నాలుగేళ్లయినా మినీ ఫంక్షన్‌హాల్‌ నిర్మాణమేది?

ABN , First Publish Date - 2022-04-25T05:19:24+05:30 IST

నాలుగేళ్లయినా మినీ ఫంక్షన్‌హాల్‌ నిర్మాణమేది?

నాలుగేళ్లయినా మినీ ఫంక్షన్‌హాల్‌ నిర్మాణమేది?
అంకుశాపూర్‌లో అసంపూర్తిగా ఉన్న మినీ ఫంక్షన్‌ హాల్‌


  • రెండుసార్లు శంకుస్థాపనలు
  • నిధుల్లేక నిలిచిన పనులు

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 24: దళితుల అభ్యున్నతికి కృషిచేస్తున్నట్టట చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం విఫలమైంది. ప్రజాప్రతినిధులు పేరుకు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు తప్పితే పనులు చేయించడం లేదు. దీనికి ప్రబల ఉదాహరణే అంకుశాపూర్‌ ఎస్సీ కాలనీలో మినీ ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణం. పనులకు నాలుగేళ్ల కింద మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ పనులు పిల్లర్ల వద్దే నిలిచాయి. నాటి ఎంపీపీ శ్రీనివా్‌సగౌడ్‌ మినీ ఫంక్షన్‌హాల్‌కు మండల పరిషత్‌ నిధులు రూ.10లక్షలు, పంచాయతీ నిధులు రూ.5లక్షలతో మినీ ఫంక్షన్‌ హాల్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. 2017 నవంబర్‌ 27న మండల పరిషత్‌ నుండి రూ.6లక్షల మంజురుతో ప్రొసీడింగ్‌ ఇచ్చారు. పనులకు అప్పటి ఎమ్మెల్యే, ఎంపీపీ శంకుస్థాపన చేసిన కొద్ద నెలల్లోనే ఎన్నికలు రావడంతో పనులు నిలిచాయి. నిధులు లాప్స్‌ అయ్యాయి. ఫంక్షన్‌ హాల్‌కు మరోసారి 2019లో మంత్రి సీహెచ్‌.మల్లారెడ్డి, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి భూమిపూజ చేశారు. కాంట్రాక్టర్‌ పిల్లర్లను రెండు ఇంచ్‌ల మందం వేసి వాటిపైన ఇనుప స్తంభాలను నిర్మించాడు. ఫంక్షన్‌ హాల్‌ కోసం తెచ్చిన రేకులు, ఫ్రేంలు నిరుపయోగంగా పడిఉన్నాయి. 

నిధులివ్వని ప్రభుత్వం.. పనులు ఆపిన కాంట్రాక్టర్‌

కాంట్రాక్టర్‌ రూ.నాలుగైదు లక్షల వరకు వెచ్చించి నిర్మాణ పనులు చేశాడు. మిగిలిన పనులకు మండల పరిషత్‌ నిధులు ఇవ్వకపోవడంతో పనులను నిలిపేశాడు. తమ కాలనీలో ఫంక్షన్‌ హాల్‌ వస్తే పెళ్లిళ్లు, ఇతర వేడుకలు నిర్వహించుకోవచ్చని అనుకున్న దళితులకు నిరాశేమిగిలింది. ప్రజాప్రతినిధులు చెప్పేవన్నీ అబద్ధాలేనని, ఏండ్ల కింద శంకుస్థాపన చేసిన పనులకు ఇంకా ఎందుకు పూర్తి చేయలేదని అంటున్నారు. ఇప్పటికైనా మినీ ఫంక్షన్‌హాల్‌ నిర్మాణానికి నిధులు కేటాయించి పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నారు. 

వినియోగంలోకి తేవాలి

మినీ ఫంక్షన్‌హాల్‌ పనులను త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలి. ఇక్కడ అందరం పేద దళితులమేఉన్నాం. ప్రైవేట్‌ ఫంక్షన్‌హాళ్లలో శుభకార్యాలు చేయాలంటే భారీగా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. మా బస్తీలో ఉన్న మినీ ఫంక్షన్‌హాల్‌ను త్వరగా పూర్తిచేస్తే మా పేదలకు మేలు జరుగుతుంది.

- కప్పరగల్ల ఆంజనేయులు, అంకుశాపూర్‌

నిధులు విడుదల చేయాలి 

నిధులు లేక మినీఫంక్షన్‌ హాల్‌ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మండల పరిషత్‌లో నిధులు లేకుంటే మంత్రి మల్లారెడ్డి దృష్టిపెట్టి ఫంక్షన్‌హాల్‌ నిర్మాణం పూర్తయ్యేలా చూడాలి. ఏళ్ల కింద ప్రారంభించిన పనులు ఇంకా కొనసాగడం సరికాదు. ఇంత కాలం గ్యాప్‌ ఇచ్చి కట్టిన నిర్మాణం పటిష్టంగా ఉండదు. మంత్రి మల్లారెడ్డి చొరవ తీసుకుంటే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.

- గంగి శంకర్‌, వార్డు మెంబర్‌, అంకుశాపూర్‌ 

నిధుల్లేకే నిర్మాణంలో జాప్యం 

మండలానికి నేను ఈ మధ్యనే వచ్చాను. ఉద్యోగ బాధ్యతలు ఇంకా తీసుకోలేదు. అంకుశాపూర్‌లో మినీ ఫంక్షన్‌హాల్‌ నిర్మాణం నిధులు లేకే నిలిచిపోయిందని తెలిసింది. ప్రభుత్వం నిధులు మంజురు చేయగానే మొదట ఫంక్షన్‌హాల్‌ నిర్మాణంపైనే దృష్టి పెడతాం. ఈ ఏడాదిలోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.

- వెంకట్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌ ఏఈ

Read more