అభివృద్ధి కోసమే కేటీఆర్‌ను కలిశా

ABN , First Publish Date - 2022-01-03T08:55:02+05:30 IST

‘‘నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని సంగారెడ్డి పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్‌ను కోరా. సమస్యల పరిష్కారం కోసం రూ.900కోట్లు విడుదల చేయాలని అడిగా. ఇస్తారా? లేదా? అన్నది ఆయన ఇష్టం.

అభివృద్ధి కోసమే కేటీఆర్‌ను కలిశా

  • గతంలో రేవంత్‌ సైతం ఆయన్ను కలిశారు
  • నన్ను విమర్శించేటోళ్లు.. దీనికేం చెప్తారు?
  • సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి


హైదరాబాద్‌, జనవరి 2(ఆంధ్రజ్యోతి): ‘‘నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని సంగారెడ్డి పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్‌ను కోరా. సమస్యల పరిష్కారం కోసం రూ.900కోట్లు విడుదల చేయాలని అడిగా. ఇస్తారా? లేదా? అన్నది ఆయన ఇష్టం. దీనిపై కొన్ని అభిమాన సంఘాలు ఇష్టానుసారం ప్రచారం చేస్తున్నాయి’’ అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. తాను కోవర్టునైతే.. మెదక్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా తన భార్య నిర్మలారెడ్డిని ఎందుకు నిలబెడతానని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌తో రేవంత్‌ కలిసి ఉన్న ఫొటోను మీడియాకు చూపిన జగ్గారెడ్డి.. తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేసేటోళ్ల్లు దీనికి సమాధానం చెప్పగలరా? అని నిలదీశారు. ‘‘నామీద కేటీఆర్‌ చెయ్యి వేసి మాట్లాడితే కోవర్టు అంటున్నారు. మరి కిషన్‌రెడ్డి, కేటీఆర్‌ కలిసి దిగిన ఫొటో ఇవాళ వచ్చింది. కేటీఆర్‌.. రేవంత్‌ అసెంబ్లీలో ఒకరినొకరు లాక్కుంటున్న ఫొటోలొచ్చాయి. దీన్ని ఏమంటారు? జవాబు చెప్పకుండా మాట్లాడితే తోడ్క లు తీస్తా! ఏం తమాషా చేస్తున్నారా? బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారా? తీన్మార్‌ మల్లన్న తోపు అనుకుంటున్నడా? ఆయన బ్లాక్‌మెయిల్‌ సంగతి తెలియదా? నన్ను కొనేటోడు ఎవడు? నన్ను ఏజెంట్‌ అనడానికి మల్లన్న ఎవడు?’’ అని ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో ఆదివారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు గందరగోళానికి గురి కావద్దని, తాను పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వాన్ని లైన్‌లో పెట్టడానికే ఇవన్నీ మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. ‘పీసీసీ అధ్యక్షుడంటే బస్సు డ్రైవర్‌ లాంటివాడు. బస్సు సక్కగా లేకుంటే.. సరిద్దిద్దుకో అని చెప్పిన.ఇది కూడా చెప్పొద్దా?’ అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ తన కంటే పెద్దవారైనందునే తిట్టడం లేదని, తనకంటూ ఒక పద్ధతి ఉందని అన్నారు. ‘కొన్ని లేఖలు లీక్‌ చేయకున్నా వస్తాయని, పీఏసీ సమావేశం ఒక వైపు జరుగుతుండగానే బ్రేకింగ్‌ న్యూస్‌లు రావట్లేదా? నేను టీఆర్‌ఎస్‌ ఏజెంటును, కోవర్టును అని విమర్శించిన సోషల్‌ మీడియాలోనే గత మూడేళ్లుగా రేవంత్‌రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు అంటూ రాశారు. అంతగా ప్రచారం చేసుకున్న రేవంత్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని ప్రశ్నించారు. తాను టీఆర్‌ఎ్‌సలోకి వెళ్లాలనుకుంటే నేరుగానే వెళ్తానని, దానికి ఎవరైనా అడ్డమా? అని అన్నారు. ఈ నెల 5న జరిగే పీఏసీ సమావేశంలో ఈ అంశాలన్నింటిపైనా మాట్లాడతానన్నారు. చిన్నారెడ్డి ప్రకటన వెనకా రేవంత్‌ హస్తం ఉందని, ఆయన సోనియా డైరెక్షన్‌లో లేరని ఆరోపించారు. రేవంత్‌ గురించి తాను చాలా చెబుతానని, చిన్నారెడ్డినీ అన్నీ అడుగుతానని స్పష్టం చేశారు. అవసరం వచ్చినప్పుడు సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుపైనా మాట్లాడుతానని స్పష్టం చేశారు. తాను ఎవరికీ బానిసను కాదని పేర్కొన్నారు.  తనకు తెలివి తక్కువ ఉంది కాబట్టి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పోస్ట్‌ ఇచ్చారని, రేవంత్‌కు తెలివి ఎక్కువ ఉందని పీసీసీ అధ్యక్ష పోస్టు ఇచ్చారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఒక బాధ్యత గల వ్యక్తి శశిథరూర్‌పైన మీడియాతో చిట్‌చాట్‌లో అలా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు.

Updated Date - 2022-01-03T08:55:02+05:30 IST