కమ్మిన ముసురు

ABN , First Publish Date - 2022-09-10T07:56:22+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

కమ్మిన ముసురు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షం.. హైదరాబాద్‌లో జోరు వాన


పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు

భద్రాద్రి కొత్తగూడెం, సిరిసిల్ల జిల్లాల్లోపిడుగులు పడి ఇద్దరు రైతుల మృతి

మేతకు వెళ్లిన 20 మేకల మృత్యువాత

కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులకు భారీ వరద

తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు

హైదరాబాద్‌లో కుంభవృష్టికి అవకాశం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలను ముసురు కమ్మింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. దీంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాల్వంచ, కొత్తగూడెంలో రహదారులపై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి, సుజాతనగర్‌, ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో భారీ వర్షం పడింది. నిజామాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా మాక్లూర్‌ మండలంలో 4.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ముసురు వాన కురిసింది. లింగంపేట మండలం పోతాయిపల్లి అటవీ ప్రాంతంలో పిడుగు పడి మేతకు వెళ్లిన 20 మేకలు మృతిచెందాయి. తాడ్వాయి మండలం సోమారం-సోమారం తండా మధ్యన గల బతుకమ్మ వాగుకు శుక్రవారం సాయంత్రం వరద పోటెత్తింది. దీంతో ఉదయం పొలాలకు వెళ్లిన 30 మంది రైతులు వాగు అవతలి వైపు చిక్కుకున్నారు. రాత్రి 11.30 దాటినా వరద తగ్గకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్‌ జిల్లాలో మోస్తరు వాన పడింది. పెంబి మండలంలో అత్యధికంగా 6.43 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రాజేంద్రనగర్‌లో అత్యధికంగా 8.6 సెం.మీ వాన పడింది. వికారాబాద్‌ జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వాన పడింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల మోస్తరు వాన పడింది.


అత్యధికంగా రాజేంద్ర నగర్‌ ఏఆర్‌ఎస్‌ వద్ద 8.6 సెం.మీ వాన కురిసింది. కరీంనగర్‌ జిల్లాలో పలు చోట్ల శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కాగా, పత్తి చేలల్లో పిడుగులు పడి శుక్రవారం ఇద్దరు రైతులు చనిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం పెట్రాంచెల్క స్టేజీ గ్రామానికి చెందిన ఇస్లావత్‌ వసంతరావు(22), రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లికి చెందన భాగ్యవ్వ(55) చేనులో పిడుగుపడి చనిపోయారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండల కేంద్రంలో పిడుగుపడి రెండు గేదెలు మృతి చెందాయి. 


శ్రీశైలానికి 4.51 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..

కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌కు 4,41,712 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తోంది. దీంతో 22 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 306.3 టీఎంసీల నీరు ఉంది. సాగర్‌ నుంచి మొత్తం 3.90 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు 3,53,934 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 16 గేట్లను ఎత్తి, కరెంటు ఉత్పత్తి చేస్తే 4,22,489 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 4.51 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. దీంతో 10 గేట్లు ఎత్తారు. ప్రాజెక్టు నుంచి మొత్తం 4.52 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జలాశయం సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 215.80 టీఎంసీల నీరు ఉంది. గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 2.09 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 44 గేట్లు ఎత్తి, విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 2.01 లక్షల క్యూసెక్కులను శ్రీశైలానికి వదులుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలలోని శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులోకి 36,740 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో 8 గేట్ల ద్వారా 24,960 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,088 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. కడెం ప్రాజెక్టులోకి 1,666 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో.. ఒక గేటు ఎత్తి 5,088 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.


అధిక వర్షాలకు ఇదీ కారణం..

కొచ్చి: దేశంలో కొన్ని సంవత్సరాలుగా కురుస్తున్న అధిక వర్షాలకు గల కారణాన్ని కొచ్చి యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలోని అడ్వాన్స్‌డ్‌ సెంటర్‌ ఫర్‌ అట్మాస్పియరిక్‌ రాడార్‌ రీసెర్చ్‌ విభాగం వెల్లడించింది. సంవత్సర కాలం చేసిన అధ్యయనం ప్రకారం మేఘాల్లో గాఢత, ఎత్తు పెరగడమే ఇందుకు కారణమని ప్రకటించింది. గత నలభై సంవత్సరాలుగా ఈ తరహా మేఘాలు పశ్చిమ తీరంలో విస్తరిస్తున్నాయని, అందువల్లే కొన్ని గంటల్లోనే క్లౌడ్‌ బరస్ట్‌ లాంటి కుండపోత వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. ప్రస్తుతం బెంగళూరు, పుణె తదితర పట్టణాల్లో ఈ కారణంగానే భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. 


నేడు, రేపు భారీ వర్షాలు..

శని, ఆదివారాల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణం కేంద్రం హెచ్చరించింది.  గంటకు 30-40 కి.మీ వేగంతో మూడు రోజుల పాటు ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రానున్న 36 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. సిద్దిపేట, యాదాద్రి, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌, హన్మకొండ, మహబూబాబాద్‌, కరీంనగర్‌, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ ఇచ్చింది. ఈ జిల్లాల్లో శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, కొన్ని చోట్ల కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

Read more