కంటి వెలుగుపై విస్తృత ప్రచారం

ABN , First Publish Date - 2022-12-06T23:45:58+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో ప్రారంభించనున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ నిఖిల అన్నారు.

 కంటి వెలుగుపై విస్తృత ప్రచారం
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌రావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్‌ నుంచి హాజరైన జిల్లా కలెక్టర్‌ నిఖిల,

వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్‌రావుకు వివరించిన వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్లు నిఖిల, హరీష్‌

వికారాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఽరాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో ప్రారంభించనున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ నిఖిల అన్నారు. కంటి వెలుగు కార్యక్రమంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌రావు మంగళవారం జగిత్యాల కలెక్టరేట్‌ నుంచి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ శ్వేతా మహంతి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావుతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు ఆమె జిల్లా కలెక్టరేట్‌ నుంచి హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేసేందుకు జిల్లాలో కొనసాగుతున్న ఏర్పాట్ల గురించి ఆమె మంత్రికి వివరించారు. జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం పకడ్బందీగా కొనసాగేలా కార్యాచరణ రూపొందించామని, ప్రజాప్రతినిధులతో సహా అందరి భాగస్వామ్యంతో విజయవంతమయ్యేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజలు సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో అశోక్‌కుమార్‌, డీఎంహెచ్‌వో పల్వన్‌కుమార్‌, డీపీవో తరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

విజయవంతం చేయాలి: మేడ్చల్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌

మేడ్చల్‌ అర్బన్‌: రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయంతం చేసేలా అధికారులు పనిచేయాలని మేడ్చల్‌-మల్కాజిగిరి ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎస్‌. హరీష్‌ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి మంత్రి హరీ్‌షరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివా్‌సతో కలిసి కలెక్టరేట్‌లో వైద్యఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 జనవరి 18 నుంచి కంటి వెలుగు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 27,75,067 మందికి కంటి పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. 75 బృందాలతో క్యాంపులు చేపడతారని, పట్టణాలు, గ్రామీణ పాంతాల్లో అందరికీ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి కె. ఆనంద్‌, జిల్లా మాస్‌ మీడియా అధికారి వేణుగోపాల్‌రెడ్డి, డీఎంపీవో మంజుల తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-06T23:45:59+05:30 IST