BANDI SANJAY: బీజేపీ సారథ్యం మళ్లీ సంజయ్‌కే!

ABN , First Publish Date - 2022-12-12T03:30:23+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌నే కొనసాగిస్తారా? తెలంగాణలో రాబోయే ఎన్నికలను పార్టీ ఆయన నేతృత్వంలోనే ఎదుర్కోనుందా? అంటే విశ్వసనీయ వర్గాలు అవుననే అంటున్నాయి.

BANDI SANJAY: బీజేపీ సారథ్యం మళ్లీ  సంజయ్‌కే!

రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా మళ్లీ ఆయనే?

కొనసాగింపునకే అధిష్ఠానం మొగ్గు

మార్చితో ముగియనున్న పదవీ కాలం

జాతీయ నాయకత్వం మద్దతు సంజయ్‌కే!

వచ్చే ఎన్నికలు ఆయన సారథ్యంలోనే?

హైదరాబాద్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌నే కొనసాగిస్తారా? తెలంగాణలో రాబోయే ఎన్నికలను పార్టీ ఆయన నేతృత్వంలోనే ఎదుర్కోనుందా? అంటే విశ్వసనీయ వర్గాలు అవుననే అంటున్నాయి. 2020 మార్చి 11న బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా సంజయ్‌ బాధ్యతలు చేపట్టారు. పార్టీ సంస్థాగత నియమావళి ప్రకారం రాష్ట్ర అధ్యక్షుడి పదవీకాలం మూడేళ్లే ఉంటుంది. అంటే 2023 మార్చిలో ఆయన పదవీకాలం పూర్తవుతుంది. అయితే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త వ్యక్తిని నియమించే అవకాశం లేదని.. సంజయ్‌నే కొనసాగిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మూడేళ్ల కిందటి వరకు రాష్ట్రంలో ఉండీలేనట్లుగా ఉన్న బీజేపీ.. ఇప్పుడు అధికార బీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయంగా ఎదిగిన నేపథ్యంలో సంజయ్‌ కృషిని ఆరెస్సె్‌సతోపాటు పార్టీ జాతీయ నాయకత్వం గుర్తించాయని ఆ వర్గాలు వెల్లడించాయి. బీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీయేనన్న సంకేతాలను సంజయ్‌ జనంలోకి స్పష్టంగా తీసుకెళ్లారని, అందువల్లే ఓటుబ్యాంకు కూడా గణనీయంగా పెరిగిందని పేర్కొన్నాయి. సంజయ్‌ కృషి కారణంగా రాష్ట్ర పార్టీలో గుణాత్మక మార్పు చోటుచేసుకుందని అంటున్నాయి. దీనికి తోడు బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై ఆయన దూకుడు వైఖరి రాజకీయంగా సంచలనమవుతోందని తెలిపాయి. కేసీఆర్‌ సర్కారు వైఫల్యాలు, హామీల అమలు కోసం చేస్తున్న ఉద్యమాలు, ఆందోళనలు, రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్ర, ఉప ఎన్నికల్లో పార్టీ పోరాడిన తీరు, కేడర్‌కు జోష్‌ తీసుకురావడంతో పాటు ప్రత్యర్థుల దాడిలో గాయపడ్డ కార్యకర్తలకు అండగా నిలవడం, పార్టీ నాయకులను, శ్రేణులను సమన్వయం చేసుకుంటూ కేవలం ఏడాది వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 10 భారీ బహిరంగ సభలు విజయవంతంగా నిర్వహించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న జాతీయ నాయకత్వం, సంజయ్‌నే కొనసాగించాలని భావిస్తున్నట్లు వివరించాయి.

సంజయ్‌ పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టకముందు ఒక్క ఎమ్మెల్యే ఉండేవారు. ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండడంతో పాటు బీఆర్‌ఎ్‌సతో ఢీ అంటే ఢీ అనే స్థాయికి కేడర్‌ ఎదిగిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సంజయ్‌నే కొనసాగించే అవకాశాలు ఎక్కువని పార్టీ ముఖ్య నేతలు వెల్లడించారు. ‘సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి బండి సంజయ్‌ చాలు’ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బహిరంగ సభలో ప్రకటించడం, అంతకుముందు పరేడ్‌ గ్రౌండ్స్‌ వేదికగా నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రధాని మోదీ ‘శెభాష్‌.. సంజయ్‌’ అంటూ వెన్నుతట్టడం వంటి సంఘటనలు జాతీయ నాయకత్వం సంజయ్‌కి అండగా ఉన్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని బీజేపీ ముఖ్య నేత ఒకరు అభిప్రాయపడ్డారు. సంజయ్‌ దూకుడు వైఖరితో యువత బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని, పాదయాత్రకు వివిధ వర్గాల నుంచి, ముఖ్యంగా అధికార బీఆర్‌ఎస్‌ బాధితుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్‌పై, సర్కారు విధానాలపై దూకుడుగా వెళ్తూనే.. హిందూత్వ అజెండాను కూడా క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకెళ్తుండడాన్ని ఆరెస్సెస్‌, పార్టీ జాతీయ నాయకత్వం గుర్తించాయని మరో నేత చెప్పారు.

Updated Date - 2022-12-12T04:58:52+05:30 IST