వరదల వెనుక విదేశీ కుట్ర!

ABN , First Publish Date - 2022-07-18T08:31:37+05:30 IST

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి వరదలను చూస్తుంటే విదేశాల నుంచి క్లౌడ్‌ బరస్ట్‌ కుట్ర జరిగిందేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు.

వరదల వెనుక విదేశీ కుట్ర!

క్లౌడ్‌ బరస్ట్‌ జరిగిందన్న అనుమానం ఉంది

లద్దాక్‌, ఉత్తరాఖండ్‌లోనూ ఇలాగే జరిగింది

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

వరద పరిశీలన, బాధితులకు పరామర్శ

భద్రాద్రి, ములుగు జిల్లాల్లోసీఎం ఏరియల్‌ సర్వే

గోదావరి వరద శాశ్వత పరిష్కారానికి కృషి

నిర్వాసితులకు వెయ్యి కోట్లతో ఇళ్లు నిర్మిస్తాం

బాధితులకు రూ.10 వేల తక్షణ సాయం: సీఎం 


1) ములుగు జిల్లా రామన్నగూడెంలో గోదావరి వరదను పరిశీలించిన సీఎం

2) కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే

3) భద్రాచలం నన్నపునేని పాఠశాలలోని పునరావాస కేంద్రంలో వరద బాధితులతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌


భద్రాచలం/ఖమ్మం/భూపాలపల్లి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి వరదలను చూస్తుంటే విదేశాల నుంచి క్లౌడ్‌ బరస్ట్‌ కుట్ర జరిగిందేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. గతంలో లద్దాక్‌లో, ఉత్తరాఖండ్‌లోనూ ఇలాంటి వరదలే చోటుచేసుకున్నాయని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి వరద పరిశీలన, బాధితులను పరామర్శించేందుకుగాను ముఖ్యమంత్రి ఆదివారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించారు. హెలికాప్టర్‌ ద్వారా గోదావరి పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించారు. శనివారం రాత్రే హనుమకొండకు చేరుకున్న సీఎం.. ఆదివారం ఉదయం అక్కడినుంచి రోడ్డుమార్గంలో బస్సులో భద్రాచలానికి వచ్చారు. ఇక్కడ గోదావరి వరదను, కరకట్టను పరిశీలించారు. పునరావాస కేంద్రంలో బాధితులను పరామర్శించారు.


అనంతరం ఐటీడీఏ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తరువాత విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. వరద సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గోదావరి వరద బాధితులకు శాశ్వత ఇళ్ల నిర్మాణానికి రూ.1000 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి 10 వేల తక్షణ ఆర్థిక సాయం, రెండు నెలలపాటు 20కిలోల చొప్పున ఉచిత బియ్యం అందిస్తామన్నారు. ఆకస్మిక వరదలను, ఉత్పాత పరిస్థితిని నివారించేందుకు అన్ని శాఖల అధికారులు, నిపుణులతో కమిటీ వేస్తామని, సమగ్ర నివేదిక సి ద్ధం చేసి వరద తగ్గిన తరువాత పనులు చేపడతామని అన్నారు. గంగానదికి వరదల విషయంలో ఐఐటీ నిపుణులు చేసిన సూచనలతో కొంత వరదల నివారణ జరిగిందని, ఆ తరహాలోనే గోదావరి వరదల నివారణకు ఐఐటీ నిపుణులు, ఇరిగేషన్‌, సీడబ్ల్యూసీ నిపుణులతో కమిటీ వేసి త్వరలో అధ్యయనం చేపడతామన్నారు. 


రూ.1000 కోట్లతో శాశ్వత ఇళ్ల నిర్మాణం..

భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో శాశ్వత పునరావాసం కింద 2-3 వేల ఇళ్లు నిర్మించేందుకు సింగరేణి, రాష్ట్ర ప్రభుత్వం కలిపి రూ.1000 కోట్లు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ ఇళ్ల నిర్మాణ శంకుస్థాపనకు తానే వస్తానన్నారు. ఈ నిధుల నుంచే బూర్గంపాడు వైపుగా కరకట్ట నిర్మాణంతోపాటు పర్ణశాల ఆలయ పరిసరాలు మునగకుండా చర్ల, దుమ్ముగూడెం ప్రాంతంలో కూడా శాశ్వత చర్యలు చేపడతామన్నారు. పాలెంవాగు, మోడికుంటవాగు ప్రాజెక్టుల పనులు పూర్తి చేయిస్తామని, ప్రగళ్లపల్లి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ‘‘60, 50 అడుగుల వరదకే భద్రాచలంలోని సుభా్‌షనగర్‌, ఆలయ పరిసరాలు మునుగుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి. ఉమ్మడి రాష్ట్రంలో 1956లో ఊహించని రీతిలో గోదావరి వరద వచ్చింది. అలాగే ఈసారి చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా కడెం ప్రాజెక్టుకు వరద వచ్చింది. భగవంతుడి దయతో కడెం ప్రాజెక్టు నిలిచింది’’ అని కేసీఆర్‌ అన్నారు. 


