వరి సాగులోతగ్గేదేలే..!

ABN , First Publish Date - 2022-09-08T09:58:08+05:30 IST

వరి సాగు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటల జోలికి పోకుండా.

వరి సాగులోతగ్గేదేలే..!

  • సర్కారు వద్దన్నా.. పంట వేస్తున్న రైతులు
  • యాసంగిలో వెనక్కి తగ్గినా.. వానాకాలంలో వరికే జై
  • ఈ సీజన్‌లో 62.13 లక్షల ఎకరాల్లో పంట
  • వానాకాలం వరికి మరో మూడు వారాల సమయం
  • ఆలోగా సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం
  • నీటిలభ్యత ఉండటంతో వరి సాగుకే రైతన్నల మొగ్గు
  • 50 లక్షల ఎకరాలు దాటని పత్తి, 
  • 5.58 లక్షల ఎకరాల్లోనే కంది పంట సాగు


హైదరాబాద్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): వరి సాగు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటల జోలికి పోకుండా.. వరి సాగుకే జై కొట్టారు. ధాన్యం సేకరణ సమస్యలు, ఈ విషయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను పట్టించుకోకుండా వరి సాగుకే మొగ్గుచూపారు. ఈ వానాకాలం సీజన్‌లో వరి సాగును 45 లక్షల ఎకరాలకు పరిమితం చేసి.. పత్తిని 70 లక్షల ఎకరాల్లో, కందిని 15 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినా.. రైతులు పట్టించుకోలేదు. పైగా.. ఈ సారి రికార్డు స్థాయిలో.. 62.13 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. గత ఏడాది 61.95 ఎకరాల్లో సాగైన వరి రికార్డును రైతన్నలు ఈ సంవత్సరం బద్ధలుకొట్టారు. వానాకాలం సీజన్‌కు మరో మూడు వారాలు మిగిలే ఉంది. ఇంకా కొన్ని చోట్ల నాట్లు పడుతున్నాయి. ఆలోగా.. ఈ రికార్డు మరింత పెరిగి.. 65 లక్షల ఎకరాలకు చేరుతుందనే అంచనాలున్నాయి. గడిచిన మూడేళ్లుగా రాష్ట్రంలో వర్షాకాలం ఆరంభంలోనే కుండపోతగా వానలు కురిశాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ వంటి కార్యక్రమాలతో చెరువులు అభివృద్ధికి నోచుకు ని, వాననీటిని ఒడిసిపట్టాయి. కుంటలు, ఇతర జలాశయాలూ జలకళను సంతరించుకున్నాయి. దీనికితోడు.. భూగర్భ జలా లు గణనీయంగా పెరిగాయి. నీటి లభ్యత సమృద్ధిగా ఉండటంతో.. రైతులు ఇతర పంటల వైపు మొగ్గుచూపలేదు. రాష్ట్రంలో వరి సాగు సాధారణ విస్తీర్ణం 42 లక్షల ఎకరాలుగా ప్రభుత్వం చెబుతోంది.


 గత ఏడాది వానాకాలం సీజన్‌లో ఈ సమయానికి 48.92 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. కానీ ఈ వానాకాలంలో సెప్టెంబరు నెల మొదటి వారానికే 62.13 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయటం గమనార్హం. గతేడాది వానాకాలంలో సాగైన మొత్తం వరి విస్తీర్ణం(61.95 లక్షల ఎకరాలు)తో పోలిస్తే ఈసారి 18వేల ఎకరాల్లో అదనంగా సాగైంది. వరి నాట్లు వేయటానికి మరో మూడు వారాలు సమయం ఉంది. దీంతో సుమారు 65 లక్షల ఎకరాల వరకు వరి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. రైతులు గత యాసంగిలో అతి తక్కువగా 35.84 లక్షల ఎకరాల్లోనే వరి వేశారు. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరి వేయొద్దని.. వరివేస్తే ఉరేనని చెప్పారు. దీంతో 20 లక్షల ఎకరాల్లో రైతులు నాట్లు వేయకుండా వదిలేశారు. ఆ తర్వాత ప్రభుత్వం కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేయడం, ధాన్యం సేకరించటం తో.. నష్టపోయామనే భావన నాటువేయని రైతుల్లో ఏర్పడింది. దీంతో ఈసారి ఎవరి మాటలు పట్టించుకోకుం డా.. వరి సాగు వైపే మొగ్గుచూపారు. రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు ఉండగా.. సగం విస్తీర్ణంలో రైతులు వరి పంటను వేయటం గమనార్హం.


ఉమ్మడి నల్లగొండ టాప్‌ 

వరి సాగు విస్తీర్ణంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అగ్రభాగంలో నిలిచింది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో కలిపి 11.95 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. రెండో స్థానంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఉంది. కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో 9.54 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారు. మూడో స్థానంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఉంది. వరంగల్‌, ములుగు, హనుమకొండ, జయశంకర్‌-భూపాలపల్లి, మహబూబాబాద్‌, జనగామ జిల్లాల్లో కలిపి 8.96 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా గత ఏడాదితో పోలిస్తే.. ఈ వానాకాలం సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం పెరిగింది.


పత్తి సాగంటే భయం భయం..!

రాష్ట్ర ప్రభుత్వం పత్తి సాగు విస్తీర్ణాన్ని 70 లక్షల ఎకరాలకు పెంచాలని మూడేళ్లుగా విశ్వప్రయత్నాలు చేస్తోంది. రైతులు మాత్రం అందుకు సాహసించడం లేదు. వరుసగా మూడేళ్లు పత్తి సాగు ప్రారంభ దశలోనే వర్షాలు దెబ్బకొట్టాయి. గులాబీ రంగు పురుగు, ఇతర చీడపీడల బెడద ఎక్కువగా ఉంది. దీంతో రైతులు పత్తి సాగు చేయాలంటే జంకుతున్నారు. ఈసారి కూడా అతికష్టం మీద 49.58 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేశారు. వచ్చే సంవత్సరం ఈ విస్తీర్ణం పెరిగే అవకాశంలేకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విత్తనాలు నాటే సమయం ఎప్పుడో దాటిపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం కంటే.. 20 లక్షల ఎకరాల్లో తక్కువగా రైతులు పత్తి సాగుచేశారు. కంది విస్తీర్ణం 15లక్షల ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం ప్రయత్నించినా.. రైతులు 5.58 లక్షల ఎకరాలకే పరిమితమయ్యారు. మొక్కజొన్న 6.15 లక్షల ఎకరాలు, సోయాబీన్‌ 4.30 లక్షల ఎకరాల్లో సాగైంది. 

Read more