‘ఉన్నతి’ ఉపయోగమేదీ!?

ABN , First Publish Date - 2022-10-11T05:30:00+05:30 IST

ఉపాధి హామీ కూలీలుగా మారి జీవనం సాగిస్తున్న వారి కుటుంబాల్లోని పిల్లల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉన్నతి కార్యక్రమానికి యువత నుంచి పెద్దగా ఆదరణ లభించడం లేదు. వంద రోజుల పని దినాలను పూర్తి చేసుకున్న ఉపాధి కుటుంబాల్లోని పిల్లలు కూలీలుగా మారకుండా వారికి నచ్చిన రంగంలో నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు ప్రవేశ పెట్టిన ఈ మంచి కార్యక్రమం అమలులో నీరిగారి పోతోంది. నైపుణ్య శిక్షణ తీసుకునేందుకు పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వంద రోజుల పని దినాలు పూర్తి చేసిన కూలీలు వేల సంఖ్యలో ఉన్నా.. అందుకు తగిన సంఖ్యలో యువత శిక్ష తీసుకోవడం లేదు. యువతకు శిక్షణపై ఏ మాత్రం అవగాహన లేకపోవడంతో దీన్ని సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు. ఫలితంగా చాలా మంది నైపుణ్యతకు శిక్షణ దూరంగా ఉంటున్నారు.

‘ఉన్నతి’ ఉపయోగమేదీ!?

నైపుణ్య శిక్షణకు ముందుకురాని నిరుద్యోగులు
వేలల్లో అర్హులు.. శిక్షణకు వచ్చేది వందల్లో..
ఉపాధి హామీ కుటుంబాల్లో అవగాహన లేమి
ఎక్కువ మందికి శిక్షణకు అధికారుల కసరత్తు
నీరుగారుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం


ఉపాధి హామీ కూలీలుగా మారి జీవనం సాగిస్తున్న వారి కుటుంబాల్లోని పిల్లల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉన్నతి కార్యక్రమానికి యువత నుంచి పెద్దగా ఆదరణ లభించడం లేదు. వంద రోజుల పని దినాలను పూర్తి చేసుకున్న ఉపాధి కుటుంబాల్లోని పిల్లలు కూలీలుగా మారకుండా వారికి నచ్చిన రంగంలో నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు ప్రవేశ పెట్టిన ఈ  మంచి కార్యక్రమం అమలులో నీరిగారి పోతోంది. నైపుణ్య శిక్షణ తీసుకునేందుకు పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వంద రోజుల పని దినాలు పూర్తి చేసిన కూలీలు వేల సంఖ్యలో ఉన్నా.. అందుకు తగిన సంఖ్యలో యువత శిక్ష తీసుకోవడం లేదు. యువతకు శిక్షణపై ఏ మాత్రం అవగాహన లేకపోవడంతో దీన్ని సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు. ఫలితంగా చాలా మంది నైపుణ్యతకు శిక్షణ దూరంగా ఉంటున్నారు.

హనుమకొండ, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో వలసలు నివారించి స్థానికంగానే పనులు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు చేస్తోంది. అందులో భాగంగా ఏటా గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన పనులను గుర్తించి, గ్రామ సభల ఆమోదంతో నిధులు మంజూరుకు అధికారులు ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. ఈ మేరకు మంజూరైన పనులు కల్పించి కూలీలకు ఉపాధి కల్పించడమేకాక శాశ్వత ప్రాతిపదికన పనులు చేయిస్తూ గ్రామాభివృద్ధికి కూడా కృషి చేస్తున్నారు. అంతేకాక కూలీల కుటుంబాల్లోని పిల్లలు అదే కూలీలుగా మారకూడదనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఉపాధిలో వంద రోజుల పనులు పూర్తి చేసిన కుటుంబాల్లోని యువతకు స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఆరేళ్ల కిందట ‘ఉన్నతి’ అనే కార్యక్రమం చేపట్టింది.

