రెండో విడత ఎప్పుడో?

ABN , First Publish Date - 2022-09-26T05:05:42+05:30 IST

కులవృత్తులను ప్రోత్సహించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం

రెండో విడత ఎప్పుడో?

  • జిల్లాలో నిలిచిన గొర్రెల పంపిణీ
  • ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగని ప్రక్రియ
  • ఎదురుచూస్తున్న లబ్ధిదారులు
  • రెండో విడతలో 21,037 యూనిట్లు లక్ష్యం
  • పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు 


కులవృత్తులను ప్రోత్సహించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంపై నీటినీడలు అలుముకున్నాయి. ఆర్థికంగా ఆసరా లభిస్తుందని రాయితీ గొర్రెల పథకానికి లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. వడ్డీకి అప్పులు తెచ్చి గొర్రెల కోసం డీడీలు తీశారు. ఏళ్లు గడుస్తున్నా గొర్రెల పంపిణీ మాత్రం జరగడం లేదు. ఎప్పుడు ఇస్తారో తెలియక అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మొదటివిడతలో మిగిలిపోయిన లబ్ధిదారులకే ఇప్పటివరకు గొర్రెలు అందలేదు. ఇక రెండో విడత పంపిణీ ఉంటుందా లేదా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి. అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబరు 25) : గొల్ల కుర్మలకు ఆర్థికంగా చేయూతనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం లబ్ధిదారులు నిరీక్షిస్తున్నారు. గొర్రెల ఉత్పత్తిని పెంచి విదేశాలకు మాంసం ఎగుమతి చేయాలనే ఉద్దేశంతోపాటు గొర్రెల పెంపకందారులు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికిగాను ప్రభుత్వం 2017-18లో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. హుజూరాబాద్‌ ఎన్నికల సమయంలో గొర్రెల పంపిణీపై హడావిడి చేసిన సర్కార్‌.. తర్వాత దాని ఊసే ఎత్తడం లేదని గొర్ల కాపరులు ఆరోపిస్తున్నారు. మొదటి విడతలో (2017-18 ఆర్థిక సంవత్సరంలో) 20,927 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉండగా.. 11,312 యూనిట్లు 75 శాతం సబ్సిడీతో పంపిణీ చేశారు. దీనికోసం రూ.125 కోట్లు ఖర్చు పెట్టారు. 9,615యూనిట్లు పంపిణీ చేయలేదు. గొర్రెలకు బదులు గేదెలు ఇవ్వాలని లబ్ధిదారులు కలెక్టర్‌కు రాతపూర్వకంగా రాసిచ్చారు. రెండో విడతలో ఇవ్వాల్సిన గొర్రెలను రేపూమాపు అంటూ ఊరిస్తున్నారు. 


పెరిగిన గొర్రెల ధరలు

ఒకేసారి పెద్ద మొత్తంలో గొర్రెలను తీసుకు వస్తుండటంతో అక్కడ గొర్రెలకు డిమాండ్‌ పెరిగింది. దీనికితోడు డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరగడంతో గొర్రెల ధరలు కూడా పెంచేశారు. అలాగే అధికారులు ప్రభు త్వం నిర్ణయించిన లబ్ధిదారులకు వచ్చిన యూనిట్లు మాత్రమే అందివ్వాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో ఇలాంటి ఇబ్బందులు దృష్య్టా పలుమార్లు గొర్రెల పంపిణీ వాయిదా పడింది. దీనికి తోడు కరోనా కష్టకాలం రావడంతో ప్రభుత్వం సబ్సిడీ భరించడం కష్టంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం ప్రవేశ పెట్టినప్పుడు గొర్రెల కాస్ట్‌ తక్కువగా ఉండేది. రోజురోజుకూ పెరిగి పోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా నిత్యావసర ధరలతో పాటు గొర్రెల ధరలు కూడా పెరిగి పోతున్నాయి. 

ప్రస్తుతం మార్కెట్‌లో గొర్రెల ధర పెరిగి పోవడంతో ఈ ఎఫెక్ట్‌ గొర్రెల పంపిణీ పథకంపై పడింది. లబ్ధిదారుల నుంచి డీడీలు  తీసుకునేందుకు అధికారులు ఇబ్బంది పడుతున్నారు. గొర్రెల పంపిణీ పథకం ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసే ఒక్కో యూనిట్‌లో 20గొర్రెలు, ఒక విత్తన పొట్టేలు ఉం టుంది. అయితే.. ప్రభుత్వం ఒక గొర్రెకు రూ.5,200 చెల్లిస్తుంది. ఈ ధరకు ఇతర జిల్లాలో గొర్రె రావడం లేదు. అలాగే విత్తన పొట్టేలుకు రూ.7వేలు చెల్లిస్తుంది. ప్రభుత్వం చెల్లించే ఈ ధరకు విత్తన పొట్టేలు రావడం లేదు. ఈ సారి రైతులు చెల్లించే 25శాతం (రూ.31,250) పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. మొదటి విడత గొర్రెల పంపిణీని అధికారులు పూర్తిచేసినప్పటికీ రెండోవిడత పంపిణీకి మాత్రం ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. 


