కారులో టికెట్‌ రగడ

ABN , First Publish Date - 2022-08-13T09:15:47+05:30 IST

మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డే! ఇది టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం మాట! ఆయనకు పార్టీ టికెట్‌ ఇస్తే పని చేసే ప్రసక్తే లేదు!.

కారులో టికెట్‌ రగడ

  • అధిష్ఠానం ఎంపికపై స్థానిక ప్రజాప్రతినిధుల అసంతృప్తి
  • టీఆర్‌ఎస్‌ ‘మునుగోడు’ అభ్యర్థి కూసుకుంట్లే
  • ఎన్నికల ఖర్చంతా పార్టీయే భరిస్తుంది
  • జిల్లా నాయకులతో సీఎం కేసీఆర్‌
  • ఆయనను వ్యతిరేకిస్తూ అసమ్మతి నేతల భేటీ
  • కూసుకుంట్లకు టికెట్‌ ఇవ్వొద్దంటూ తీర్మానం
  • దాదాపు 300 మంది ప్రజాప్రతినిధుల హాజరు


నల్లగొండ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డే! ఇది టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం మాట! ఆయనకు పార్టీ టికెట్‌ ఇస్తే పని చేసే ప్రసక్తే లేదు!.. ఇది మునుగోడు టీఆర్‌ఎస్‌ నేతల ఆగ్రహం! మునుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంపికపై రగడ కొనసాగుతోంది. పార్టీ అధిష్ఠానం కూసుకుంట్లవైపే మొగ్గు చూపుతుండగా.. స్థానిక నాయకత్వం మాత్రం ఆయన అయితే ససేమిరా పని చేయబోమని మండిపడుతోంది. మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్లయ్య యాదవ్‌, చిరుమర్తి లింగయ్య, పార్టీ జిల్లా ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు తదితరులతో గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ సమావేశమైన సంగతి తెలిసిందే. ‘‘కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి అదృష్టవంతుడు. అన్ని పేర్లతో సర్వే చేయించాను. ప్రభాకర్‌ రెడ్డికే టికెట్‌ ఇవ్వాలని మెజార్టీ ప్రజలు వాటిలో తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక ఖర్చంతా పార్టీనే భరిస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఎవరూ ఎక్కడా అడగాల్సిన పని... ఇబ్బంది పడాల్సిన పని లేదు. విభేదాలు పక్కన పెట్టి అంతా కలిసికట్టుగా పని చేసి పార్టీ అభ్యర్థి గెలుపునకు పని చేయాలి. స్థానికంగా పార్టీకి సానుకూల పరిస్థితులు ఉన్నాయి’’ అని వారికి సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈనెల 20న మునుగోడులో నిర్వహించాలని నిర్ణయించిన బహిరంగ సభలోనే కూసుకుంట్ల పేరు ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. 


కానీ, అసమ్మతి సెగలు రేగుతున్న నేపథ్యంలో  బహిరంగ సభ తర్వాత కొద్ది రోజులకు ప్రకటిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని జిల్లా నాయకులు సీఎం కేసీఆర్‌ ఎదుట వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక, కూసుకుంట్ల వైపే అధిష్ఠానం మొగ్గు చూపుతోందని తెలిసిన స్థానిక టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు శుక్రవారం చౌటుప్పల్‌ మండలంలోని గుడిమల్కాపూర్‌ వద్ద ఉన్న ఆందోళ్‌ మైసమ్మ ఆలయ సమీపంలోని  ఓ ఫంక్షన్‌ హాలులో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు దాదాపు 300 మంది వరకూ పాల్గొన్నారు. ఆయనకు పార్టీ టికెట్‌ ఇస్తే పనిచేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే మంత్రి జగదీశ్‌ రెడ్డి ఎన్నిసార్లు బుజ్జగించినా తగ్గేదే లేదంటూ మునుగోడు నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొనడం గమనార్హం. పార్టీ నేతలను ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులు పెట్టి శత్రువులకు సహకరించే కూసుకుంట్లకు టికెట్‌ ఇస్తే పార్టీకి నష్టం జరుగుతుందని తేల్చి చెప్పారు. రెండు రోజుల కిందట ప్రగతి భవన్‌లో సమావేశమైనప్పటికీ అసమ్మతి నేతలు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. కూసుకుంట్లకు వ్యతిరేకంగా 300 మంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సమావేశమై ఆయనకు టికెట్‌ ఇవ్వొద్దని తీర్మానం చేశారు. సమావేశంలో చౌటుప్పల్‌ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, నారాయణపురం జడ్పీటీసీ, ఎంపీపీ, నాంపల్లి ఎంపీపీ, పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు.


స్థల పరిశీలనలో మంత్రి జగదీశ్‌

మునుగోడులో ఈనెల 21న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సభ ఉన్న నేపథ్యంలో దానికంటే ముందే టీఆర్‌ఎస్‌ సభ నిర్వహించాలని గురువారంనాటి సమావేశంలో సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. దాంతో, మంత్రి జగదీశ్‌ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం ఉదయాన్నే స్థల పరిశీలన చేశారు. మునుగోడు, సంస్థాన్‌ నారాయణపురం మండల కేంద్రాలతోపాటు పుట్టపాక గ్రామంలోని స్థలాలను పరిశీలించారు. మునుగోడులో నల్లరేగడులు, చౌడు భూములు అధికంగా ఉండడంతో వర్షం వస్తే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్న యోచనతో ప్రత్యామ్నాయంగా నారాయణపురం మండల కేంద్రంతోపాటు పుట్టపాకలో స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తున్నానని చెప్పి రాజగోపాల్‌రెడ్డి తన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్నాడని ఆరోపించారు. ప్రస్తుత ఉప ఎన్నికను తాము సాధారణ ఎన్నికల మాదిరిగానే అనుకుంటున్నామన్నారు. ఈ ఎన్నికలో తమకు ఎవరూ పోటీ లేరని, కాంగ్రెస్‌, బీజేపీ రెండో స్థానం కోసం కొట్లాడుతున్నాయని అన్నారు.

Read more