యాదృచ్ఛికంగా కలిసిన తమిళిసై, కవిత

ABN , First Publish Date - 2022-10-01T09:08:43+05:30 IST

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, ఎమ్మెల్సీ కవిత అనుకోకుండా ఎదురుపడ్డారు.

యాదృచ్ఛికంగా కలిసిన తమిళిసై, కవిత

  • అమ్మపల్లి ఆలయంలో గవర్నర్‌, ఎమ్మెల్సీ పూజలు
  • బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలని కోరిన కవిత
  • హాజరవకుండానే వెళ్లిన గవర్నర్‌ 

శంషాబాద్‌రూరల్‌/హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, ఎమ్మెల్సీ కవిత అనుకోకుండా ఎదురుపడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం నర్కూడ అమ్మపల్లి (శ్రీ సీతారామచంద్రస్వామి) ఆలయంలో శుక్రవారం పూజలు చేయడానికి వెళ్లిన ఈ ఇద్దరూ యాదృచ్ఛికంగా కలుసుకున్నారు. గవర్నర్‌ను చూసిన కవిత.. ‘బాగున్నారా.. మేడమ్‌..’ అని పలకరించగా.. బాగున్నానని తమిళిసై బదులిచ్చారు. శుక్రవారం ఆలయంలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడానికి వచ్చారు ఎమ్మెల్సీ కవిత. అదే సమయంలో గవర్నర్‌ తమిళిసై ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఒకే సమయంలో ఆలయంలో పూజలు చేశారు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలని గవర్నర్‌ను కవిత కోరారు. పూజలు చేశాక వస్తానన్న గవర్నర్‌, అనంతరం బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనకుండానే వెళ్లిపోయారు. కాగా, కవిత ఆలయం బయటకు వెళ్లిన తర్వాత గవర్నర్‌ మరోసారి ఆలయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. బతుకమ్మ సంబురాల్లో పాల్గొనడం ఇష్టం లేకనే గవర్నర్‌ రెండోసారి ఆలయం లోపలికి వెళ్లి పూజలు చేశారని టీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శించారు. 

Updated Date - 2022-10-01T09:08:43+05:30 IST