BRS: ఎర్రకోటపై గులాబీ జెండా

ABN , First Publish Date - 2022-12-10T03:43:00+05:30 IST

మంచికోసం ఎక్కడ విప్లవాత్మక కార్యాచరణ అమలవుతుందో.. అక్కడే విజయం సాధిస్తామని, ఇది చరిత్ర నిరూపించిన సత్యమని సీఎం కేసీఆర్‌ అన్నారు.

BRS: ఎర్రకోటపై గులాబీ జెండా

దేశ పరివర్తన కోసమే భారత రాష్ట్ర సమితి

ప్రజలు అవకాశమిస్తే దేశవ్యాప్తంగా..

24 గంటలపాటు విద్యుత్తు అందిస్తాం

ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు.. ప్రజలు

దేశానికి కొత్త ఆర్థిక విధానం అవసరం

ఢిల్లీలో ఈ నెల 14న కార్యాలయ ప్రారంభం

కర్ణాటక ఎన్నికలతో బీఆర్‌ఎస్‌ ప్రస్థానం: సీఎం

జెండాను ఆవిష్కరించిన బీఆర్‌ఎస్‌ అధినేత

బీఆర్‌ఎస్‌ నినాదం.. అబ్‌కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌

దేశంలో ఎవరో ఒకరు చైతన్య దీపం వెలిగించకపోతే కారు చీకట్లు కొనసాగుతూనే ఉంటాయి. ఈ చీకట్లో వెలిగించిన చిరుదీపమే బీఆర్‌ఎస్‌. పాలనలో నియంతృత్వ ధోరణి పోయి ఫెడరల్‌ స్ఫూర్తి కొనసాగాలి. రాజకీయాలంటే ఎన్నికల్లో పార్టీలు గెలవడం కాదు.. గెలవాల్సింది ప్రజలే.

- బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): మంచికోసం ఎక్కడ విప్లవాత్మక కార్యాచరణ అమలవుతుందో.. అక్కడే విజయం సాధిస్తామని, ఇది చరిత్ర నిరూపించిన సత్యమని సీఎం కేసీఆర్‌ అన్నారు. అదే స్ఫూర్తితో వాస్తవాలను దేశ ప్రజల ముందుకు తీసుకుపోగలిగితే ఢిల్లీ ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు. దేశ సౌభాగ్యం కోసం వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతుల కోసం, వృత్తి కులాలు, సబ్బండ వర్గాల సౌభాగ్యం కోసం ‘‘అబ్‌ కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌’’ అనే నినాదంతో బీఆర్‌ఎస్‌ జాతీయ స్థాయిలో ముందుకు వెళ్తుందన్నారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ కార్యక్రమాన్ని శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించారు. పూజ అనంతరం మధ్యాహ్నం 1.20 గంటలకు బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారిక పత్రాలపై పార్టీ అధినేత కేసీఆర్‌ సంతకాలు చేశారు. దీంతో 21 ఏళ్ల క్రితం జలదృశ్యంలో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ప్రస్థానం తెలంగాణ భవన్‌లో ముగిసింది. టీఆర్‌ఎస్‌ కనుమరుగై.. దాని స్థానంలో బీఆర్‌ఎస్‌ ప్రస్థానం మొదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో పరివర్తన తీసుకురావాలన్న లక్ష్యంతోనే బీఆర్‌ఎస్‌ ఏర్పడిందని తెలిపారు. తెలంగాణ కీర్తి కిరీటాన్ని భరతమాత పాదాల ముందుంచి, దేశ ప్రతిష్ఠను ద్విగుణీకృతం చేసి, భరతమాత సంతృప్తి చెందేలా బీఆర్‌ఎ్‌సతో మన ప్రయాణం కొనసాగిద్దామని, ఈ వెలుగుదివ్వెను దేశం నలుమూలలా వ్యాపింపజేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశం ఉన్నతస్థాయి ఆర్థిక ప్రగతి సాధించేలా పార్టీ పనిచేస్తుందని, ఇప్పటి వరకూ పనిచేసినట్లే అంకితభావంతో ముందుకు వెళ్లాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే రీతిలో దేశంలో నూతన విధానాలను అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. భారత ప్రజలు అవకాశమిేస్త తెలంగాణ మాదిరిగా రెండేళ్లలోనే బీఆర్‌ఎస్‌ పార్టీ దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతం 24 గంటలపాటు కరెంటును అందించగలుగుతుందని తెలిపారు. ఏటా 25 లక్షల కుటుంబాలకు దళితబంధునూ అందిస్తామన్నారు.

