విద్యుత్తు కంచెకు బాలుడి బలి

ABN , First Publish Date - 2022-09-25T09:47:04+05:30 IST

అడవి పందులు, కోతుల నుంచి పంటను కాపాడుకునేందుకు ఓ రైతు వేసిన విద్యుత్తు కంచె ఓ బాలుడి నిండు ప్రాణాన్ని బలిగొంది.

విద్యుత్తు కంచెకు బాలుడి బలి

  • పొలంలోకి దూసుకెళ్లిన ఎడ్లబండి.. 
  • కాలికి వైరు తగిలి ఓ ఎద్దు.. 
  • కంచెమీద పడి బాలుడి దుర్మరణం
  • విద్యుత్తు కంచె ఏర్పాటు చేస్తే కేసు
  • ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ హెచ్చరిక 

దిలావర్‌పూర్‌, హనుమకొండ రూరల్‌, సెప్టెంబరు 24: అడవి పందులు, కోతుల నుంచి పంటను కాపాడుకునేందుకు ఓ రైతు వేసిన విద్యుత్తు కంచె ఓ బాలుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. కళ్లముందే కన్న కొడుకు, ఎద్దు విద్యుదాఘాతంతో మృతిచెందడంతో ఆ తండ్రి గుండెలవిసేలా రోదించాడు. నిర్మల్‌ జిల్లాలో శనివారం ఈ విషాదం జరిగింది. జిల్లాలోని దిలావర్‌పూర్‌ మండలం కదిలి గ్రామానికి చెందిన వాగ్మారే గంగాధర్‌ రైతు. ఆయనకు కుమారుడు చంద్రకాంత్‌ (16) ఉన్నాడు. చంద్రకాంత్‌ దిలావర్‌పూర్‌ గ్రామ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం ఎడ్ల బండిపై కుమారుడు చంద్రకాంత్‌ను వెంటబెట్టుకొని గంగాధర్‌ గ్రామ శివారులోని తన పొలానికి వెళ్లాడు. అయితే అడవి పందులు, కోతులు పత్తిపంటను నాశనం చేస్తుండటంతో అదే గ్రామానికి చెందిన ఓ రైతు తన పంట చుట్టూ విద్యుత్తు కంచెను ఏర్పాటు చేశాడు. ఇది తెలియని గంగాధర్‌ ఆ పొలం పక్క నుంచే తన చేనుకు వెళ్లాడు. ఎదురుగా కోతులు రావడంతో వాటిని అదిలించేందుకు గంగాధర్‌ బండి దిగి వెళ్లాడు. దీంతో ఎడ్ల బండిని చంద్రకాంతే నడిపాడు.


కొద్దిదూరం వెళ్లగానే బండి అదుపు తప్పి విద్యుత్తు కంచె ఎర్పాటు చేసిన పొలంలోకి దూసుకెళ్లింది. కాలికి విద్యుత్తు కంచె తగలడంతో ఓ ఎద్దు అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందింది. బండి పల్టీకొట్టడంతో దాని మీద ఉన్న చంద్రకాంత్‌ నేరుగా విద్యుత్తు కంచెపై పడి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో మరో ఎద్దు ప్రాణాలతో బయట పడింది. ఇదంతా కూడా గంగాధర్‌ కళ్లెదుటే జరిగింది. ఆయన రోదిస్తూ విషయాన్ని గ్రామస్థులకు, పోలీసులకు తెలిపాడు. నిర్మల్‌ డీఎస్పీ జీవన్‌ రెడ్డి ఘటనా స్థలికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.  పొలం చుట్టూ విద్యుత్‌ కంచె ఏ ర్పాటు చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


పంటలను రక్షించేందుకు మార్గాలు

రైతులు తమ పంటపొలాల చుట్టూ విద్యుత్తు కంచెలు వేస్తే సెక్షన్‌ 304 పార్ట్‌-2 కింద కేసు నమోదు చేస్తామని ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు హెచ్చరించారు. పంటల చుట్టూ విద్యుత్తు కంచెల ఏర్పాటు కారణంగా  రైతులు, వ్యవసాయ కార్మికులు, పశువులు చనిపోతున్నాయని చెప్పారు. ఈ మధ్యకాలంలో చేపలు పట్టడానికి కూడా విద్యుత్తు పరికరాలతో గాలాలను ఉపయోగిస్తున్నారని ఇది చేయడం చట్టరీత్యా నేరం అన్నారు. పంటల సంరక్షణకు సోలార్‌ ఫెన్స్‌ ఎనర్జయిజర్‌ యంత్రాలు, రికార్డింగ్‌ మైక్‌లతో జంతువుల తగ్గించుకోవచ్చునని సూచించారు. ఎవరైనా విద్యుత్తు కంచెలు వేసుకున్నట్లు సమాచారం అందితే విద్యుత్తు అ ధికారులకు, లేదంటే 18004250028/1918 టోల్‌ఫ్రీ నం బరులో ఫిర్యాదు చేయవచ్చునని సీఎండీ పేర్కొన్నారు.

Updated Date - 2022-09-25T09:47:04+05:30 IST