Nandamuri Kalyan Ram: హెల్త్ వర్సిటీ పేరు మార్చడం బాధ కలిగించింది: నందమూరి కల్యాణ్‌రామ్

ABN , First Publish Date - 2022-09-22T22:21:11+05:30 IST

హెల్త్ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ (NTR) పేరును మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టాలని సీఎం జగన్ (CM Jagan) నిర్ణయం తీసుకున్నారు.

Nandamuri Kalyan Ram: హెల్త్ వర్సిటీ పేరు మార్చడం బాధ కలిగించింది: నందమూరి కల్యాణ్‌రామ్

హైదరాబాద్: హెల్త్ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ (NTR) పేరును మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టాలని సీఎం జగన్ (CM Jagan) నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడువుగా అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. సహజంగానే ఈ నిర్ణయం పట్ల ఎన్టీఆర్, వైఎస్ఆర్ అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీలతో నిమిత్తం లేకుండా పలువురు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఎన్టీఆర్ కుటుంబం ఖండించింది. ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) కూడా హెల్త్ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని ఖండించారు. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఆయన మనవడు నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) స్పందించారు. హెల్త్ వర్సిటీ పేరు మార్చడం బాధ కలిగించిందని తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సరికాదని కల్యాణ్‌రామ్ తప్పుబట్టారు. 


జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చేయాలని వైసీపీ సర్కారు నిర్ణయించుకుంది. ఎన్టీఆర్‌ పేరు తీసేసి... ‘వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ’గా మార్చాలని అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. ఇందుకు వీలుగా యూనివర్సిటీ చట్టాన్ని సవరిస్తూ ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు పంపారు. మంగళవారం రాత్రి హడావుడిగా ఆన్‌లైన్‌లో మంత్రులకు ఈ సవరణలను పంపి, కేబినెట్‌ అనుమతి కూడా తీసేసుకున్నట్లు తెలిసింది. బుధవారం శాసనసభలో ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. దీనిని అసెంబ్లీ ఆమోదించింది. డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం కాస్తా, ‘డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం’గా మారింది. 


పేరు మార్పు అంత తేలిక కాదు

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు అంత తేలికైన విషయం కాదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విజయవాడకు చెందిన ప్రముఖ వైద్యు లు డాక్టర్‌ అమ్మన్న ఇదే విషయం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి గుర్తింపు ఉండడంతో కొత్త పేరుకు అంతర్జాతీయంగా గుర్తింపు రావాల్సి ఉంటుందన్నారు. పేరు మార్పుపై యూజీసీ, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) తదితర సంస్థలు కమిటీలను నియమించాల్సి ఉంటుందన్నారు. ఆ కమిటీ సభ్యులు కొత్త పేరును గుర్తించాల్సి ఉందని తెలిపారు. కొత్త పేరుతో వర్సిటీకి గుర్తింపు రావడానికి కనీసం నాలుగేళ్లు పడుతుందని చెప్పారు. ఆ గుర్తింపు రాకపోతే ఇక్కడ చదివిన విద్యార్థులు నీట్‌ రాయడానికి కానీ ఎయిమ్స్‌ లాంటి సంస్థలకు వెళ్లే అవకాశం కానీ ఉండదని తెలిపారు.

Updated Date - 2022-09-22T22:21:11+05:30 IST