ఉపసర్పంచ్‌ దారుణ హత్య

ABN , First Publish Date - 2022-08-31T08:28:54+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు అలజడి రేపారు. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ ఉపసర్పంచ్‌ను హత్య చేశారు.

ఉపసర్పంచ్‌ దారుణ హత్య

ఇన్‌ఫార్మర్‌ నెపంతో మావోయిస్టుల ఘాతుకం

పార్టీకి, ప్రజలకు వ్యతిరేకిగా మారినందుకే శిక్ష అంటూ లేఖ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఘటన

చర్ల, అగస్టు 30: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు అలజడి రేపారు. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ ఉపసర్పంచ్‌ను హత్య చేశారు. తన ఇంట్లో నిద్రిస్తోన్న ఉపసర్పంచ్‌ను మావోయిస్టులు సోమవారం రాత్రి  బయటికి తీసుకెళ్లగా.. మంగళవారం ఉదయానికి ఆయన శవమై కనిపించారు. ఆయన మృతదేహం వద్ద చర్ల-శబరి ఏరియా కమిటీ పేరిట రాసిన ఓ లేఖ కూడా లభ్యమైంది. కుర్నపల్లి గ్రామానికి చెందిన ఇర్పా రాముడు అలియాస్‌ రాము(33) కుర్నపల్లి పంచాయతీ ఉపసర్పంచ్‌గా పని చేస్తున్నారు. సీపీఎంకు ప్రాతినిధ్యం వహిస్తోన్న రాము.. రోజువారీ పనులు పూర్తి చేసుకున్న తర్వాత కుర్నపల్లిలోని తన ఇంట్లోనే సోమవారం నిద్రపోయారు. అయితే, రాత్రి వేళ రాము ఇంటికి వచ్చిన నలుగురు మావోయిస్టులు అతన్ని నిద్ర లేపి మాట్లాడే పని ఉందని బయటికి తీసుకెళ్లారు. దీంతో భయపడిన అతని భార్య కనకమ్మ.. ఇతర కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. అందరూ కలిసి రాము కోసం గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. అయితే, మంగళవారం తెల్లవారుజామున గ్రామ శివారులో పడి ఉన్న రాము మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. రాము తలపై బలమైన గాయం కనిపిస్తోంది. రాము మృతదేహం వద్ద చర్ల, శబరి ఏరియా కమిటీ పేరుతో రాసిన ఓ లేఖను మావోయిస్టులు వదిలారు. పోలీసులిచ్చే డబ్బుకు ఆశపడి ప్రజల పార్టీకి ద్రోహం చేయడానికి పోలీసు ఇన్‌ఫార్మర్‌గా మారినందుకు రాముని శిక్షిస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. పోలీసుల మాయమాటలు నమ్మి ప్రజాద్రోహులుగా మారవద్దని హెచ్చరించారు. పార్టీకీ, ప్రజలకు వ్యతిరేకంగా మారినందువల్లే రాముని శిక్షించినట్టు తెలిపారు. ఈ ఘటనపై చర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

మూడేళ్ల తర్వాత మళ్లీ అలజడి..
దాదాపు మూడేళ్ల తర్వాత మావోయిస్టులు కుర్నపల్లి ప్రాంతంలో మరోసారి అలజడి సృష్టించారు. మావోయిస్టు పార్టీ చర్ల ఏరియా కమాండర్‌ అరుణ్‌కుమార్‌.. 2018 ఆగస్టులో కుర్నపల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఈ క్రమంలో కుర్నపల్లికి చెందిన ఐదుగురిని మావోయిస్టులు అప్పట్లో కిడ్నాప్‌ చేశారు. వారికోసం గాలిస్తూ వెళ్లిన వారిని కూడా చితకబాదారు. ఈ ఘటనలో 2018 సెప్టెంబర్‌ 11న ఇర్పా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందాడు. అనంతరం2019లో చర్ల మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఎంపీటీసీ నల్లూరి శ్రీనివా్‌సని మావోయిస్టులు హతమార్చారు. ఆ తర్వాత మూడేళ్లకు మరో హత్యకు పాల్పడ్డారు.  

Read more