రెవెన్యూ వర్సెస్ అటవీశాఖ
ABN , First Publish Date - 2022-10-11T09:55:34+05:30 IST
రెవెన్యూ, అటవీ శాఖల మధ్య రాష్ట్రంలో 6.67లక్షల ఎకరాల భూమి వివాదస్పదంగా మారింది.

- వివాదంలో 6.67లక్షల ఎకరాలు..
- ఈ భూమి మాదంటే మాదని వాదన
- సీఎం ఆదేశించినా కదలని సర్వే ఫైల్
హైదరాబాద్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ, అటవీ శాఖల మధ్య రాష్ట్రంలో 6.67లక్షల ఎకరాల భూమి వివాదస్పదంగా మారింది. ఈ భూమి మాదంటే మాదంటూ రెండు శాఖలు వాదిస్తున్నాయి. సమస్యను పరిష్కరించాలంటూ సీఎం కేసీఆర్ ఇరు శాఖల ఉన్నతాధికారులను ఆదేశించినప్పటికీ పరిష్కారం దిశగా అడుగులు ముందుకు పడటం లేదు. గతంలో గైరాన్ (పశువుల మేత) కోసం వదిలేసిన భూములు తమవే అంటూ అర్హులైన కొందరికి రెవెన్యూ శాఖ అసైన్డ్ పట్టాలు జారీచేసింది. అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో భూములు లేకపోయినా అసైన్డ్ పేరుతో అక్రమంగా 1.63 లక్షల ఎకరాలకు పట్టాలను పంపిణీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో సర్టిఫికెట్లు ఉన్నాయంటూ కొందరు ఈ భూములను సాగు చేస్తున్నారు. మరి కొందరు పట్టాల పేరుతో అటవీ భూములను ఆక్రమించారు. ఈ వివాదాన్ని సర్వే ప్రక్రియ ద్వారా తేల్చుకోవాల్సి ఉన్నప్పటికీ ఈ రెండు శాఖలు ముందుకు రావడం లేదు.
సాంకేతిక ఆధారాల్లేక
కొన్నిచోట్ల అటవీశాఖ భూమి ఆక్రమణకు గురైందని చెప్పేందుకు పూర్తి స్థాయిలో సాకేతికపరమైన ఆధారాలు లేవు. విలేజ్ మ్యాప్లు, రెవెన్యూ, అటవీశాఖ భూములకు సంబంధించిన సరిహద్దు మ్యాప్లు లేవు. ఏళ్ల కిందట తయారు చేసిన నక్ష, అప్పటి మ్యాప్లు కొన్ని చోట్లలో చినిగిపోయాయి. రెవెన్యూ రికార్డులు, ధరణి పోర్టల్లో అటవీశాఖకు సంబంధించిన భూమి అంటూ పేర్కొంటున్నా మ్యాపులు లేక ఏ భూమి ఎక్కడుందో తెలియని పరిస్థితి నెలకొంది.
సర్వేపై స్పందించని రెవెన్యూశాఖ
సంయుక్తంగా సర్వే కోసం కొన్ని జిల్లాల అటవీశాఖ అధికారులు నివేదికలు పంపినా రెవెన్యూ శాఖ స్పందించడం లేదని ఆయా జిల్లాల అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. కబ్జాదారులపై చర్యలు తీసుకునే ముందు.. ఏది సక్రమ పట్టా పత్రమో.. ఏది అక్రమ పట్టా పత్రమో తెలియక సతమతమవుతున్నాం అని చెబుతున్నారు. దీనిపై రెవెన్యూ శాఖ స్పష్టత ఇవ్వకపోవడంతో సమస్య, పరిష్కారం దిశగా ముందుకు కదలడం లేదని అంటున్నారు. అత్యధికంగా నాగర్కర్నూల్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, అదిలాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, వనపర్తి, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో అటవీశాఖకు సంబంధించిన వేల ఎకరాల అటవీ, రెవెన్యూ భూమి వివాదంలో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
కేసీఆర్ ఆదేశంతో సర్వేకు కసరత్తు
సీఎం కేసీఆర్ మార్చి 8న సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించేందుకు వనపర్తి జిల్లాకు వెళ్లారు. జిల్లా సమగ్ర వివరాలను పరిశీస్తున్న నేపథ్యంలో జిల్లా విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం కేవలం 5 శాతం మాత్రమే ఉందని గుర్తించారు. ఈ నేపథ్యంలో వనపర్తితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న జిల్లాల్లో మొదటి విడత కింద సర్వే చేపట్టాలని ఆదేశించారు. అటవీ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని, పచ్చదనాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే వనపర్తి జిల్లాలో అటవీ విస్తీర్ణం కేవలం 11,167 హెక్టార్లు ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఇందులో దాదాపు 2 వేల ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైనట్లు అధికారులు పేర్కొన్నారు. సీఎం ఆదేశాలతో అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సర్వేకోసం హడావుడి చేశారు. వివాదాస్పదంగా మారిన, ఆక్రమణకు గురైన భూమిని గుర్తించి చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. మొదటి విడతలో వనపర్తి జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న 17 గ్రామాల పరిధిలోని అటవీ, రెవెన్యూ భూములను సర్వే చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అంతలోనే ఏమైందో కానీ ఈ సర్వే ప్రక్రియ ఎక్కడికక్కడే ఆగిపోయింది. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అటవీ, రెవెన్యూ శాఖల నిర్వహించాల్సిన జాయింట్ సర్వే ప్రక్రియ ఇప్పటికీ పట్టాలెక్కలేదు.