చనిపోయిన స్థానంలో గొర్రెలు

మొదటి విడతలో పంపిణీ చేసిన గొర్రెల్లో ఇప్పటివరకు 2,956 గొర్రెలు చనిపోగా.. వాటి స్థానంలో ఇన్సూరెన్స్‌ వారి ద్వారా విడుదలైన రూ. 1,56,08,800తో 2,709 గొర్రెలను పంపిణీ చేశారు. గొర్రెలకు దాన కూడ పంపిణీ చేశారు. 


గొర్రెలకు బదులు గేదెలు కావాలి

మొదటి విడతలో 20,927 యూనిట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 11,312 యూనిట్లను పంపిణీ చేశారు. మిగతా 9,615 యూనిట్లు పంపిణీ చేయలేదు. డీడీలు చెల్లించిన లబ్ధిదారులందరూ.. గొర్రెలు మాకొద్దంటూ జిల్లా కలెక్టర్‌కు రాతపూర్వకంగా రాసి ఇచ్చారు. తిరిగి డీడీలను వాపస్‌ తీసుకున్నారు. అర్బన్‌ నియోజకవర్గాలకి చెందిన లబ్ధిదారులు గొర్రెలను తీసుకునేందుకు అయిష్టత చూపారు. గొర్రెలకు బదులుగా గేదెలను అందించాలని కలెక్టర్‌ను కోరారు. 


రెండో విడత లక్ష్యం 21,037 యూనిట్లు

జిల్లాలో గొల్ల కురుమ కుటుంబాలను పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి మొదటి విడతలోనే దరఖాస్తులు స్వీకరించారు. వారికి నూతన సంఘాలను రిజిస్ర్టేషన్‌ చేయించారు. అన్ని మండలాల్లో గ్రామసభలు జరిపి లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. తొలి విడత పంపిణీలో ఇంకా మిగిలిపోయిన వారంతా గొర్రెల కోసం ఎదురుచూస్తున్నారు. రెండో విడత లక్ష్యం 21,037 యూనిట్లు కాగా.. ఇవి ఎప్పుడు పంపిణీ చేస్తారో ఇక వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానికంగా ఉండే వెటర్నరి ఆసుపత్రుల చుట్టూ తిరిగుతున్నా లబ్ధిదారులకు నిరాశే ఎదురవుతోంది. 


దసరా తర్వాత రెండో విడత పంపిణీ

దసరా పండగ తర్వాత రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ప్రస్తుతం రెండో విడతకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను కంప్యూటర్‌లో పొందుపర్చుతున్నాము. డీడీలు చెల్లించిన వారందరికీ రెండో విడతలో గొర్రెల యూనిట్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము. మొదటి విడతలో లబ్ధిదారులందరికీ గొర్రెలను పంపిణీ చేయడం జరిగింది.

అంజలప్ప, జిల్లా పశువైద్యాధికారి 


గొర్రెలకు బదులుగా నగదు బదిలీ చేయాలి.

లబ్ధిదారులకు గొర్రెలకు బదులుగా నగదు బదిలీ చేయాలి. ప్రభుత్వం నగదు బదిలీ చేస్తే లబ్ధిదారులే గొర్రెలను కొనుక్కుంటారు. ప్రభుత్వం ఇస్తున్న గొర్రెల పంపిణీలో అవినీతి చోటు చేసుకుంటుంది. దీంతో లబ్ధిదారులకు నష్టం జరుగుతుంది. బ్యాంకులో నగదును జమ చేయాలి. 

- రావుల జంగయ్య, గొర్రెలు మేకలు పెంపక దారుల సంఘం జిల్లా అధ్యక్షుడు 


గొర్రెల పంపిణీ వివరాలు

సొసైటీలు : 368

సభ్యులు : 41,964

మొదటి విడత లక్ష్యం : 20,927

పంపిణీ చేసిన యూనిట్లు : 11,312

ఖర్చు చేసింది : రూ.125 కోట్లు

రెండో విడత లక్ష్యం 21,037

పంపిణీ చేసింది : శూన్యం 

Read more