సౌకర్యాలు నిల్‌

ABN , First Publish Date - 2022-09-30T05:59:58+05:30 IST

సౌకర్యాలు నిల్‌

సౌకర్యాలు నిల్‌

అసౌకర్యాల నడుమ రైతు వేదికలు

ఊరికి దూరంగా నిర్మాణం

మహిళా ఉద్యోగులకు రక్షణ కరువు..

రెంటికి ఇబ్బందులే... తాగునీటి సౌకర్యం లేదు..

పట్టించుకోని వ్యవసాయ శాఖ అధికారులు

జిల్లాలో 82 రైతు వేదికలు 


మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌, సెప్టెంబరు 29 : రైతు వేదికల ద్వారా రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ ఆర్థికంగా బలోపేతం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ.. వేలాది రూపాయలు వెచ్చించి ఎంతో హంగు ఆర్భాటంతో నిర్మించిన రైతు వేదికలు అసౌకర్యాల నడుమ కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్ని రైతు వేదికలు గ్రామాల్లోనూ, సమీపంలో నిర్మించిన రైతు వేదికలు కొన్ని సౌకర్యంగా ఉన్నప్పటికి మరికొన్ని రైతు వేదికలు సౌకర్యాలు లేక సిబ్బంది తో పాటు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళా ఏఈవోలు, మహిళా రైతులు మరుగుదొడ్లు లేక అనేక అవస్థలు పడుతున్నారు. మరికొన్ని రైతు వేదికలు ఊరికి దూరంగా ఉండి మహిళా ఉద్యోగులకు రక్షణతో పాటు భద్రత కూడా మహబూబాబాద్‌ జిల్లాలో కరువైంది. 


శిథిలావస్థలో మరుగుదొడ్లు...

జిల్లాలో 82 వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. వాటికనుగుణంగా 82 రైతు వేదికలను ఒక్కొక్క రైతు వేదిక భవనాన్ని రూ.22లక్షలతో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, ఈజీఎస్‌ నిధులతో నిర్మించారు. అయితే ఏ గ్రామానికి చెందిన ఆ గ్రామ నాయకుడికే రైతు వేదిక నిర్మించే బాధ్యత ను అప్పగించడంతో ఈ రైతు వేదికల నిర్మాణం అసంపూర్తిగా మారింది. జిల్లాలోని రైతు వేదికల్లో కొంతమంది నాయకులు నిజాయితీగా భవనంతో పాటు మరుగుదొడ్లు నిర్మించిన ప్పటికి మరికొందరు మాత్రం అసంపూర్తిగా పనులు చేసి వదిలేశారు. కొన్నింటిలో నిర్మించిన మరుగుదొడ్లకు తలుపులు ఏర్పాటు చేసినప్పటికి చోరీకి గురయ్యాయి. బేషన్‌లలో చెత్తాచెదారం పేరుకుపోయి అధ్వానంగా మారాయి. దానికి ఉదాహారణగా జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో నిత్యం జిల్లా అధికారులతో, రైతులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 82 మంది ఏఈవోలకు గాను 40 శాతం  మంది మహిళా ఏఈవోలు ఉన్నారు. కొన్ని గంటల పాటు జరిగే సమావేశంలో మహిళా అధికారులు, రైతులు మరుగుదొడ్లు సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. వాటిని తిరిగి వినియోగంలోకి తీసుకురావడంలో వ్యవసాయాధికారులు పట్టించుకోవడం లేదు. 


రక్షణ కరువు..

జిల్లాలోని కొన్ని రైతు వేదికలు గ్రామంలో, గ్రామ శివార్లలో నిర్మించి రైతులకు అందుబా టులో ఉండగా మరికొన్ని మాత్రం ఊరికి దూరంగా, బోళ్లు, రాళ్లు రప్పల మధ్య నిర్మించడం ద్వారా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు రక్షణ, భద్రత కరువైంది. గతేడాది జిల్లాలోని ఆలేరు గ్రామానికి దూరంగా నిర్మించిన రైతు వేదికలో ఒక మహిళా ఏఈవో విధుల్లో ఉండగా ఎవరు లేని సమయంలో ఆ ఆగంతకుడు ఆమెను బెదిరించి బంగారు చైన్‌ బలవంతంగా లాక్కుపోయిన సంఘటన జిల్లాలో సంచలనం రేపింది. ఈ సంఘటనతో ఒంటరిగా మహిళా ఉద్యోగులు రైతు వేదికలకు వెళ్లాలంటే భయం...భయంగా ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని విధులు నిర్వర్తించాల్సిన దుస్థితి నెలకొంది. రైతు వేదికల్లో కనీసం వాచ్‌మెన్‌ కూడా ఏర్పాటు చేయలేదు. 


సౌకర్యాలు శూన్యం...

పలు మండలాల్లోని రైతు వేదికల్లో ఏవోలు, ఏఈవోలు కలిసి సొంత ఖర్చులతో ప్రైవేట్‌గా వాచ్‌మెన్‌లను నియమించుకుంటున్నారు. అయినప్పటికి కొన్ని రైతు వేదికల్లో అసలే వాచ్‌మెన్‌లు లేరు. అంతేకాకుండ తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడానికి కనీసం నల్లాలు కూడా లేవు. రైతులు సమావేశాలకు వచ్చిన సమయాల్లో తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రైతు వేదికలకు ఒకట్రెండు మండలాల్లో తలుపులు కూడా ఏర్పాటు చేయలేదు. మరికొన్ని రైతు వేదికలకు విద్యుత్‌ సౌకర్యం లేకపోవడంతో అధికారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కిటికిలకు ఇనుప గ్రీల్స్‌ లేకపోవడంతో వ్యవసాయాధికారుల సామగ్రికి రక్షణ కరువైంది. ఊరికి ఈ భవనాలు దూరంగా ఉండడంతో మందుబాబులకు అడ్డాగా మారిపోయింది. 


సౌకర్యాలు ఏర్పాటు చేయాలి : మంగ శ్రీనివాస్‌, గ్రాడ్యుయేట్స్‌ ఏఈవో సంఘం జిల్లా అధ్యక్షుడు, మహ-బాద్‌ 

జిల్లాలోని కొన్ని రైతు వేదికల్లో సౌకర్యాలు లేక అసంపూర్తిగా ఉన్నాయి. మరుగుదొడ్ల సౌకర్యం లేక ముఖ్యంగా మహిళా ఉద్యోగులు, మహిళా రైతులు ఇబ్బంది పడుతున్నారు. సమావేశం జరిగినప్పుడు తాగునీటి కోసం అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇచ్చే మెయింటి నెన్స్‌ చార్జీలు సరిపోవడం లేదు. చార్జీలను పెంచాలి, అటెండర్‌, వాచ్‌మెన్‌ను ఏర్పాటు చేయాలి.


Read more