సామాజిక సమీక‘రణమే’!

ABN , First Publish Date - 2022-10-04T10:06:08+05:30 IST

ఉప ఎన్నిక ఖాయమైనప్పటి నుంచి మునుగోడులో జోరందుకున్న రాజకీయాలు..

సామాజిక సమీక‘రణమే’!

మునుగోడుపై పార్టీల సమాలోచన.. కులాల వారీగా ఓట్లపైనే గురి

నల్లగొండ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఉప ఎన్నిక ఖాయమైనప్పటి నుంచి మునుగోడులో జోరందుకున్న రాజకీయాలు.. తాజాగా షెడ్యూల్‌ జారీతో పతాక స్థాయికి చేరాయి. ఓట్ల వేటలో నిమగ్నమై ఉన్న పార్టీలు.. సామాజిక వర్గాల వారీగా లెక్కలు వేసుకుంటున్నాయి. కులాల వారీగా ఓటర్లను ఆకర్షించేందుకు సమాలోచనలు చేస్తున్నాయి. వాస్తవానికి జనరల్‌ స్థానమైన మునుగోడు నియోజకవర్గంలో బీసీల ఓట్లు 60శాతం వరకూ ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో ఎస్సీలు, ఓసీలు, ఎస్టీలు ఉన్నారు. ఈ మేరకు పార్టీలన్నీ అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎస్సీ, ఎస్టీ ఓటర్లను ఆకర్షించేందుకు దళిత బంధుతోపాటు గిరిజన బంధును అమలు చేస్తామని ప్రకటించిన అధికార టీఆర్‌ఎస్‌.. ముఖ్య నేతలను రంగంలోకి దింపి బీసీలకు అందుతున్న సంక్షేమ పథకాలపైనా ప్రచారం చేస్తోంది. మరోవైపు.. బీజేపీ, కాంగ్రెస్‌ సైతం టీఆర్‌ఎ్‌సను టార్గెట్‌ చేస్తూనే.. కులాల వారీగా తమకు పడే ఓట్ల సంఖ్యపై సమాలోచన చేసుకుంటున్నాయి. భౌగోళికంగా మునుగోడు నియోజకవర్గం ఏడు మండలాలు, రెండు మునిసిపాలిటీల పరిధిలో విస్తరించి ఉంది. మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్‌ మండలాలు నల్లగొండ జిల్లా పరిధిలోకి వస్తుండగా, చౌటుప్పల్‌, సంస్థాన్‌ నారాయణపురం మండలాలు యాదాద్రి జిల్లా పరిధిలోకి వస్తున్నాయి. నల్లగొండ జిల్లాలోని చండూరు, యాదాద్రి జిల్లాల్లోని చౌటుప్పల్‌ మునిసిపాలిటీలుగా ఉన్నాయి. మునుగోడు పూర్తిగా గ్రామీణ నియోజకవర్గం కాగా, మొత్తం 2,27,265 ఓట్లు ఉన్నాయి. ఇందులో పురుష ఓటర్లు 1,15,623, మహిళా ఓటర్లు 1,11,637, థర్డ్‌ జండర్‌ ఓటర్లు 5 మంది ఉన్నారు. 


ఆరు సార్లు కాంగ్రెస్దే గెలుపు..

మునుగోడు నియోజకవర్గం 1967లో ఏర్పడగా.. ఇప్పటివరకు ఇక్కడ 12 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆరు సార్లు కాంగ్రెస్‌, ఐదు సార్లు సీపీఐ, ఒక సారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించారు. 1967 నుంచి 1985 వరకు వరుసగా నాలుగు సార్లు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన పాల్వాయి గోవర్థన్‌ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 1985 నుంచి సీపీఐ అభ్యర్థి ఉజ్జిని నారాయణరావు మూడు సార్లు గెలిచారు. 1999లో మళ్లీ పాల్వాయి గోవర్థన్‌రెడ్డి విజయం సాధించగా, 2004లో సీపీఐ అభ్యర్థి పల్లా వెంకట్‌రెడ్డి గెలుపొందారు. 2009ఎన్నికల్లో సీపీఐ నుంచి ఉజ్జిని యాదగిరిరావు పోటీచేసి విజయం సాధించగా, 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు. 2018లో కాంగ్రెస్‌ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. ఇటీవల ఆయన బీజేపీలో చేరి.. రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ ఐదుసార్లు విజయం సాధించిన పాల్వాయి గోవర్థన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి తాజాగా కాంగ్రెస్‌ నుంచి పోటీ పడుతున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంగా అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.

Updated Date - 2022-10-04T10:06:08+05:30 IST