. దీంతో వ్యాపారుల మధ్యపోటీతోపాటు అడ్తీ విధానంలో ఉన్నట్లుగా కమీషన్‌లు ఉండవు. పైగా వేలం పాటల అనంతరం సరుకు వివరాలను మార్కెట్‌ తక్‌పట్టీల్లో నమోదు చేసి చెక్కు, నగదును వెంటనే చెల్లిస్తారు. దీంతో ఈ మార్కెట్‌కు జిల్లా నుంచే కాక పొరుగున ఉన్న ఖమ్మం, నల్గొం డ జిల్లాల నుంచి రైతులు సరుకులు తీసుకువస్తుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పసుపు కొనుగోళ్లలో ఏడో మార్కెట్‌గా తెలంగాణలో నిజామాబాద్‌ తర్వాత ద్వితీయస్థానంలో రికార్డుల్లో నమోదైంది. కేసముద్రంలోని కార్మికులు, కూలీలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, వ్యవసాయ అనుబంధ దుకాణాలు, వివిధ వర్గాలంతా మార్కెట్‌పై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉన్నారు. 


రూ.2 కోట్లు ఆదాయం దాటితే....

మార్కెట్‌ నిబంధనల ప్రకారం వార్షికాదాయం వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలు రూ.2 కోట్లు దాటితే ప్రత్యేకహోదా స్థాయి నుంచి సెలక్షన్‌ గ్రేడ్‌ స్థాయికి పెంచాల్సిఉంటుంది. 2013-14 నుంచి ఏటా కేసముద్రం మార్కెట్‌ రూ.2.39 కోట్లకుపైగానే ఆదాయం ఆర్జిస్తోంది. 2017లో మార్కెట్‌ చైర్‌పర్సన్‌ బీరవెల్లి ఉమ భరత్‌కుమార్‌రెడ్డి, ప్రత్యేక హోదా కార్యదర్శి బి.అశోక్‌ హయాంలో మార్కెట్‌ ఆదాయం తొలిసారి రూ.3 కోట్లు దాటడం విశేషం. తాజా చైర్మన్‌ మర్రి నారాయణరావు కృషితో కరోనా సంక్షోభంలోను రూ.2.93 కోట్లు సాధించారు. ఈ ఏడాది గత రికార్డులను చెరిపివేస్తూ రూ.3 కోట్లకంటే అధికంగా ఆదాయం వస్తుందని పాలకమండలి చెబుతోంది. 

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 14 మార్కెట్లలో సెలెక్షన్‌ గ్రేడ్‌స్థాయిలో వరంగల్‌, నర్సంపేట మార్కెట్లుండగా ప్రత్యేకహోదాలో కేసముద్రం, ములుగు, జనగామ, గ్రేడ్‌-1లో మహబూబాబాద్‌, చేర్యాల, గ్రేడ్‌-2 పరకాల, తొర్రూరు, గ్రేడ్‌-3 కొడకండ్ల, ఘనపురం, అసిస్టెంట్‌ గ్రేడ్‌లో వర్ధన్నపేట, ఆత్మకూరు, నెక్కొండ మార్కెట్లు ఉన్నాయి. కేసముద్రం మార్కెట్‌ను సెలక్షన్‌ గ్రేడ్‌ స్థాయికి పెంచితే ఏడీఎం నుంచి మార్కెటింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ (డీడీఎం) స్థాయి అధికారితోపాటు మార్కెట్‌కు సిబ్బంది, నిధులు పెరగనున్నాయి. దీంతో డీడీఎం స్థాయి అధికారి పర్యవేక్షణలో కీలక నిర్ణయాలు ఇక్కడే తీసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మార్కెట్‌ మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ-నామ్‌లో పీఎం ఎక్సలెన్సీ అవార్డు దక్కించుకొని 585 మార్కెట్లలో ప్రథమ స్థానంలో నిలిచి దేశవ్యాప్త గుర్తింపు వచ్చిన ఈ మార్కెట్‌ను ఇప్పటికైనా సెలెక్షన్‌ గ్రేడ్‌ స్థాయికి పెంచాలని రైతులు కోరుతున్నారు.

Read more