ఐకేపీ రుణాలతో ప్రగతి వెలుగులు

ABN , First Publish Date - 2022-09-14T05:09:24+05:30 IST

ఐకేపీ రుణాలతో ప్రగతి వెలుగులు

ఐకేపీ రుణాలతో ప్రగతి వెలుగులు
నర్సింహులపేటలో ఐకేపీ రుణంతో స్వీట్‌హౌస్‌ ఏర్పాటు చేసిన మహిళ, కారం మిల్లు ఏర్పాటు చేసిన ఎల్లావుల శారద

గ్రామీణ ప్రాంతాల్లో రుణాల సద్వినియోగం

రాష్ట్రంలో జిల్లాకు ఐదో స్థానం

చిరు వ్యాపారాలతో మహిళల ఆర్థికాభివృద్ధి

జిల్లా వ్యాప్తంగా 14,973 స్వయం సహాయక సంఘాలు,  1,58,303 మంది సభ్యులు


నర్సింహులపేట, సెప్టెంబరు 13 : గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సెర్ఫ్‌ సహకారంతో ప్రవేశపెట్టిన ఇందిరక్రాంతి పథం (ఐకేపీ) ద్వారా మహిళలు ఆర్థిక పురోగతి సాధిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తీసుకున్న రుణాలతో చిరు వ్యాపారాలు చేసుకుంటూ లబ్ధి పొందుతున్నారు. వాటితో వచ్చిన ఆదాయంతో సకాలంలో వాయిదా పద్ధతిలో రుణాలు చెల్లిస్తూ ఆర్థికంగా పురోగతి సాధిస్తూ సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతున్నారు. 


జిల్లాలో 16 మండలాలు, 461 గ్రామపంచాయతీ పరిధిలో 677 గ్రామైక్య సంఘాలకు గాను 14,973 స్వయం సహాయక సంఘాలల్లో 1,58,303 మంది సభ్యులు ఉన్నారు. వీటిలో ఏ గ్రేడ్‌ సంఘాలు 11,417, బీ గ్రేడ్‌లో 909, సీ గ్రేడ్‌లో 1250, డీ గ్రేడ్‌లో 66 సంఘాలు ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 665 వీవోలకుగాను 13,350 సహాయక సంఘాల్లో 1,48,630 మంది సభ్యులుకు బ్యాంకు లింకేజీ, శ్రీనిధి, సామాజిక పెట్టుబడి నిధి, గ్రామసంఘాల అంతర్గత నిధుల నుంచి సుమారు రూ.364కోట్లు రుణాల రూపంలో మంజూరు చేసినట్లు జిల్లా ఐకేపీ అధికారులు నివేదించారు. 


ఐకేపీ రుణాల సద్వినియోగం.. 

మహిళల ఆర్థిక తోడ్పాటే లక్ష్యంగా 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఇందిర క్రాంతి పథం (ఐకేపీ) మహబూబాబాద్‌ జిల్లాలోని నర్సింహులపేట, కేసముద్రం, కురవి, గార్ల, నెల్లికుదురు, గూడూరు, మహబూబాబాద్‌తో పాటు పలుమండలాల్లో మహిళలు ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నారు. బ్యాంకు లింకేజీ, శ్రీనిధి, పీవోపీ వడ్డీలేని రుణాలు, మండల సమాఖ్యలో రీ పేమెంట్‌లో మహిళలు తీసుకున్న రుణాలు చిరు వ్యాపారాలకు వినియోగించుకుంటు న్నారు. రుణాలను సద్వినియోగం చేసుకుంటూ, వాయిదాల ప్రకారం చెల్లింపుల్లో వందశాతం విజయం సాధించడంతో సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రతీనెలా క్రమం తప్పకుండా వీవో, మండల సమాఖ్యల పరిధిలో సమావేశాలు నిర్వహిస్తూ రుణాల మంజూరుతో పాటు రికవరీకి విధి విధానాలు రూపొందిస్తూ ఐకేపీ సిబ్బంది ముందడుగు వేస్తున్నారు. 