కాంటూర్‌ లెవల్స్‌ గుర్తించి చర్యలు..

భద్రాచలం పట్టణాన్ని పూర్తిగా పరిరక్షించేందుకు వరదల నివారణకు కాంటూర్‌ లెవల్స్‌ను గుర్తించి చర్యలు చేపడతామని చెప్పారు. గోదావరి వరద ముప్పు ఇంకా తొలగిపోలేదని, వానాకాలం ఇంకా మిగిలే ఉందని గుర్తు చేశారు. అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని అన్నివిధాలా ఆదుకోవాలని, ఇళ్ల నుంచి వరద పూర్తిగా పోయిన తరువాతే వారిని ఇళ్లకు పంపాలని అధికారులను ఆదేశించారు. వైద్యఆరోగ్య శాఖ ద్వారా ముంపు గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకునేందుకు ఆదేశించామన్నారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి కూడా కృషి చేస్తానని ప్రకటించారు. గోదావరి కరకట్ట సమన్వయంపై పక్క రాష్ట్రంతో చర్చించి నిర్వహణలో ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. గోదావరి వరదల్లో సమర్థంగా పని చేసిన జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులను సీఎం అభినందించారు. ఈ నెల 29 వరకు వర్షం కురిసే అవకాశం ఉందని, గోదావరి వరద పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

 

సీఎం సారూ.. మీరే ఆదుకోవాలి 

‘ఈ వరద బాధతో ఇక్కడ మేం ఉండలేం. సీఎం సారూ మీరే రక్షించాలి. మా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి’ అని భద్రాచలం పట్టణంలోని అయ్యప్పకాలనీ, అశోకనగర్‌ కొత్త కాలనీ వాసులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మొరపెట్టుకున్నారు. గోదావరి కరకట్టను పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం భద్రాచలం వచ్చిన కేసీఆర్‌ స్థానిక నన్నపనేని మోహన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. సీఎం.. ‘మీకు పక్కా ఇళ్లు ఇస్తే మెరక ప్రాంతానికి వెళతారా?’ అని అడిగారు. బాఽధితులంతా ‘వెళ్తాం’ అని సమాధానం ఇచ్చారు. అందరికీ తప్పక ఇళ్లు కట్టిస్తానని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.  


బస్సులో వచ్చి.. హెలికాప్టర్‌లో వెళ్లి.. 

గోదావరి వరద బాధితుల పరామర్శకు బస్సులో భద్రాచలం వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పర్యటన ముగిసిన తర్వాత హెలికాప్టర్‌లో వెళ్లిపోయారు. వాస్తవానికి ఆదివారం ఉదయం హెలికాప్టర్‌లోనే భద్రాచలం రావాల్సి ఉండగా వర్షం కారణంగా సాధ్యపడలేదు. దీంతో ఆయన ఏటూరు నాగారం మీదుగా బస్సులో 10.50కి భద్రాచలానికి చేరుకున్నారు. గోదావరి మాతకు పూజలు చేసి పర్యటన ప్రారంభించారు. భద్రాచలం, సారపాక మధ్యలోని గోదావరి వారధిపైకి చేరుకుని ‘అమ్మా గోదారమ్మా.. శాంతించు’ అంటూ పూజలు చేశారు. భద్రాచలం దేవస్థాన వేద పండితులు, ఆలయ అధికారుల ఆధ్వర్యంలో గోదావరి వారధిపై నుంచి చీర, సారె, పసుపు, కుంకుమ సమర్పించారు. అనంతరం చిరు జల్లుల్లోనే రెండు గంటలపాటు భద్రాచలంలో పర్యటించారు. వర్షం కొద్దిగా తగ్గడంతో హెలిప్యాడ్‌ నుంచి ఏటూరునాగారం బయలుదేరి వెళ్లారు. 


