ఆర్‌ఆర్‌ఆర్‌ సర్వే పనులు షురూ

ABN , First Publish Date - 2022-09-08T08:42:24+05:30 IST

రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) సర్వే పనులు ప్రారంభమయ్యాయి.

ఆర్‌ఆర్‌ఆర్‌ సర్వే పనులు షురూ


ఆర్డీవో పర్యవేక్షణలో ఐదు బృందాల ఏర్పాటు.. 

ఎంజాయ్‌మెంట్‌ సర్వే పూర్తయ్యాక రైతులతో భేటీలు

గజ్వేల్‌/జగదేవ్‌పూర్‌, సెప్టెంబరు 7: రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) సర్వే పనులు ప్రారంభమయ్యాయి. గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌ రెడ్డి పర్యవేక్షణలో డివిజన్‌ పరిధిలోని ఐదు మండలాల్లో అధికారులు సర్వే చేపట్టారు. సిద్దిపేట జిల్లా రాయపోల్‌ నుంచి జగదేవ్‌పూర్‌ మండలం వరకు ఐదు బృందాలుగా సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసాచారి నేతృత్వంలో సర్వే అధికారులు, సిబ్బంది ఎంజాయ్‌మెంట్‌ సర్వే చేపట్టారు. గజ్వేల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌, జగదేవ్‌పూర్‌ మండలం పీర్లపల్లి, వర్గల్‌ మండలం మైలారం, మర్కుక్‌ మండలం పాములపర్తి, రాయపోల్‌ మండలం బేగంపేటలో అధికారులు సర్వే నిర్వహించారు. మొదట హద్దులు ఏర్పాటు చేసి, ఏ రైతు భూమి నుంచి ఎంత వెళ్తుందో గుర్తించిన అనంతరం రైతుల సమాచారంతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసిన అధికారులు ఆ మేరకు ఎంజాయ్‌మెంట్‌ సర్వే ప్రారంభించారు. గజ్వేల్‌ మండలంలోని 5 గ్రామాల పరిధిలో 263.27 ఎకరాలు, వర్గల్‌ మండలంలోని 3 గ్రామాల పరిధిలో 154.18 ఎకరాలు, రాయపోల్‌ మండలంలోని 2 గ్రామాల పరిధిలో 77.36 ఎకరాలు, మర్కుక్‌  మండలంలోని 4 గ్రామాల పరిధిలో 209.01 ఎకరాలు, జగదేవ్‌పూర్‌ మండలంలోని 3 గ్రామాల పరిధిలో 258.32 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా, ధర నిర్ణయించకముందే హద్దు రాళ్లను ఏర్పాటు చేయడంపై పలు చోట్ల రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరెవరి భూమి పోతుందో గుర్తించి, ధర మాట్లాడతామని ఆర్డీవో చెప్పడంతో రైతులు సర్వేకు సహకరించారు. పది రోజుల్లో ఎంజాయ్‌మెంట్‌ సర్వే పూర్తి చేసి, నోటిఫికేషన్‌ను ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, రీజనల్‌ రింగ్‌ రోడ్డు సర్వే పనులను సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలోని పీర్లపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. సర్వే నంబర్‌ 191/1లో పార్ట్‌-బీ కింద 190 ఎకరాల భూమిని ఇవ్వాలంటే... పరిహారంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో భూసేకరణను అడ్డుకుంటామని గ్రామస్తులు తెలిపారు.

Updated Date - 2022-09-08T08:42:24+05:30 IST