త్వరలో డాక్టర్లు, నర్సుల పోస్టుల భర్తీ

ABN , First Publish Date - 2022-02-13T08:01:42+05:30 IST

ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడానికి ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సుల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

త్వరలో డాక్టర్లు, నర్సుల పోస్టుల భర్తీ

 ప్రభుత్వ ఆస్పత్రుల్లో చనిపోయిన పేదలను 

తరలించేందుకు ఉచిత అంబులెన్స్‌ సేవలు: హరీశ్‌ 

బర్కత్‌పుర, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడానికి ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సుల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శనివారం హైదరాబాద్‌ నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రిలో రూ. 10.91 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఓపీ బ్లాక్‌ భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చనిపోయిన పేదల మృతదేహాలను ఉచితంగా తరలించే 13 వాహనాలను, మూడు అంబులెన్స్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 61 ఆస్పత్రులలో మార్చురీల ఆధునికీకరణకు రూ. 32.54 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద రూ. 2 లక్షల వైద్య సేవలు పొందే పరిమితి ఉండేదని, దీనిని రూ. 5 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు. ఫీవర్‌ ఆస్పత్రిని పూర్తిగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.


రూ. 60 లక్షల వ్యయంతో మార్చురీ ఏర్పాటు, రూ. 50 లక్షల వ్యయంతో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఫీవర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కె.శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ యువజన కాంగ్రెస్‌  గ్రేటర్‌ అధ్యక్షుడు మోత రోహిత్‌ ఆధ్వర్యంలో మంత్రి హారీశ్‌రావు కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-02-13T08:01:42+05:30 IST