ముస్తాబైన వాణిజ్య కూడలి

ABN , First Publish Date - 2022-02-19T05:50:05+05:30 IST

ముస్తాబైన వాణిజ్య కూడలి

ముస్తాబైన వాణిజ్య కూడలి
విశాల రోడ్లతో వాణిజ్య కూడలి సముదాయం

- రూ.300కోట్లతో 318 మడిగెల నిర్మాణం

- రేపు మంత్రులు చేతుల మీదుగా ప్రారంభం

గీసుగొండ, ఫిబ్రవరి 18: గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని 16వ డివిజన్‌ ధర్మారం శివారులో అన్ని హంగులతో వాణిజ్య కూడలి ముస్తాబైంది. రూ.300 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ వాణిజ్య కూడలి(మడిగెలు) ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు తలమానికంగా నిలవనుంది. వరంగల్‌ హోల్‌సేల్‌ ట్రేడర్స్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ షాపులను ఈనెల 20న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీ్‌షరావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాటు చేసినట్లు సొసైటీ చైర్మన్‌ తోట జగన్నాథం తెలిపారు. ఈ సముదాయంలో 318 మడిగెలను నిర్మించారు. ఇందులో అల్లం, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, బెల్లం, నూనెలు, పప్పులు, డ్రై ఫ్రూట్స్‌ వంటి దాదాపు 50 రకాల జనరల్‌ కిరాణ వస్తువులను హోల్‌సేల్‌గా విక్రయించనున్నారు. 

ఖమ్మం, కరీంనగర్‌, నల్లగొండ జిల్లాలకు వాణిజ్య కేంద్రంగా ఉన్న వరంగల్‌ బీట్‌బజారు త్వరలోనే ఈ సముదాయానికి తరలిరానుంది. బీట్‌బజార్‌కు దాదాపు 110 సంవత్సరాలు వ్యాపారచరిత్ర ఉంది. బీట్‌బజార్‌ వద్ద ఆర్వోబీ నిర్మించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో వ్యాపారస్థులంతా సొసైటీగా ఏర్పడి 2012లో ధర్మారం సమీపంలో 25 ఎకరాలను కొనుగోలు చేశారు. విశాలమైన రోడ్లు, అండర్‌ డ్రెయినేజీ సిస్టం, డ్రెయినేజీ నీటిని శుద్ధిచేసి మొక్కలకు ఉపయోగించేలా తీర్చిదిద్దారు. వాణిజ్య సముదాయంలోని వర్షపు నీటిని సైతం మోటార్‌తో బయటికి పంపించేలా డిజైన్‌ చేశారు. 2015లో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయగా, 2019లో నిర్మాణం పూర్తయింది. అయితే కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రారంభోత్సవం ఆలస్యమైంది. 

రేపు మంత్రుల చేతుల మీదుగా ప్రారంభం: తోట జగన్నాథం, సొసైటీ చైర్మన్‌ 

ఆధునిక హంగులతో వాణిజ్య సముదాయాన్ని నిర్మించాం. ఈనెల 20న వాణిజ్య సముదాయాన్ని మంత్రులు హరీ్‌షరావు, దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు. ఈ సముదాయంలో 3వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బీట్‌బజార్‌ నుంచి 80శాతం వరకు హోల్‌సేల్‌ దుకాణాలు ఇక్కడికి వస్తాయి. వరంగల్‌ నుంచి ధర్మారం వరకు 150 ఫీట్ల రోడ్డుతోపాటు, ఇన్నర్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్లు ఏర్పాటైతే ఈ వ్యాపార కూడలి తెలంగాణలో గేటెడ్‌ వాణిజ్య సముదాయాల్లోనే ఒకటిగా నిలుస్తుంది. 



Updated Date - 2022-02-19T05:50:05+05:30 IST