చీకట్లో చిరుదీపం బీఆర్‌ఎస్‌..

ఉద్యమ సమయం నుంచి ఎన్నో విమర్శలను అధిగమించి ఇంతదూరం వచ్చామని కేసీఆర్‌ అన్నారు. ఈ దేశంలో ఎవరో ఒకరు చైతన్య దీపం వెలిగించకపోతే కారు చీకట్లు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. ఈ చీకట్లో వెలిగించిన చిరుదీపమే బీఆర్‌ఎస్‌ పార్టీ అని తెలిపారు. పాలనలో నియంతృత్వ ధోరణి పోయి ఫెడరల్‌ స్ఫూర్తి కొనసాగాలని, స్వయంపాలన విధానం అమలు కావాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజకీయాలంటే ఒక పార్టీ ఎన్నికల్లో గెలవడం, ఓడిపోవడం కాదని, గెలవాల్సింది ప్రజలేనని విశదీకరించారు. దేశంలో 40 కోట్ల ఎకరాల సాగు భూమి, 70 వేల టీఎంసీల నీటి వనరులు ఉండి కూడా ఆకలి ఇండెక్స్‌లో మనం ముందు వరుసలో ఉంటున్నామని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని రైతాంగం ఇంకెంత కాలం ధర్నాలు చేయాలని ప్రశ్నించారు. దేశం మొత్తం సమాన హక్కులతో పరిఢవిల్లాలని, జాతీయ స్థాయిలో వినూత్న ప్రగతి ఒరవడిని సృష్టించడానికి తమ పార్టీ కృషిచేస్తుందని ప్రకటించారు.

నూతన జాతీయ విధానాలు అవసరం..

కేంద్ర పాలకుల వైఫల్యాలను సరిదిద్దుతూ.. దేశ సమగ్రాభివృద్ధికి, ఆయా రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించేందుకు నూతన జాతీయ విధానాలు రావాలని కేసీఆర్‌ అన్నారు. నిర్లక్ష్యానికి గురవుతున్న వ్యవసాయ రంగం పురోగతికి నూతన వ్యవసాయ విధానం రావాలన్నారు. దిక్కుమాలిన ట్రైబ్యునల్స్‌ పేరుతో నీటి యద్ధాలను కొనసాగించే పరిస్థితికి స్వస్తి పలికేలా ఈ దేశానికి నూతన జలవనరులకు ప్రత్యేక విధానం కావాలన్నారు. ప్రతి పల్లెకూ విద్యుత్తు అందించేలా నూతన విద్యుత్తు పాలసీ, దేశం ఆర్థిక పురోగతి సాధించేందుకు నూతన ఆర్థిక విధానం, తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో దేశంలో నూతన పర్యావరణ పాలసీ అమలు కావాలన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం తెలంగాణ అమలు చేస్తున్న పథకాల స్ఫూర్తితో వారి అభ్యున్నతి కోసం నూతన విధానం రావాలని అభిలషించారు. జనాభాలో 50 శాతం ఉన్న మహిళలను దేశ ప్రగతిలో మరింత భాగస్వాములను చేసే దిశగా మహిళా సాధికారత విధానం తేవాలని పేర్కొన్నారు. విద్య, వైద్యం తదితర మౌలిక వసతుల అభివృద్ధికీ తెలంగాణ స్ఫూర్తితో వినూత్న ప్రగతి విధానాలను రూపొందించి బీఆర్‌ఎస్‌ పార్టీ దేశవ్యాప్తంగా అమలు చేస్తుందని ప్రకటించారు. కర్ణాటక ఎన్నికలతోనే బీఆర్‌ఎస్‌ ప్రస్థానం మొదలవుతుందని కేసీఆర్‌ పేర్కొన్నారు. జేడీఎ్‌సకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటామన్నారు. మరోసారి కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేద్దామని బీఆర్‌ఎస్‌ నేతలకు పిలుపునిచ్చారు.

పార్టీ విధి విధానాలపై కసరత్తు

బీఆర్‌ఎస్‌ విధివిధానాల రూపకల్పనకు కసరత్తు చేస్తున్నామని కేసీఆర్‌ వెల్లడించారు. ఇందుకు గాను రిటైర్డ్‌ జడ్జిలు, ప్రముఖ ఆర్థిక, సామాజికవేత్తలు, మేధావులతో ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 14న ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తామని, అదే రోజు నుంచి పార్టీ జాతీయ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. పార్టీ ముఖ్యులంతా 13వ తేదీ సాయంత్రానికి ఢిల్లీకి చేరుకోవాలని సూచించారు. మరో మూడు నెలల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఢిలీల్లో సొంత భవన నిర్మాణం పూర్తవుతుందని, ఆ తర్వాత పూర్తిస్థాయి కార్యకలాపాలు అక్కడి నుంచే ప్రారంభించుకోవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిసా, ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ రైతు సంఘాల నేతలకుధన్యవాదాలు తెలిపారు.

జలదృశ్యంలో ఆవిర్భవించి..

తెలంగాణ రాష్ట్రంలో అంతర్థానం

తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత రాష్ట్రసమితిగా మారడంతో 21 ఏళ్ల టీఆర్‌ఎస్‌ ప్రస్థానం ముగిసింది. 2001 ఏప్రిల్‌ 27న హైదరాబాద్‌లోని కొండాలక్ష్మణ్‌ బాపూజీ నివాసమైన జలదృశ్యంలో టీఆర్‌ఎస్‌ పురుడు పోసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణవాదం, ప్రత్యేక రాష్ట్ర సాధనే అజెండాగా ఉద్యమించిన టీఆర్‌ఎస్‌.. ఆ తరువాత పార్టీగా మారిఆ పేరుతోనే ఎన్నికల బరిలోకి దిగింది. 2009 ఎన్నికల తర్వాత ఒక దశలో పార్టీ తీవ్ర ఒడిదొడుకులకు లోనైంది. ఆ తర్వాత నాటి సీఎం రాజేశేఖర్‌రెడ్డి మరణంతో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అమరణ దీక్షకు దిగారు. దాంతో మళ్లీ తెలంగాణవాదానికి, టీఆర్‌ఎ్‌సకు కొత్త ఊపిరి వచ్చింది. అప్పటి నుంచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2009 నుంచి 2014 మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతంలో గులాబీ పార్టీ విస్తరించింది. 2014లో విభజన తర్వాత టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది. తిరిగి 2018లోనూ విజయం సాధించింది. ఇలా రెండుసార్లు టీఆర్‌ఎస్‌ పేరుతో కేసీఆర్‌ పాలనాపగ్గాలు చేపట్టారు. ఇంతకాలం రాష్ట్ర ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన టీఆర్‌ఎస్‌.. ఇక ఆ పేరుతో కనిపించదు..వినిపించదు.

పలువురి అభినందనలు..

దేశ రాజకీయాల్లో మార్పు కోసం తెలంగాణ సీఎం కేసీఆర్‌ నడుం కట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ అధ్యక్షుడు హెచ్‌.డి.కుమారస్వామి అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజయ్యారు. కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి, కేటీఆర్‌, హరీశ్‌ సహా అందరు రాష్ట్ర మంత్రులు, రాజ్యసభ, లోక్‌సభ పక్షనేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్‌రావుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ రైతు సంఘాల నాయకులు, హరియాణా నుంచి గుర్నామ్‌సింగ్‌ తదితరులు హాజరయ్యారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ కార్యక్రమం పూర్తయిన అనంతరం ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు.. కుటుంబ సభ్యులు హారతితో స్వాగతం పలికారు.

Updated Date - 2022-12-10T03:53:59+05:30 IST