టీఆర్‌ఎస్‌ కార్యకర్తలా సూర్యాపేట ఎస్పీ!

ABN , First Publish Date - 2022-09-17T08:48:27+05:30 IST

‘‘జయహో జగదీశ్‌రెడ్డి మంత్రి గారికి..

టీఆర్‌ఎస్‌ కార్యకర్తలా సూర్యాపేట ఎస్పీ!

  • జయహో మంత్రి జగదీశ్‌రెడ్డి అని నినాదాలు
  • సభికులతోనూ జేజేలు కొట్టించిన ఐపీఎస్‌ 
  • ముందు తరానికి గురువుగా నడిపిస్తున్నారు
  • ఆయన మంత్రిగా ఉండటం అదృష్టమన్న ఎస్పీ 
  • జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో ఘటన
  • ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ తీరుపై విమర్శల వెల్లువ

సూర్యాపేట, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ‘‘జయహో జగదీశ్‌రెడ్డి మంత్రి గారికి.. మన ముందు తరానికి ఆయన ఒక గురువు. ఆయన మంత్రిగా ఉండడం మన అదృష్టం’’ ఇవి.. సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలు. శుక్రవారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవంలో భాగంగా సూర్యాపేట నిర్వహించిన సభలో ఎస్పీ ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రికి ఆయన జేజేలు పలకడంతోనే ఆగలేదు.. 10 వేల మందికి పైగా హాజరైన కార్యక్రమంలో సభికులందరితోనూ మంత్రి జగదీశ్‌రెడ్డికి జేజేలు కొట్టించారు. ఐపీఎస్‌ అధికారి అయి ఉండి, పార్టీ కార్యకర్తలా, మంత్రికి అనుచరుడిలా నినాదాలు చేస్తూ తన స్థాయిని మరిచి ప్రవర్తించారు. ‘‘మన ముందు తరానికి ఒక  నిదర్శనమైన మంత్రిగారు, గురువైన మంత్రిగారు ఉండటం మన అదృష్టం. మన అన్ని తరాలను నడిపిస్తున్న మంత్రిగారు గైడ్‌ చేస్తారు. 


మీ అందరూ మొబైల్స్‌ని పక్కనపెట్టి మన పూర్వీకులు నేర్పిన నైతిక విలువలను ముందుకు తీసుకువెళుతూ.. మీరు ముందుకు వెళితే,  భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధిస్తే మన మంత్రి గారికి సంతోషం వస్తుంది’’ అని అన్నారు. అనారోగ్యంతో ఉండి కూడా మన కోసం వచ్చిన మంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ‘‘మనందరం మన మినిస్టర్‌ గారికి ఇచ్చే బహుమతి ఏంటంటే.. మీ అందరికీ గుర్తుందనుకుంటా ఆకలేస్తే కేకలేయమన్నాడు శ్రీశ్రీ. అందరికీ ఆకలేస్తుందా? అయితే ఓ పనిచేద్దాం ‘జయహో జగదీశ్‌రెడ్డి మినిస్టర్‌ గారంటే మీరంతా ఏమనాలే.. జయహో జయహో’ అనాలి’’ అన్నారు. ఇంకా గట్టిగా అనాలంటూ సభికులతో జయహో అనిపించారు. ఎస్పీ వ్యాఖ్యలపై వేదికపైనే ఉన్న మంత్రి జగదీశ్‌రెడ్డి మాత్రం స్పందించలేదు.


క్షేత్ర స్థాయి నుంచి కీలక పోస్టు వరకూ..

సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ ప్రస్థానం పోలీస్‌శాఖలో కిందిస్థాయి నుంచి మొదలై జిల్లా బాస్‌ దాకా వచ్చింది. ఎస్సై స్థాయి నుంచి వచ్చిన వారిలో కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యంత అరుదుగా అవకాశం లభించే ఐపీఎస్‌ కన్ఫర్డ్‌ ఆరు నెలల కిందట రాజేంద్రప్రసాద్‌ను వరించింది. ఏడాదిపాటు రైల్వేలో అడిషనల్‌ ఎస్పీగా పనిచేసి పదోన్నతిపై డీజీపీ కార్యాలయానికి వచ్చారు. ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచటంతో ఆయన సర్వీసు నాలుగేళ్లు పెరిగింది. గత ఏడాది ఎస్పీగా సూర్యాపేట జిల్లాకు వచ్చారు.

Updated Date - 2022-09-17T08:48:27+05:30 IST