వివిధ పనుల్లో శిక్షణ

ఆంగ్ల భాషా పరిజ్ఞానం, కంప్యూటర్‌ విభాగానికి సంబంధించి పదో తరగతి ఉత్తీర్ణులైన 18-28 ఏళ్ల వయసులోపు పెళ్లికాని నిరుద్యోగ యువతను అర్హులుగా గుర్తించారు. వీరందరికీ సాఫ్ట్‌వేర్‌ స్కిల్స్‌, అంగ్లం రీడింగ్‌, సిస్టమ్‌ వర్క్స్‌, పేపర్‌ రీడింగ్‌, టైపింగ్‌ బేసిక్స్‌, భావ వ్యక్తీకరణ నైపుణ్యంతో వసతితో కూడిన శిక్షణ ఇస్తారు. అలాగే గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, వ్యవసాయ విభాగాల శిక్షణకు సంబంధించి  18-45 ఏళ్ల లోపు యువతకు టైలరింగ్‌, సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌, బ్యూటీపార్లర్‌, వర్మీకంపోస్టు తయారీ, ప్లంబింగ్‌, కార్పెంటర్‌, పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ ఇస్తారు.

శిక్షణకు వెనకడుగు
ఉన్నతి కార్యక్రమంలో భాగంగా అధికారులు ఉపాధి హామీ కుటుంబాల్లో నిరుద్యోగులుగా ఉన్నవారిని ఇంటింటా సర్వే నిర్వహించి నైపుణ్య శిక్షణకు అర్హులను గుర్తించారు. ఉపాధి హామీ పథకం నిబంధనలకు అనుగుణంగా ఉమ్మడి జిల్లాలోని 1,650 గ్రామ పంచాయతీల్లో 2018-19 సంవత్సరంలో వంద రోజులు పూర్తి చేసుకున్న 11,520 కుటుంబాలు ఉన్నతికి అర్హత కలిగి ఉన్నాయి. ఈ కుటుంబాల్లో 18 నుంచి 45 ఏళ్లలోపు వారు 4,412 మంది యువకులను గుర్తించారు. వీరందరికీ శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉపాధి, ఐకేపీ సిబ్బంది ఇంటింటా తిరిగి అవగాహన కల్పించారు. ఈ మేరకు కిందటేడు 2,533 మంది శిక్షణ తీసుకునేందుకు అంగీకరించారు. కానీ శిక్షణలో 1920 మంది మాత్రమే చేరారు. ఈ యేడు 1,104 మంది ముందుకురాగా, 500 మంది మాత్రమే శిక్షణలో చేరారు. శిక్షణలో  చేరేవారి సంఖ్య తక్కువగా ఉండడంతో మరోమారు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు.

అనాసక్తికి కారణం
ఉపాధి కూలీల కుటుంబాల్లోని పిల్లల్లో చాలామంది అప్పటికే వివిధ వృత్తులో స్థిరపడి ఉండడం ఉన్నతి పట్ల ఆసక్తికనబరచక పోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. కొందరు పట్టణాలకు వచ్చి ఆటోలు నడుపుకుంటున్నారు. వివిధ వ్యాపార వాణిజ్య సంస్థల్లో చేరి ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొంత మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతి కింద ఆయా సంస్థల్లో పనిచేస్తున్నారు. మరికొందరు చేతివృత్తులను నమ్ముకొని బతుకుతున్నారు. ఇంకొందరు చిరువ్యాపారులుగా కొనసాగుతున్నారు. వీటిలో దాదాపుగా స్థిరపడిన వీరు వాటిని వదిలేసి నైపుణ్య శిక్షణ తీసుకొని మరో ఉపాధి చేపట్టాడానికి ఇష్టపడడం లేదు. సాహసం కూడా చేయడం లేదు. వివాహితులైన యువకులైతే ప్రస్తుతం చేస్తున్న తమ వృత్తిని, ఉపాధిని మాని మరో ఉద్యోగం కోసం శిక్షణ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. పైగా శిక్షణ తీసుకున్న తర్వాత పొందిన ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం ప్రస్తుతం వారు సంపాదిస్తున్న దానికన్నా ఏమంత ఎక్కువ రాకపోవడం కూడా ఉన్నతిపట్ల ఆసక్తి చూపకపోవడానికి మరో కారణంగా చెబుతున్నారు. 18-25 యేళ్ల లోపు యువకులు కొంత మేరకు నైపుణ్య శిక్షణకు ఆసక్తి చూపినా 25 నుంచి 40 యేళ్లలోపు వారు మాత్రం పెద్దగా ముందుకు రావడం లేదు. శిక్షణ కోసం వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించినా ఫలితం ఉండడం లేదని అధికారులు అంటున్నారు. శిక్షణ సమయంలో వారికి రోజుకు ఇస్తున్న రూ. 235 భృతి వారికి ఏ మాత్రం సరిపోవడం లేదు.

Read more