కేసీఆర్‌ రావాలి.. మా గోడు వినాలి 

భూపాలపల్లి/అశ్వాపురం, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ‘కేసీఆర్‌ రావాలి.. మా గోడు వినాలి.. ముంపుతో ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నాం’ అంటూ ముంపు ప్రాంతాల ప్రజలు ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. గోదావరి ముంపునకు గురైన ఏటూరునాగారం క్రాస్‌రోడ్డు, ఆకులవారిగణపురం, మానసపల్లి తదితర కాలనీలకు చెందిన సుమారు 500 మందికిపైగా బాధితులు సీఎం కేసీఆర్‌ సమీక్ష సమావేశం కోసం ఐటీడీఏ కార్యాలయానికి వస్తుండగా ఒక్కసారిగా ధర్నాకు దిగారు. మరోవైపు.. సీఎం కేసీఆర్‌కు తమ బాధలను చెప్పుకునే అవకాశం లేకుండా తమను పునరావాస కేంద్రంలో నిర్భంధించారని భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండల వరద భాదితులు ఆందోళనకు దిగారు. మెండికుంట గ్రామంలోని పునరావాస కేంద్రం ఫంక్షన్‌హాల్‌ గేట్లను తోసుకొని బయటకు వచ్చి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. కాగా, ఓట్ల కోసమే కేసీఆర్‌ ముంపు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహిస్తున్నారని తుడుందెబ్బ నాయకులు ఆరోపించారు. ప్రజలపై ప్రేమ ఉంటే తక్షణమే రూ.1000 కోట్లు కేటాయించి బాధితులకు అందించాలంటూ ఐటీడీఏ క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.


వరద ప్రభావిత జిల్లాలకు తక్షణ సహాయం 

భూపాలపల్లి/ఓరుగల్లు, జూలై 17 (ఆంధ్రజ్యోతి): గోదావరి పోటెత్తడంతో ములుగు జిల్లాలో వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌ ఆదివారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. భద్రాచలం నుంచి  నేరుగా హెలికాప్టర్‌ ద్వారా గోదావరి పరీవాహక ప్రాంతాన్ని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. భద్రాచలం, మణుగూరు నుంచి ములుగు జిల్లా మంగపేట, వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లోని గోదావరి ముంపు ప్రాంతాల్లోని జలమయమైన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం వాజేడు మండలం ముళ్లకట్ట బ్రిడ్జి సమీపంలో మండపాక వద్ద సీఎం హెలికాప్టర్‌ మధ్యాహ్నం 1.30 గంటలకు ల్యాండ్‌ అయింది. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఏటూరునాగారం ఐటీడీఏ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడే మధ్యాహ్న భోజనం చేసి, ఎమ్మెల్యేలు, అధికారులతో వరదలపై సమీక్షించారు.


ఐటీడీఏ క్యాంపు కార్యాలయం నుంచి ఏటూరునాగారం మండలం రామన్నగూడేనికి మధ్యాహ్నం 3:34 గంటలకు చేరుకున్న సీఎం కేసీఆర్‌.. నీట మునిగిన ఎస్సీ, ఎస్టీ కాలనీలను సందర్శించి వారితో మాట్లాడారు. కరకట్ట నిర్మాణానికి రూ.137 కోట్లు కేటాయించామని, త్వరలోనే పనులు చేపడతామని అన్నారు. గోదావరమ్మకు చీరె, సారె, పసుపు, కుంకుమ సమర్పించారు. ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ వర్ష ప్రభావం అధికంగా ఉన్న ములుగు జిల్లాకు రూ.2.50 కోట్లు, భూపాలపల్లి జిల్లాకు రూ.2 కోట్లు, మహబూబాబాద్‌ జిల్లాకు రూ.1.50 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రూ.2.30 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ నిధులను వరద ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం వినియోగించుకోవాలని సూచించారు. మరో మూడు నెలల వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, వర్షాలు ముగిసేంత వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రెండు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. శాపెల్లి గ్రామానికి బ్రిడ్జి నిర్మాణానికి అటవీ అధికారులు అడ్డుపడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క సీఎం దృష్టికి తీసుకురాగా.. వారిని సీఎం మందలించారు.  


మోటార్లు పని చేయకపోతే ఏం చేస్తున్నారు?: కేసీఆర్‌

‘‘మోటార్లు పని చేయకపోతే ఏం చేస్తున్నారు? సింగరేణి నుంచి తెప్పించుకోవద్దా? ఇంత పెద్ద వరదకు చిన్న మోటార్లు ఎలా పని చేస్తాయి? ఎప్పుడు ఈ వరదను తోడుతాయి?’ అంటూ సీఎం కేసీఆర్‌ భద్రాద్రి జిల్లా అధికారులను ప్రశ్నించారు. ఆదివారం  రామాలయం సమీపంలోని గోదావరి కరకట్ట వద్ద ర్యాంపుపై నుంచి నది ఉధృతిని ఆయన పరిశీలించారు. కరకట్ట స్లూయిస్‌ నుంచి లీకేజీ నీటిని మోటార్ల ద్వారా తోడుతున్నామని అధికారులు తెలపగా.. అందుకు ఎన్ని మోటార్లు వినియోగిస్తున్నారని సీఎం అడిగారు. ఐదు మోటార్లకు మూడు పని చేయడంలేదని వారు చెప్పడంతో.. సింగరేణి నుంచి పెద్ద మోటార్లను పెట్టుకోవద్దా? ఉన్న మోటార్లలో మూడు పనిచేయకపోతే ఎలా? అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిని తోడే మోటార్లను, ఆలయ సమీపంలో వరదలో మునిగి ఉన్న ఇళ్లను పరిశీలించారు. 

Read more