Sharmila: నన్ను పంజరంలో బంధించడం కేసీఆర్‌ తరం కాదు

ABN , First Publish Date - 2022-12-12T03:39:25+05:30 IST

తనను పంజరంలో పెట్టి బంధించవచ్చని కేసీఆర్‌ అనుకుంటున్నారని, అది ఆయన తరం కాదని వైఎ్‌సఆర్‌టీపీ అధినేత్రి షర్మిల అన్నారు.

Sharmila: నన్ను పంజరంలో బంధించడం   కేసీఆర్‌ తరం కాదు

ఆయనకు న్యాయస్థానాలన్నా గౌరవం లేదు

కార్యకర్తల త్యాగాలను మరిచిపోను

అపోలో ఆస్పత్రి నుంచి షర్మిల వీడియో సందేశం

నేడు ఇంటికి పంపే అవకాశం

2-3 వారాల విశ్రాంతి అవసరమన్న వైద్యులు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): తనను పంజరంలో పెట్టి బంధించవచ్చని కేసీఆర్‌ అనుకుంటున్నారని, అది ఆయన తరం కాదని వైఎ్‌సఆర్‌టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరన్నారు. తన కోసం పార్టీ కార్యకర్తలు చేసిన త్యాగాలను ఎన్నటికీ మరిచిపోనని చెప్పారు. తన పాదయాత్రకు అనుమతి, పార్టీ నేతల విడుదల కోసం షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో భగ్నం చేసిన పోలీసులు.. ఆమెను అపోలో ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి ఆదివారం ఆమె ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తనను పాదయాత్ర చేసుకోవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చిందని, అయితే కోర్టు ఆదేశాలన్నా కూడా గౌరవం లేని కేసీఆర్‌.. పోలీసుల భుజంపై తుపాకీ పెట్టి తనను టార్గెట్‌ చేశారన్నారు.

తాను ఆమరణ దీక్ష చేస్తుంటే తనను, తమ కార్యకర్తలను బందీలను చేశారన్నారు. లోటస్‌ పాండ్‌కు వచ్చే అన్ని మార్గాల్లోనూ బారికేడ్లు, చెక్‌పోస్టులు పెట్టారన్నారు. తమ కార్యకర్తలను మెడ పట్టుకుని పోలీసు వ్యాన్లలో ఎక్కించారని, పోలీస్‌ స్టేషన్లో పెట్టి దారుణంగా కొట్టారని ఆరోపించారు. ‘ఇవన్నీ భరించిన పార్టీ కార్యకర్తలకు ఒకటే చెబుతున్నా.. మీ త్యాగాలను నేను ఎన్నటికీ మరిచిపోను. పేరు పేరునా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పోలీసులు ఎన్ని చిత్రహింసలు పెట్టినా భరించి.. వైఎ్‌సఆర్‌పై మీకున్న అభిమానాన్ని మరోసారి నిరూపించుకున్నారు. వైఎ్‌సఆర్‌ సంక్షేమ పాలన కోసమే పార్టీ పెట్టాను. ఆ పాలన తిరిగి తీసుకువచ్చే వరకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని ఆశిస్తున్నాన’ని అన్నారు.

నిలకడగా షర్మిల ఆరోగ్యం

షర్మిల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అపోలో ఆస్పత్రి ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది. ఆమె డీహైడ్రేషన్‌, ఆర్థోస్టాటిక్‌ హైపోటెన్షన్‌, తీవ్రమైన ఒలిగిరియా, అధిక యానియన్‌ గ్యాప్‌ మెటబాలిక్‌ అసిడోసిస్‌, ప్రీరీనల్‌ అజొటెమియాతో బాధపడుతున్నారని పేర్కొంది. పూర్తిగా కోలుకోవడానికి షర్మిలకు రెండు నుంచి మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని తెలిపింది. సోమవారం డిశ్చార్జి చేసే అవకాశం ఉందని పేర్కొంది.

Updated Date - 2022-12-12T03:39:26+05:30 IST