జనారణ్యమైన మేడారం

ABN , First Publish Date - 2022-02-16T07:40:40+05:30 IST

ఆలయమే లేని అపూర్వ పుణ్యక్షేత్రంలో.. గద్దెలే గర్భ గుడులుగా కొలువుతీరనున్న సమ్మక్క, సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. మేడారం అటవీప్రాంతం జనారణ్యంగా మారిపోయింది. జంపన్నవాగు జలజలాపారుతూ..

జనారణ్యమైన మేడారం

  • నేటి నుంచి సమ్మక్క, సారలమ్మ జాతర
  • భారీగా తరలి వెళ్తున్న భక్తులు
  • వనదేవతలను స్వాగతించేందుకు భక్తకోటి సిద్ధం
  • తొలి రోజే గద్దెలకు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు


మేడారం, భూపాలపల్లి, ములుగు, హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, బేగంపేట, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ఆలయమే లేని అపూర్వ పుణ్యక్షేత్రంలో.. గద్దెలే గర్భ గుడులుగా కొలువుతీరనున్న సమ్మక్క, సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. మేడారం అటవీప్రాంతం జనారణ్యంగా మారిపోయింది. జంపన్నవాగు జలజలాపారుతూ.. తెలంగాణ కుంభమేళాలో భక్తుల పుణ్యస్నానాలకు సిద్ధమైంది. కొన్ని కిలోమీటర్ల దూరం వరకు మేడారం విద్యుత్తు వెలుగులు జిగేల్‌మంటున్నాయి. ‘‘గులాంగిరిని ప్రశ్నించిన గూడెం జాతర.. గుండె ధైర్యాన్ని చాటే కొండ జాతర.. అడవికి యుద్ధం నేర్పిన అమ్మల జాతరకు పదండిపోదాం..’’ అంటూ అశేష భక్తజనం కదంతొక్కారు. కాలినడకన, ఎడ్లబండ్లు, కార్లు, ఆటోలు, జీపులు, బస్సుల్లో తరలివస్తున్నారు.


వేద మంత్రాలు లేని పూజలు

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దట్టమైన అడవుల్లో జరిగే ఈ మహా జాతరకు.. తెలుగు రాష్ట్రాలతోపాటు.. ఛత్తీ్‌సగఢ్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిసా  నుంచి భక్తులు తరలివస్తారు. పూర్తిగా ఆదివాసీ సంప్రదాయంలో జరిగే ఈ జాతరలో దేవతామూర్తుల విగ్రహాలు ఉండవు. హోమాలు, యాగాలు కనిపించవు. వేద మంత్రాలు వినిపించవు. ప్రకృతినే దైవంగా భావించి ఇక్కడ పూజలు జరుగుతాయి. పూజారులందరూ ఆదివాసీలే..! ఇక్కడి పూజారులకు ఏ వేదాలు, మంత్రాలు రావు. వనదేవతల స్మారకార్థం నిర్మించిన కర్రల వద్దే.. గద్దెలపై పూజలు నిర్వహిస్తారు. పసుపు కుంకుమలు, ఒడిబియ్యం, ఎదుర్కోళ్లు, బంగారం (బెల్లం) ప్రధాన మొక్కులు. జాతర ఆదివాసీలదే అయినా.. గిరిజనేతర భక్తులే అధికంగా వస్తారు. 


ఘట్టాలు ఇలా..

భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాఘ పౌర్ణమి క్షణాలు బుధవారం సాక్షాత్కరించనున్నాయి. తొలిరోజునే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెకు చేరుకుంటారు. జంపన్నను మంగళవారమే గద్దెపైకి చేర్చారు. బుధవారం తొలుత కన్నెపల్లి ఆడపడుచు సారలమ్మకు పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం రహస్య పూజలు జరుపుతారు. ఆ సమయంలోనే అమ్మవారు సారయ్యను ఆవహిస్తారు. ఆ తంతుతోనే అమ్మవారిని గద్దెలపైకి తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది. కన్నెపల్లిలో ప్రతి గడప సారలమ్మకు స్వాగతం పలుకుతుంది. సారలమ్మ జంపన్న వాగును దాటే సమయంలో భక్తులు ఎదురెళ్లి, పొర్లు దండాలు పెడతారు. శివసత్తుల పూనకాలు, జయజయనాదాలతో సారలమ్మ గద్దెనెక్కుతారు. మంగళవారమే మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామం నుంచి సమ్మక్క భర్త పగిడిద్ద రాజు మేడారం బయలుదేరారు.


