సురక్షిత నగరాలు..హైదరాబాద్‌ @ 3

ABN , First Publish Date - 2022-09-21T08:17:10+05:30 IST

దేశంలో అత్యంత సురక్షిత నగరాల్లో హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలిచింది. కోల్‌కతా మొదటి స్థానం, పుణె రెండో స్థానంలో ఉన్నాయి.

సురక్షిత నగరాలు..హైదరాబాద్‌ @ 3

  • కోల్‌కతాకు మొదటి ప్లేస్‌
  • చివరి స్థానంలో ఢిల్లీ.. నేరాల నమోదు ఆధారంగా ఎన్‌సీఆర్‌బీ ప్రకటన


హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): దేశంలో అత్యంత సురక్షిత నగరాల్లో హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలిచింది. కోల్‌కతా మొదటి స్థానం, పుణె రెండో స్థానంలో ఉన్నాయి. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) ప్రకటించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 20 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో ఒక ఏడాదిలో విచారణకు అర్హమైన నేర ఘటనలను(కాగ్నిజబుల్‌ అఫెన్స్‌) విశ్లేషించిన ఎన్‌సీఆర్‌బీ ఈ స్థానాలను ప్రకటించింది. ఎన్‌సీఆర్‌బీ ప్రకారం.. హైదరాబాద్‌లో ప్రతి 10 లక్షల జనాభాకు కేవలం 2,599 నేరాలు మాత్రమే నమోదు అవుతున్నాయి. కోల్‌కతాలో ఈ సంఖ్య 1,034గా, పుణెలో 2,568గా ఉంది. బెంగళూరులో ప్రతి 10 లక్షల మందికి 4,272 నేరాలు నమోదు అవుతున్నాయి. ఈ జాబితాలో బెంగళూరు 5వ స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా, ఢిల్లీలో ప్రతి పది లక్షల మందికి 18,596 నేరాలు నమోదవుతున్నాయి. సురక్షిత నగరాల జాబితాలో ఢిల్లీ అట్టడుగున నిలిచింది. అతి తక్కువ నేరాలు నమోదవుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలవడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. హోం మంత్రి మహమూద్‌ అలీ, పోలీస్‌ శాఖకు అభినందనలు తెలిపారు. మరోవైపు, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసినందుకు నటుడు ప్రకాశ్‌రాజ్‌ను కేటీఆర్‌ అభినందించారు. 

Read more