చెట్టుపై కత్తి వేటుకు.. లక్ష జరిమానా!

ABN , First Publish Date - 2022-02-19T07:33:36+05:30 IST

పచ్చటి చెట్టుపై పడ్డ కత్తి వేటుకు.. ఆ అధికారి భారీ మూల్యం

చెట్టుపై కత్తి వేటుకు.. లక్ష జరిమానా!

  • ట్రాన్స్‌కో ఏఈకి భారీ ఫైన్‌ విధించిన ఎంపీడీవో


డిచ్‌పల్లి, ఫిబ్రవరి 18: పచ్చటి చెట్టుపై పడ్డ కత్తి వేటుకు.. ఆ అధికారి భారీ మూల్యం చెల్లించుకున్నారు. విద్యుత్‌ తీగలపై పడుతున్న కొమ్మలను అనుమతి లేకుండా నరికివేయించినందుకు ఆ శాఖ ఏఈకి.. స్థానిక ఎంపీడీవో రూ.లక్ష జరిమానా విధించారు. నిజామాబాద్‌ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్‌- నడిపల్లి రోడ్డు పక్కన నాటిన మొక్కలు పెద్దవై.. చెట్లుగా మారాయి. ఈ చెట్ల కొమ్మలు అక్కడి విద్యుత్‌ తీగలపై పడుతుండడం వల్ల.. స్థానికంగా తరచూ విద్యుత్‌ సరఫరా సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో.. ఆ కొమ్మలను నరికి.. ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా ట్రాన్స్‌కో ఏఈ సాయిలు ఆదేశించారు.


స్పందించిన విద్యుత్‌ ఉద్యోగులు.. పది చెట్ల కొమ్మలను నరికివేశారు. అయితే.. అనుమతి లేకుండా చెట్ల కొమ్మలను నరకడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిచ్‌పల్లి ఎంపీడీవో పవన్‌ కుమార్‌.. ఏఈ సాయిలుకు రూ.లక్ష జరిమానా విధించారు. ఈ మేరకు శుక్రవారం నోటీసు జారీ చేశారు. ఒక్కో చెట్టుకు రూ.10 వేల చొప్పున.. మొత్తం పది చెట్లకు గాను ఈ జరిమానా విధించామని, రెండు రోజుల్లో ఈ మొత్తాన్ని గ్రామ పంచాయతీకి జమ చేయాలని ఆదేశించారు. 


Updated Date - 2022-02-19T07:33:36+05:30 IST