పూజారి పెనుక బుచ్చిరాములు ఆధ్వర్యంలో ఆదివాసీలు కాలినడకన బుధవారం సాయంత్రానికి మేడారానికి చేరుకుంటారు. పగిడిద్దరాజు తమ్ముడు గోవిందరాజులు కూడా బుధవారం ప్రధాన పూజారి దుబ్బకట్ల గోవర్ధన్‌ నేతృత్వంలో ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామం నుంచి పడిగె రూపంలో బయలుదేరి, మేడారాన్ని చేరుకుంటారు. దీంతో తొలిరోజు జాతర అట్టహాసంగా ప్రారంభమవుతుంది. గురువారం పూజారి కొక్కెర కిష్టయ్య నేతృత్వంలో.. చిలకలగుట్టపై ఉండే సమ్మక్కను వేడుకగా తోడ్కొని వస్తారు. గురువారం రాత్రి 10 గంటలకల్లా సమ్మక్కను గద్దెపైకి చేరుస్తారు. అప్పటి నుంచి శనివారం సాయంత్రం వరకు మొక్కులు కొనసాగుతాయి. సాయంత్రం 6కు సమ్మక్క చిలకలగుట్టకు తిరుగు ప్రయాణం అవుతుంది. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా  స్వగ్రామాలకు పయనమవుతారు. దీంతో జాతర ముగుస్తుంది.


గట్టమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సీతక్క 

ములుగు సమీపంలోని గట్టమ్మతల్లిని ఎమ్మెల్యే సీతక్క మంగళవారం దర్శించుకున్నారు. కానుకలు సమర్పించారు.  అనంతరం ఆమె బస్‌లో మేడారం బయలుదేరారు. బస్టాండ్‌ నుంచి కిలోమీటర్‌ వరకు ఎడ్లబండిని తోలి.. మేడారం చేరుకున్నారు. సమ్మక్క-సారలమ్మ ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మేడారం వచ్చారు. 
హెలికాప్టర్‌ సేవలు ప్రారంభం

మేడారం జాతరకు హైదరాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ నుంచి హెలికాప్టర్‌ సేవలు ప్రారంభమయ్యాయి. మంగళవారం బేగంపేట విమానాశ్రయంలో మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ ఈ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, హన్మకొండ నుంచి ఈ నెల 20 వరకు హెలికాప్టర్ల సేవలు కొనసాగుతాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌, కరీంనగర్‌ నుంచి మేడారానికి ఒకరికి రూ.75వేలు, మహాబూబ్‌నగర్‌ నుంచి ఒకరికి రూ. లక్ష రూపాయల చొప్పున చార్జ్జీ ఉంటుందన్నారు. హన్మకొండ నుంచి ఒకరికి రూ. 19,999 చార్జీ అవుతుందని వివరించారు. మేడారంలో జాతరను హెలిక్యాప్టర్‌లో వీక్షించేందుకు భక్తులకు ఒక్కొక్కరికీ రూ.3,700 చార్జీ ఉంటుందని తెలిపారు.


పోలీసుల ఏర్పాట్లు ఇలా..

  • శాంతిభద్రతలను నిరంతరం పర్యవేక్షించేలా రెండు కమాండ్‌  కంట్రోల్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ భారీ ఎల్‌ఈడీ తెరలున్నాయి.
  • ప్రతి 100 మీటర్లకు ఒకటి చొప్పున 382 హెచ్‌డీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అంటే.. జాతరలో ప్రతి అంగుళాన్ని పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు.. ములుగు-ఏటూరునాగారం ప్రధాన రహదారి, కీలక రహదారుల్లో మరో 82 సీసీ కెమెరాలతో నిఘా కొనసాగిస్తున్నారు వీటిల్లో ఫేషియల్‌ రికగ్నేషన్‌ కెమెరాలు కూడా ఉన్నాయి. వీటి ద్వారా పాత నేరస్థులు, దొంగలు, మావోయిస్టులను పసిగట్టి, అదుపులో తీసుకునే అవకాశాలుంటాయి
  • తప్పిపోయిన వారి కోసం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ఆరు మిస్సింగ్‌ క్యాంపులను ఏర్పాటు చేశారు. తప్పిపోయిన వారి వివరాలను మైక్‌లో ప్రకటించడంతోపాటు ఎక్కడికక్కడ వీఎంఎస్‌ బోర్డులను ఏర్పాటు చేసి వారిని లైవ్‌లో చూపిస్తారు
  • భక్తుల సంఖ్యను లెక్కించేందుకు ప్రత్యేకంగా క్రౌడ్‌ కౌంటింగ్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా క్యూలైన్లలో ఎంతమంది ఉన్నారు? ఎక్కడైనా ఇబ్బందులున్నాయా? అనే విషయాలను పరిశీలించి, వెంటనే క్షేత్రస్థాయి సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేస్తారు. అదేవిధంగా వాహనాల రద్దీని ఎప్పటికప్పుడు గమనిస్తూ.. క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తారు

Read more