చిప్పకూడు తిన్న చరిత్ర రేవంత్‌ది

ABN , First Publish Date - 2022-09-26T08:44:34+05:30 IST

తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌పై వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆదివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

చిప్పకూడు తిన్న చరిత్ర రేవంత్‌ది

ఆయన పిలక కేసీఆర్‌ చేతిలో ఉంది: వైఎస్‌ షర్మిల  

సంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబరు 25: తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆదివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్‌ ఓ బ్లాక్‌మెయిలర్‌ అని, దొంగ అని తీవ్ర పదజాలంతో దుమ్మెత్తిపోశారు. ఆమె ప్రజాప్రస్థాన యాత్ర ఆదివారం సాయంత్రానికి సంగారెడ్డికి చేరింది. ఈ సందర్భంగా పాత బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ‘‘దొంగ పనులు చేసి చిప్పకూడు తిన్న చరిత్ర రేవంత్‌ రెడ్డిది. ఓటుకు నోటు కేసులో దొంగ పని చేసినందుకే రేవంత్‌ చిప్పకూడు తిన్నాడు. రేవంత్‌ పిలక కేసీఆర్‌ చేతిలో ఉంది’’ అని షర్మిల వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రైతుల భూములు కాజేసేందుకుకే సీఎం కేసీఆర్‌ ధరణిని తీసుకొచ్చారని ఆరోపించారు. ‘‘మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేదు. మహిళల వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు పీకుతానన్న కేసీఆర్‌.. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో నడిరోడ్డుపై అత్యాచారం జరిగితే చర్యలెందుకు తీసుకోలేదు? సంగారెడ్డి కలెక్టర్‌ శరత్‌, కలెక్టరేట్‌లో గులాబీ కండువా వేసుకొని కూర్చున్నాడా? ఏ కోణంలో కేసీఆర్‌ ఆయనకు అభినవ అంబేడ్కర్‌లా కనిపించాడు?’’ అని షర్మిల ప్రశ్నించారు.

Read more