Sharmila: షర్మిల ఆమరణ దీక్ష

ABN , First Publish Date - 2022-12-10T03:20:34+05:30 IST

అర్ధాంతరంగా నిలిచిపోయిన తన పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల శుక్రవారం ఆమరణ దీక్షకు దిగారు.

Sharmila: షర్మిల ఆమరణ దీక్ష

పాదయాత్రకు అనుమతి నిరాకరణపై నిరసన.. అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం

లోటస్‌పాండ్‌కు తరలించిన పోలీసులు.. ఆఫీసు వద్ద వేదికపై దీక్షకు షర్మిల నిర్ణయం

కార్యకర్తలను అనుమతించని పోలీసులు.. నిరసనగా నడిరోడ్డుపై షర్మిల బైఠాయింపు

నాలుగున్నర గంటల తర్వాత దీక్షా వేదికపైకి.. అనుమతిచ్చే దాకా దీక్ష చేస్తానని స్పష్టం

కేసీఆర్‌ చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ.. వైఎస్సార్‌టీపీకి భయపడుతున్నారు: షర్మిల

హైదరాబాద్‌/కవాడిగూడ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): అర్ధాంతరంగా నిలిచిపోయిన తన పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల శుక్రవారం ఆమరణ దీక్షకు దిగారు. ఆమె అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో హైడ్రామా చోటుచేసుకుంది. తొలుత ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు వెళ్లిన షర్మిల.. అంబేడ్కర్‌కు నివాళులర్పించి అక్కడే దీక్షకు కూర్చున్నారు. అయితే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని లోట్‌సపాండ్‌లోని వైఎస్సార్‌టీపీ కార్యాలయానికి తరలించారు. కార్యాలయం గేటు ముందు ఏర్పాటు చేసిన వేదికపై షర్మిల దీక్షను కొనసాగించారు. ఆమెకు సంఘీభావంగా వస్తున్న పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆగ్రహించిన షర్మిల.. లోట్‌సపాండ్‌ వద్ద రోడ్డుపైనే దీక్షకు కూర్చున్నారు. ఆమెకు సంఘీభావంగా కూర్చున్న పార్టీ నేతలు.. సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు కూతురికి సంఘీభావం తెలిపేందుకు అక్కడికి వచ్చిన వైఎస్‌ విజయలక్ష్మిని కూడా షర్మిలను కలిసేందుకు పోలీసులు అనుమతించలేదు. నాలుగున్నర గంటలపాటు రోడ్డుపైనే బైఠాయించి దీక్ష కొనసాగించిన షర్మిలను పోలీసులు బలంతంగా దీక్షా వేదికపైకి తీసుకెళ్లారు. ఈ సందర్బంగా జరిగిన తోపులాటలో షర్మిలకు, పార్టీ నేతలకు స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో షర్మిల కన్నీటి పర్యంతమయ్యారు.

టీఆర్‌ఎస్‌ నేతలకు ఏజెంట్లలా పోలీసులు..

‘‘ఈ ప్రాంతంలో ఎందుకు కర్ఫ్యూ విధించారు? నా ప్రాపర్టీలో నేను ఏం చేసుకుంటే ఏంటి? గాంధీ సైతం తన ఇంట్లో సత్యాగ్రహ దీక్ష చేశారు. మా వాళ్లందరినీ విడుదల చేయండి. మా పార్టీ నేతలు మా దగ్గరకు రావాలి. అప్పటిదాకా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను. మహిళలను 6 గంటలకు మించి స్టేషన్లో ఉంచకూడదు. అయినా మా మహిళా నేతలను స్టేషన్లోనే ఉంచారు. మేం మనుషుల్లా కనిపించట్లేదా?’’ అంటూ పోలీసులను షర్మిల నిలదీశారు. పోలీసులు టీఆర్‌ఎస్‌ నేతలకు ఏజెంట్లలా మారారని, పోలీసు శాఖపై కూడా కేసు వేయాలని అన్నారు. తాను ఇక్కడే ఆమరణ దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. అంతకుముందు అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని సీఎం కేసీఆర్‌ ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. ఇది భావ్యమేనా? అని ప్రశ్నించారు. శాంతియుతంగా పాదయాత్ర చేసున్న తమపై టీఆర్‌ఎస్‌ గూండాలే దాడి చేశారని అన్నారు.

హైకోర్టు తీర్పునే అగౌరవపరుస్తున్నారు..

హైకోర్టు అనుమతి ఇచ్చినా.. పాదయాత్ర చేసుకోనివ్వకుండా న్యాయస్థానం తీర్పునే కేసీఆర్‌ అగౌరవ పరస్తున్నారన్నారని షర్మిల మండిపడ్డారు. ‘‘మేం పాదయాత్ర చేస్తే కేసీఆర్‌కు వచ్చిన నష్టమేంటి? ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తే మాపై దాడులు చేస్తారా? ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు కూడా లేదా?’’ అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు దమ్ముంటే పబ్లిక్‌ ఫోరం పెట్టాలని, తాము కూడా వస్తామని, వారు ఇచ్చిన హామీలు, ప్రజా సమస్యలపై బహిరంగంగా చర్చిద్దామని సవాల్‌ విసిరారు. వారి అక్రమాలను ఒక మహిళ ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక పోతున్నారని షర్మిల వ్యాఖ్యానించారు.

సజ్జల వ్యాఖ్యలు అర్థం లేనివి

రెండు రాష్ట్రాలను కలపడం అసాధ్యమని, కొన్ని సంఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయని షర్మిల అన్నారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం తగదని, ఆయన వ్యాఖ్యలు అర్థం లేనివని పేర్కొన్నారు. నేడు తెలంగాణ ఒక వాస్తవమని, ఎంతో మంది బలిదానాలు, త్యాగాలతో ఏర్పడిందని గుర్తు చేశారు. ‘‘రాష్ట్రాలను కలపడం మీద ధ్యాస మానుకొని.. మీ ప్రాంత అభివృద్ధిపై ధ్యాస పెట్టండి. మీ ప్రాంతానికి న్యాయం చేయండి’’ అని సజ్జలకు సూచించారు.

Updated Date - 2022-12-10T03:20:35+05:30 IST