కదలికేది?

ABN , First Publish Date - 2022-09-27T04:34:01+05:30 IST

తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి కొండలు పర్యాటకాభివృద్ధికి నోచుకోవడం లేదు. అనంతగిరి కొండలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న జిల్లా ప్రజల డిమాండ్‌ కార్యరూపం దాల్చడం లేదు.

కదలికేది?
అనంతగిరి కొండల అందాలు ఆస్వాదిస్తున్న సందర్శకులు

  • అనంతగిరి పర్యాటకమయ్యేనా!
  • జాడలేని ఎకో టూరిజం... బటర్‌ఫ్లై పార్కు
  • టెంపుల్‌ టూరిజం, వెల్‌నెస్‌ టూరిజం, అడ్వంచర్‌ టూరిజం వట్టిదేనా?
  • సీఎం కేసీఆర్‌ ఆదేశించినా.. ముందుకు కదలని ప్రక్రియ
  • ప్రకటనలకే పరిమితమైన అమాత్యుల హామీలు
  • అనంతగిరి పర్యాటకాభివృద్ధిలో కనిపించని ముందడుగు
  •  నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం

 తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి కొండలు పర్యాటకాభివృద్ధికి నోచుకోవడం లేదు. అనంతగిరి కొండలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న జిల్లా ప్రజల డిమాండ్‌ కార్యరూపం దాల్చడం లేదు. పర్యాటక రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం అనంతగిరి కొండలను అభివృద్ధి పరిచే అంశంపై ఇంకా దృష్టి సారించకపోవడం శోచనీయం. ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్రజ్యోతి  ప్రత్యేక కథనం

వికారాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :అనంతగిరి కొండలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రెండు దశాబ్దాలుగా పాలకులు ఇస్తున్న హామీలు కార్యరూపం దాల్చడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా.. అనంతగిరి ముఖచిత్రం మాత్రం మారలేదు. పర్యాటక అభివృద్ధి పేరిట కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అనంతగిరి కొండల్లో హరిత వ్యాలీ వ్యూ రిసార్ట్స్‌ నిర్మాణం చేపట్టారు. సందర్శకుల కోసం కాటేజీలు, స్విమ్మింగ్‌ ఫూల్‌ కూడా నిర్మించారు. ఈ పనులు చేపట్టి 15 ఏళ్లు గడిచిపోయినా అనంతగిరి కొండలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులకు ఇంత వరకు ముందడుగు పడకపోవడం గమనార్హం. తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి కొండలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరుస్తామంటూ కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత అనంతగిరిని తెలంగాణలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్న కేసీఆర్‌ హామీ ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌ పలుమార్లు సంబంఽధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించి  అభివృద్ధి పరచాలని ఆదేశించారు. అయినా అనంతగిరి పర్యాటకాభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. 

జంగిల్‌ రిసార్ట్ప్‌, ఎడ్వంచర్‌ టూరిజానికి అనుకూలం...

సుప్రసిద్ధ పర్యాటక కేంద్రాలుగా ఖ్యాతిగాంచిన సింగపూర్‌, మలేషియా దేశాల్లో మాదిరిగా అనంతగిరి కొండల్లో ప్రతిపాదించిన జంగిల్‌ రిసార్ట్స్‌ ఇంకా కార్యరూపం దాల్చలేదు. అటవీ, పర్యాటక శాఖల మధ్య నెలకొన్న స్థల వివాదంతో ఆ పనులు 2011లో ఆర్ధాంతరంగా నిలిచిపోయాయి. బటర్‌ ఫ్లై పార్క్‌ కూడా ప్రతిపాదనలకే పరిమితమైంది. అనంతగిరి అటవీ ప్రాంతంలో 1,654 హెక్టార్లలో అపారమైన ప్రకృతి సంపద, ఔషధ మొక్కలు ఉన్నాయి. వివిధ వన్యప్రాణులు, వందల రకాల పక్షులు, రకరకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. వన్యప్రాణుల సంరక్షణతో పాటు ఇక్కడకు వచ్చే పర్యాటకులకు ఆహ్లాదం పంచేందుకు జంగిల్‌ రిసార్ట్స్‌తో పాటు ఎడ్వంచర్‌ టూరిజం అభివృద్ధి పరిస్తే పర్యాటకుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. 

ప్రకటనలకే పరిమితమైన అమాత్రుల హామీలు... 

రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అనంతగిరి కొండలను జిందాల్‌ తరహాలో అభివృద్ధి పరుస్తామని ప్రకటించి మూడేళ్లు కావస్తున్నా ఆ ప్రక్రియ కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది. 2019, నవంబరు 13న ఆయన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌లతో కలిసి అనంతగిరి కొండలను సందర్శించారు.  అనంతపద్మనాభస్వామి, బుగ్గ రామలింగేశ్వర దేవాలయాలను అభివృద్ధి చేయడంతో పాటు జిందాల్‌ తరహా టూరిజం, విశాఖపట్నం మాదిరిగా వెల్‌నెస్‌ సెంటర్‌గా అభివృద్ధి చేస్తామంటూ మంత్రి అప్పట్లో ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి అడుగులు  పడలేదు.  అనంతగిరి కొండలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. అనంతగిరి కొండలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్‌ పలుమార్లు హామీ ఇచ్చారని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామన్నారు. కేటీఆర్‌ సలహా ప్రకారం అనంతగిరి కొండలతో పాటు కోట్‌పల్లి, సర్పన్‌పల్లి ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి పరిచేందుకు రూ.200 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ గత ఏడాది ఏప్రిల్‌ నెలలో ట్విట్టర్‌ వేదికగా ప్రకటించినా  ఇంత వరకు ఆ పనుల్లో ఎలాంటి కదలిక లేకపోవడం గమనార్హం.

వీకెండ్‌లో వేలాదిగా సందర్శకులు ...

అనంతగిరి కొండల్లోని ఆహ్లాదకరమైన వాతావరణం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. రోజూ పని ఒత్తిళ్లతో మునిగి తేలే ప్రజలు సేదతీరేందుకు అనంతగిరి కొండలు అనువైన ప్రాంతం. లోతైన లోయలు, వంపులు తిరిగిన రోడ్డు మలుపులు, పచ్చని చెట్ల సమూహాలతో అనంతగిరి కొండలు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అనంతగిరి కొండలు రాష్ట్రంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. హైదరాబాద్‌కు సమీపంలో అనంతగిరి కొండల వంటి ఆహ్లాదకరమైన ప్రాంతం మరొకటి లేకపోవంతో ఇక్కడికి వారాంతాల్లో అధిక సంఖ్యలో వస్తుంటారు. ఘాట్‌ రోడ్డులోని భారీ నంది విగ్రహం అనంతగిరి కొండలకే హైలెట్‌గా మారింది. శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో అనంతగిరి కొండలు వేలాది మంది సందర్శకులతో కిటకిటలాడుతుంటాయి. పర్యాటకుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది.  

Read more