గ్రామీణాభివృద్ధి శాఖవారి ఆధ్వర్యంలో సెర్ఫ్‌ సహకారంతో ప్రవేశపెట్టిన ఇందిరక్రాంతి పథం అమలులో తెలంగాణ రాష్ట్రంలో మానుకోట జిల్లా ఐదో స్థానంలో నిలిచి, డ్వాక్రా మహిళల ప్రగతికి బాటలుపడుతున్నాయి. 2021- 22 సంవత్సరానికి గాను 12, 134 సంఘాలకు రూ.342 కోట్లు లక్ష్యం పూర్తి చేశారు. 8,273 సంఘాలకు రూ.364 కోట్లు రుణాల రికవరీ (చెల్లింపు)లో 106 శాతం పూర్తి చేశారు. 2022- 23 కుగాను 11,825 సంఘాలకు రూ.412 కోట్లు లక్ష్యం ఉండగా 2281 ఎస్‌హెచ్‌జీలకు ఆగస్టు మాసం వరకు రూ.120 కోట్లు మంజూరు చేసి రాష్ట్రంలో ఐదో స్థానంలో నిలచింది. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతులమీదుగా డీఆర్‌డీఏ పీడీ సన్యాసయ్య ప్రశంసా పత్రంతో పాటు జ్ఞాపికను అందుకున్నారు.


నిరుపేద కుటుంబాల్లో వెలుగులు..

ఐకేపీలో రుణాలు తీసుకున్న పేద డ్వాక్రా మహిళల కుటుంబాల్లో వెలుగులు చిగురిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎస్‌హెచ్‌జీ మహిళలు ఈ పథకాలల్లో రుణాలు తీసుకొని పాడిపరిశ్రమతో పాటు కిరాణ షాపులు, బట్టల దుకాణాలు, కారం, పసుపు మిల్లు లు, హోటల్‌, జిరాక్స్‌ సెంటర్‌, స్వీట్‌ హౌస్‌,  పలు చిరు వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకోవడమే కాకుండా, ఆర్థికాభివృద్ధిని సాధిస్తూ సమాజంలో గుర్తింపు పొందుతున్నారు.


సమష్టి కృషితోనే విజయం : సన్యాసయ్య, డీఆర్‌డీవో పీడీ 

స్వయం సహాయక సంఘాల మహిళలతో సమన్వయంగా వ్యవహరిస్తూ, మహిళలకు రుణాలు మంజూరు చేయడం, రికవరీలో ఐకేపీ సిబ్బంది సమష్టిగా కృషి చేయడంతోనే జిల్లా ముందంజలో ఉంది. ప్రతీ డ్వాక్రా మహిళకు రుణం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం.


రుణాలను సద్వినియోగం చేసుకుంటున్నాము : మంద సంధ్యారాణి, మండల సమాఖ్య అధ్యక్షురాలు 

ఐకేపీ ప్రోత్సాహంతో బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నాం. వివిధ రంగాలల్లో పెట్టుబడులు పెడుతూ ఆర్థికంగా బలపడుతున్నాం. పాల ఉత్పత్తి, పిండి, కారం మిల్లుల ఏర్పాటుతో పాటు చిరు వ్యాపారాల్లో రాణిస్తూ సమాజంలో గౌరవంగా జీవిస్తున్నాం.


సమాజంలో గౌరవం పెరిగింది : బోయిన విజయ, నర్సింహులపేట 

ఐకేపీ ప్రోత్సాహంతో బ్యాంకు నుంచి రూ.35వేలు రుణం రూపంలో తీసుకున్నాను. ఇంటి ఆవరణలో పిండి మిల్లు ఏర్పాటు చేశాను. క్రమం తప్పకుండ రుణం చెల్లిస్తూ గౌరవ మర్యాదలు పొందుతున్నాం.

Updated Date - 2022-09-14T05:09:24+05:30 IST