టీఎస్పీఎస్సీ ద్వారానే జేఎల్ పోస్టుల భర్తీ
ABN , First Publish Date - 2022-03-22T09:04:09+05:30 IST
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎ్సపీఎస్సీ) ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించినట్టు తెలిసింది. ఇంటర్మీడియట్ బోర్డులో..
1,392 జూనియర్ లెక్చరర్ల ఖాళీలు
మల్టీ జోన్-1లో 724, జోన్-2లో 668
343 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
మరో 40 లైబ్రేరియన్ పోస్టులు కూడా..
సర్కారుకు అధికారుల ప్రతిపాదనలు
హైదరాబాద్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎ్సపీఎస్సీ) ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించినట్టు తెలిసింది. ఇంటర్మీడియట్ బోర్డులో పెద్ద ఎత్తున జూనియర్ లెక్చర ర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల్లో కాంట్రాక్టు పద్ధతిలో కొంతమంది పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటనలో భాగంగా వీరందరినీ రెగ్యులరైజ్ చేయాల్సి ఉంది. ఇవి కాకుండా... మరో 1,393 జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. వీటితోపాటు ఇంటర్ బోర్డులో ఖాళీగా ఉన్న 91 ఫిజికల్ డైరెక్టర్లు, 343 జూనియర్ అసిస్టెంట్లు, 40 లైబ్రేరియన్ల పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ మొత్తం పోస్టులను టీఎ్సపీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు జేఎల్ పోస్టుల నోటిఫికేషన్ వెలువడలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2008లో నోటిఫికేషన్ జారీ చేశారు. అనేక అవాంతరాల తర్వాత ఈ పోస్టులను 2012లో భర్తీ చేశారు.
తెలంగాణ ప్రాంతంలో సుమారు 457 జేఎల్ పోస్టులను అప్పట్లో భర్తీ చేయగలిగారు. ఆ తర్వాత మళ్లీ జేఎల్ పోస్టుల భర్తీ జరగలేదు. ఈ నేపథ్యంలో జేఎల్ పోస్టుల కోసం ఈసారి అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీపడే అవకాశం ఉంది. తాజా ప్రతిపాదనల ప్రకారం... మల్టీ జోన్-1లో 724, మల్టీ జోన్-2లో 668 జేఎల్ పోస్టులు ఉన్నాయి. వీటిలో తెలుగు, ఇంగ్లీషు మీడియంతోపాటు ఉర్దూ, మరాఠీ మీడియం పోస్టులు కూడా ఉన్నాయి. అలాగే... ప్రధాన సబ్జెక్టులతోపాటు ఫ్రెంచ్, సంస్కృతం, అరబిక్, మరాఠీ వంటి లాంగ్వేజ్ పోస్టులు కూడా ఉన్నాయి. అధికారుల ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే... జేఎల్ పోస్టుల భర్తీకి ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసే అవకాశం ఉంది. అనంతరం భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది.