పారిశ్రామిక వాడల్లో రియల్ ఎస్టేట్!

ABN , First Publish Date - 2022-09-24T07:46:31+05:30 IST

ఆర్థిక సంవత్సరంలో ఆర్నెల్లు గడిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొన్న ఆదాయం అంచనాలను అందుకోలేక పోయింది....

పారిశ్రామిక వాడల్లో రియల్ ఎస్టేట్!

లీజుదారులకు క్రమబద్ధీకరణకు ఓకే.. 

రాజధాని నడిబొడ్డున 6 లక్షల గజాల అమ్మకం

సర్కారుకు రూ.3000 కోట్ల ఆదాయం.. 

ఇబ్బందుల్లేకుండా ఇటీవలే చట్టానికి సవరణ

రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని భూముల అమ్మకం?

డిసెంబరు 15 లోపు దరఖాస్తుల ఆమోదం

ఆజామాబాద్‌కు ఇప్పటికే లైన్‌ క్లియర్‌

బాలానగర్‌, హఫీజ్‌పేటలకూ క్యాబినెట్‌ ఓకే


హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక సంవత్సరంలో ఆర్నెల్లు గడిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొన్న ఆదాయం అంచనాలను అందుకోలేక పోయింది. కేంద్రం నుంచి ఆశించిన మేర గ్రాంట్లు రావడం లేదు. అప్పులు తీసుకోనివ్వడం లేదు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయాన్ని పెంచుకొనే క్రమంలో ఆస్తుల ఫైర్‌సేల్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా పారిశ్రామిక వాడల్లో రియల్‌ ఎస్టేట్‌కు తెర తీసింది. ఇలాంటి భూములైతే హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతాయన్న ఉద్దేశంతో కసరత్తును ప్రారంభించింది. ఈ అమ్మకాలకు ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. పారిశ్రామిక వాడల్లో భూములను లీజుదారులకే క్రమబద్ధీకరించేందుకు అనుమతించే విధంగా పది రోజుల క్రితమే శాసనసభలో సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేయించుకుంది.


ఈ సందర్భంగా ఆజామాబాద్‌ భూముల్లో పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టించాలన్న విపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చింది. పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల కోసం కేటాయించిన భూములను నిర్దేశించిన లక్ష్యం కోసం వాడకపోతే వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర పరిశ్రమలమంత్రి పదేపదే వేదికల మీద చెప్పేవారు. ఆదాయ లక్ష్యాలను అందుకోవాల్సిన కఠిన పరిస్థితిని ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఆజామాబాద్‌, బాలానగర్‌, హఫీజ్‌పేట పారిశ్రామిక వాడల స్థలాలను లీజుదారుల పేరిటే క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఈ మూడు పారిశ్రామిక ప్రాంతాల్లోని దాదాపు 6 లక్షల చదరపు గజాల స్థలాలను లీజుదారులకు అప్పగించి, రూ.3000 కోట్లను సమకూర్చుకోవాలని భావిస్తోది. నవంబరు 1 నాటికి క్రమబద్ధీకరణకు ఎదురయ్యే సాంకేతిక ఆటంకాలన్నింటినీ తొలగించాలని అధికారులకు ఆదేశాలు అందాయి. డిసెంబరు 15 కల్లా లీజుదారుల దరఖాస్తులను ఆమోదించి, తర్వాతి 3 నెలల్లో చెల్లింపులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందున... అందులోని హామీలన్నింటినీ నెరవేర్చేందుకు భూముల అమ్మకాలపై దూకుడుగా వ్యవహరిస్తోంది. 


ఆగస్టు వరకు రూ.50 వేల కోట్లే

ఈ ఏడాది భారీ బడ్జెట్లో రూ.17,700 కోట్ల దళితబంధు లాంటి భారీ పథకాలు ఉన్నాయి. ఎన్నికల ముందు సంవత్సరం రావడంతో హామీలు నెరవేర్చాల్సిన ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అప్పుల రూపంలో రూ.53,970 కోట్లు, కేంద్ర గ్రాంట్ల కింద రూ.41,001 కోట్లు వస్తాయన్న భారీ ఆశలతో 2.56 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌కు సాహసించింది. అప్పులు రూ.42 వేల కోట్లకు పరిమితమయ్యాయి. గ్రాంట్లు ఆశించిన మేర వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. జీఎ్‌సటీ, సేల్స్‌ ట్యాక్స్‌, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, రాష్ట్ర ఎక్సైజ్‌ సుంకాలు, మోటారు వాహన పన్నులు, కేంద్ర గ్రాంట్లు, పన్నేతర రాబడులన్నీ కలిపి రూ.1.93లక్షల కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తే ఐదు నెలల్లో రూ.50 వేల కోట్లు సమకూరాయి. రూ.20వేల కోట్ల అప్పులు కలిపి, ప్రభుత్వానికి రూ.70వేల కోట్లు అందాయి. ఆరు నెలలు గడిచిపోతున్నా... రూ.70 వేల కోట్లకే రాబడులు పరిమితం కావడంతో ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. 


అందుకే ప్రత్యామ్నాయ రాబడులపై స్పీడు పెంచింది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ఆర్థిక వనరుల సమీకరణపై సమీక్షించింది. తక్కువ కాలంలో నిధులు సమకూరాలంటే హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయే భూములపై దృష్టి సారించాలని అధికారులను కమిటీ ఆదేశించింది. అందులో భాగంగానే పారిశ్రామిక వాడల భూముల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధమైంది. ఆజామాబాద్‌, బాలానగర్‌, హఫీజ్‌పేట పారిశ్రామికవాడల్లో 6లక్షల చదరపు గజాల స్థలాన్ని క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3 ప్రాంతాల్లో 355 పారిశ్రామిక యూనిట్లు ఉన్నాయి. వీటిలో 84 యూనిట్లలో ఒరిజనల్‌ లీజుదారుల చేతిలో 3.98 లక్షల చదరపు గజాల స్థలం ఉంది. 


మరో రెండు లక్షల గజాలు సబ్‌ లీజుదారుల ఆధీనంలో ఉంది. ఒరిజినల్‌ లీజుదారులకు వంద శాతం, సబ్‌లీజుదారులకు 200 శాతం రిజిస్ట్రేషన్‌ విలువతో క్రమబద్ధీకరించనున్నారు. తద్వారా రూ.3000 కోట్లు ప్రభుత్వానికి సమకూరుతాయని అంచనా. ఆజామాబాద్‌ భూముల అమ్మకానికి గతంలోనే నిర్ణయం తీసుకోగా చట్టపర ఇబ్బందులు తలెత్తాయి. ఇటీవల అసెంబ్లీలో చట్ట సవరణతో ఆ ఆటంకం తొలిగిపోయింది. బాలానగర్‌, ఫతేనగర్‌ భూముల క్రమబద్ధీకరణలోనూ ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం సానుకూల నిర్ణయం తీసుకుంది. దీంతో క్రమబద్ధీకరణ వేగం పెంచారు. 

Read more