కొనుగోళ్లు ఇంకెప్పుడు?

ABN , First Publish Date - 2022-11-18T23:17:54+05:30 IST

రైతులు సాగు చేసిన పత్తి పంట చేతికొచ్చింది. పత్తి తీత పనులు కూడా మొదలయ్యాయి. కానీ జిల్లాలో ఇప్పటివరకు పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు.

కొనుగోళ్లు ఇంకెప్పుడు?
చేవెళ్ల : హస్తేపూర్‌లో పత్తి పంట

జిల్లాలో ప్రారంభం కాని సీసీఐ పత్తి కేంద్రాలు

ప్రైవేట్‌ వైపు మొగ్గు చూపుతున్న పత్తి రైతులు

పత్తి తీతకు కూలీల కొరత

రైతులు సాగు చేసిన పత్తి పంట చేతికొచ్చింది. పత్తి తీత పనులు కూడా మొదలయ్యాయి. కానీ జిల్లాలో ఇప్పటివరకు పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. సీసీఐ ద్వారా మద్దతు ధర చెల్లించి పత్తి కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం.. ఇప్పటివరకు దాని గురించి పట్టించుకోవడం లేదు. దీంతో చేసేదీమీ లేక రైతులు ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్‌లో కూడా మద్దతు ధర బాగానే వస్తుండటంతో పత్తిని వారికే అమ్ముకుంటున్నారు.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, నవంబరు 17) : సీజన్‌ ఆరంభం నుంచే పత్తి కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిస్తామని చెప్పిన పాలకుల మాటలు ఆచరణకు నోచుకోవడం లేదు. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)ను రంగంలోకి దింపుతామని చెప్పి.. ఇంతవరకు దాని ఊసే ఎత్తడం లేదని రైతులు అంటున్నారు. జిల్లాలో పత్తి తీత పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. వానాకాలం సీజన్‌లో ప్రారంభంలో సాగు చేసిన పత్తి పంట చేతికొచ్చింది. దీంతో రైతులు, కూలీలు పత్తి తీసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పత్తి తీసిన రైతులు కొందరు ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. సీసీఐ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసే పత్తి కొనుగోలు కేంద్రాల కంటే.. ప్రైవేట్‌ వ్యాపారస్తులు క్వింటా పత్తికి మద్దతు ధర రూ.9 వేలు చెల్లిస్తున్నారని రైతులు చెబుతున్నారు. పత్తి చేను వద్దకే వచ్చి వ్యాపారులు పత్తిని కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. దీంతో రైతులంతా ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో 17 జిన్నింగ్‌ మిల్లులను గుర్తించగా అందులో 3 జిన్నింగ్‌ మిల్లులకు లైసెన్సులు లేవు. దీంతో మిగతా 14 జిన్నింగ్‌ మిల్లుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ.. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) చెల్లిస్తున్న మద్దతు ధర చాలాతక్కువగా ఉండటంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. సీసీఐ క్వింటా పత్తికి మద్దతు ధర రూ.6,380 చెల్లిస్తుండటంతో రైతులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే.. ప్రైవేట్‌గానే పత్తికి ఎక్కువ ధర ఉండటంతో.. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపించడం లేవు.

పత్తి తీతకు కూలీల కొరత

పత్తి రైతులను కూలీల కొరత వేధిస్తుంది. చేతికొచ్చిన పంటను తీసే సమయంలో కూలీలు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. అడిగినంత కూలి చెల్లిస్తూ, ఇతర గ్రామాల నుంచి కూలీలను తీసుకువస్తున్నారు. ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో 1,35,193 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. గులాబీ రంగు పురుగుతో, ఇటీవల కురిసిన వర్షాలకు కొంత పంట దెబ్బతినగా, మిగిలిన పత్తిని తీసేందుకు రైతులు కూలీల కొరతతో కష్టాలు పడుతున్నారు. ఒకరిద్దరు దొరికినా ఒక్కో కూలీకి రోజుకు రూ.400 ఆపైనా ఇవ్వాల్సి వస్తుందని వాపోతున్నారు. మరికొందరు కూలీలు కిలో లెక్కన పత్తితీతకు డబ్బులు అడుగుతుండటంతో పంటపై వచ్చే లాభం కన్నా కూలీలకే ఎక్కువ పోతుందని రైతులు వాపోతున్నారు.

కిలోకు రూ.10 కూలి

కూలీలు కూడా రోజుకు ఇంత అని కాకుండా కిలో పత్తి తీసేందుకు రూ.10 ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అందుకు రైతులు కూడా అంగీకరించక తప్పడం లేదు. ఒక ఎకరం పొలంలో పత్తి తీసేందుకు 12 మంది కూలీలు అవసరమవుతున్నారు. అంతమంది కూలీలు దొరక్క రైతులు కుటుంబ సభ్యులతోపాటు దగ్గర ఊర్లలో ఉండే బంధువులను పిలిపించుకుని పని పూర్తి చేసుకుంటున్నారు.

కిలోకు 10 రూపాయలు ఇస్తున్నాను

కిలో పత్తికి రూ. 10 కూలి ఇచ్చి పత్తి తీయిస్తున్నాను. కూలీలు దొరకడం లేదు. ప్రస్తుతం వారికి డిమాండ్‌ పెరిగింది. రెండెకరాల్లో పత్తి సాగు చేశాను. రోజూ నలుగురు కూలీలను పెట్టి పత్తి తీయిస్తున్నాను. ప్రతీ ఏటా పత్తి సీజన్‌లో కూలీలు దొరకడం లేదు.

- శ్రీనివాస్‌, చేవెళ్ల

ప్రైవేట్‌గా ధర బాగుంది

ఈసారి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే.. బయట మార్కెట్‌లో ప్రైవేట్‌గా క్వింటాలు మద్దతు ధర ప్రస్తుతం రూ.9 వేలు పలుకుతుంది. ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పత్తి తీత పనులు చివరి దశలో ఉన్నాయి. పత్తిని ప్రైవేట్‌కే అమ్ముకుంటా.

- సాయిరెడ్డి, పత్తి రైతు, ఇబ్రహీంపల్లి

పత్తి సాగు, ఉత్పత్తి అంచనా,

మద్దతు ధర వివరాలు

సాగు చేసిన పత్తి : 1,35,193 ఎకరాలు

ఉత్పత్తి అంచనా : 1,08,145 క్వింటాళ్లు

మద్దతు ధర.. (క్వింటాకు)

సీసీఐ : రూ. 6,380

ప్రైవేట్‌ : రూ.9,000

Updated Date - 2022-11-18T23:17:55+05:30 IST