భవనంపై నుంచి పడి విద్యార్థినికి గాయాలు

ABN , First Publish Date - 2022-12-30T00:53:40+05:30 IST

దుస్తులను ఆరవేస్తూ ఆశ్రమ పాఠశాల భవనంపై అంతస్తు నుంచి కిందపడి విద్యార్థినికి గాయాలయ్యాయి.

భవనంపై నుంచి పడి విద్యార్థినికి గాయాలు
చికిత్స పొందుతున్న సింధు

పగిడిపల్లి ఆశ్రమ పాఠశాలలో ఘటన

మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలింపు

విద్యార్థిని సురక్షితం: డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి

భువనగిరి రూరల్‌, డిసెంబరు 29: దుస్తులను ఆరవేస్తూ ఆశ్రమ పాఠశాల భవనంపై అంతస్తు నుంచి కిందపడి విద్యార్థినికి గాయాలయ్యాయి. గురువారం మండల పరిధిలోని పగిడిపల్లి ఆశ్రమ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. సహచర విద్యార్థులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. తుర్కపల్లి మండలం బద్దుతండాకు చెందిన గుగులోతు సింధు పగిడిపల్లి శివారులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. గురువారం తెల్లవారు జామున మొదటి అంతస్తులో తన దుస్తులను ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడింది. దీంతో తలకు, ఎడమకాలుకు, ఎడమకంటికి గాయాలయ్యాయి. సహచర విద్యార్థులు వార్డెనకు సమాచారమివ్వటంతో 108 ద్వారా భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీఆర్‌డీవో, ఇనచార్జి గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి మందడి ఉపేందర్‌రెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి వచ్చి, స్థానిక వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కలెక్టర్‌ పమేలాసత్పథి ఆదేశాల మేరకు ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు ఆ విద్యార్థినికి వెంటనే చికిత్సను ప్రారంభించి తలకు శస్త్ర చికిత్స చేశారు. గురువారం రాత్రి ఎడమ కాలుకు శస్త్ర చికిత్స నిర్వహిస్తారని, ఆ విద్యార్థిని సురక్షితంగా ఉందని డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఆశ్రమ పాఠశాల వార్డెన జాన్సన ఈ విషయమై కుటుంబ సభ్యులకు సమాచారం అందచేయడంతో తల్లి శాంతి, బంధువులు జిల్లా కేంద్ర ఆసుపత్రికి చేరుకున్నారు. వసతి గృహం మొదటి, రెండో అంతస్తులో రక్షణ గోడలు ఎత్తు తక్కువగా ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఎత్తైన రక్షణ గోడలు లేదా గ్రిల్స్‌ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - 2022-12-30T00:53:42+05:30 IST