ప్రైవేట్‌ ఆస్పత్రులపై కొరడా!

ABN , First Publish Date - 2022-10-01T05:29:53+05:30 IST

కొంతకాలంగా రంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్‌ ఆసుపత్రులపై

ప్రైవేట్‌ ఆస్పత్రులపై కొరడా!

  • జిల్లాలో కొనసాగుతున్న వైద్యశాఖ అధికారుల తనిఖీలు
  • నిబంధనలకు విరుద్ధంగా ఉన్న క్లినిక్‌లపై చర్యలు
  • ఇప్పటికే పలు ఆస్పత్రుల సీజ్‌
  • కొన్నింటికి నోటీసులు జారీ


రంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబరు 30 : కొంతకాలంగా రంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్‌ ఆసుపత్రులపై అధికార యంత్రాంగం ప్రత్యేక నిఘా పెట్టింది. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సౌకర్యాలు, వాటి పనితీరుపై అధికారులు ఆరా తీస్తున్నారు. అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరు రోజులుగా 12 ప్రత్యేక బృందాలు ఆసుపత్రులను తనిఖీ చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆసుపత్రులకు నోటీసులు జారీ చేస్తున్నారు. జిల్లాలో వేలసంఖ్యలో నర్సింగ్‌హోమ్‌లు, ప్రైవేట్‌ క్లినిక్‌లు, డయోగ్నొస్టిక్‌ సెంటర్లు, ల్యాబ్‌లున్నాయి. వీటిలో కొన్నింటికి పూర్తిస్థాయి రిజిస్ర్టేషన్‌ ఉండగా.. మరికొన్నింటికి రిజిస్ర్టేషన్‌ సమయం ముగియడంతో రెన్యూవల్‌ చేశారు. మరికొన్ని తాత్కాలికంగా అనుమతులిచ్చారు. జిల్లాలో అనుమతులు ఇచ్చిన ఆసుపత్రులు, ల్యాబ్‌లో కనీస వసతులను కల్పించడంతోపాటు శిక్షణ పొందిన సిబ్బంది ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు. అనుమతులున్న వాటికే వైద్య సేవలు అందించాలని రిజిస్ర్టేషన్‌ సమయంలోనే ఆయా ఆసుపత్రులకు నిబంధనలను వివరించారు. జిల్లాలోని ప్రైవేట్‌ నర్సింగ్‌హోమ్స్‌ అనుమతులు కొన్నిరకాల వైద్య సేవలకే తీసుకుంటున్నా.. స్పెషలిస్ట్‌ వైద్యులు లేకున్నా.. పలురకాల సేవలను అందిస్తున్నారు. ల్యాబ్‌ నిర్వహణ సక్రమంగా లేకున్నా.. బయట నుంచి టెక్నిషియన్లను పిలిపిస్తూ పరీక్షలు అందిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఈనెల 22వ తేది నుంచి 29వ తేది వరకు 356 ప్రైవేట్‌ ఆసుపత్రులను తనిఖీ చేశారు. అందులో 71 ఆసుపత్రులకు షోకాజు నోటీసులను జారీ చేశారు. ఓ ఆస్పత్రికి జరిమానా విధించగా 18 ఆసుపత్రులను సీజ్‌ చేశారు. లోపాలు గుర్తించిన రిజిష్టర్డ్‌ ఆసుపత్రులకు కూడా నోటీసులు జారీ చేశారు. వారం రోజుల గడువులోగా లోపాలను సరిచేసుకోకపోతే ఆ ఆసుపత్రులపై చర్యలు తీసుకోనున్నారు. 


మరో వారం, పది రోజులు తనిఖీలు

రంగారెడ్డి జిల్లా పెద్దది.. ఎక్కువగా క్లినిక్‌లు, ల్యాబ్‌లు, నర్సింగ్‌హోంలు ఉన్నాయి. తనిఖీలు ముమ్మరం చేశాము. మరో వారం పది రోజులపాటు ప్రైవేట్‌ ఆసుపత్రులపై తనిఖీలు నిర్వహిస్తాము. ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు. ఇప్పటి వరకు నోటీసులు అందుకున్న ఆసుపత్రుల యాజమాన్యాలు వారంలోగా సరిచేసుకోవాలి. లేదంటే ఆసుపత్రులను సీజ్‌ చేయాల్సి ఉంటుంది. 

- డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, జిల్లా వైద్యాధికారి

Read more